logo

రుణమాఫీ నిధులు అందేనా..!

పంటరుణమాఫీ నిధుల కోసం అన్నదాతలు పడిగాపులు పడుతున్నారు. ఒక్కో రైతుకు రూ.లక్ష వరకు పంట రుణాన్ని మాఫీచేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో ప్రకటించగా పూర్తిస్థాయి నిధుల విడుదలపై ఇప్పటికీ స్పష్టతలేక కర్షకులు

Published : 10 Aug 2022 04:55 IST

అన్నదాతలకు తప్పని నిరీక్షణ
జగిత్యాల వాణిజ్యం, న్యూస్‌టుడే

పంటరుణమాఫీ నిధుల కోసం అన్నదాతలు పడిగాపులు పడుతున్నారు. ఒక్కో రైతుకు రూ.లక్ష వరకు పంట రుణాన్ని మాఫీచేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో ప్రకటించగా పూర్తిస్థాయి నిధుల విడుదలపై ఇప్పటికీ స్పష్టతలేక కర్షకులు కలవరపడుతున్నారు. ప్రభుత్వ హామీ మేరకు 2018 డిసెంబరు 11వ తేదీకంటే ముందు తీసుకున్న రూ.లక్షలోపు రుణాలకు మాఫీ వర్తిస్తుందని కటాఫ్‌ తేదీని ప్రకటించారు. ఈ క్రమంలో జిల్లాలో మొత్తం 1.03 లక్షల మంది రైతులకు రూ.711.62 కోట్ల పంటరుణ మాఫీ నిధులు అందించాల్సి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు రెండేళ్లక్రితం రూ.25 వేలవరకు పంటరుణం గల 9,328 మంది రైతులకు రూ.13.81 కోట్ల మాఫీ నిధులను విడుదల చేశారు. రూ.25 వేలనుంచి రూ.50 వేల వరకు పంటరుణ మాఫీ మొత్తాన్ని 2021 ఆగస్టు నెలాఖరులోగా రైతుల ఖాతాలకు జమచేస్తామని ప్రభుత్వం ప్రకటించినా కొన్ని రోజులపాటు మాత్రమే రూ.33 వేల వరకు రుణమున్న కొందరికే నిధులను బదిలీచేశారు. 2022 ఆగస్టు వచ్చినా కనీసం రూ.50 వేల వరకుకూడా మాఫీ నిధులను విడుదల చేయకపోవటంతో ఇక నిధులు ఇస్తారా ఇవ్వారా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

2022 మార్చి నెలలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో పంటరుణ మాఫీకిగాను రూ.16,144 కోట్లను కేటాయించి మార్చి నెలాఖరులోపు రూ.50 వేల వరకుగల రుణాలకు నిధులను విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో జిల్లాలో రూ.50 వేల వరకు పంటరుణం గల 16,796 మందికి రూ. 58.88 కోట్ల నిధులు రావాల్సిఉండగా ఇప్పటికీ నిధులను విడుదల చేయటంలేదు. రూ.50వేల నుంచి రూ.75వేల వరకు రుణమున్న రైతులకు ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరంలో నిధులను విడుదల చేసి రూ.75 వేల నుంచి రూ.1 లక్ష వరకు గల రైతులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో నిధులను అందిస్తామని ప్రభుత్వం పేర్కొన్నా ఎంతమంది రైతులకు పంట రుణమాఫీ నిధులందుతాయనేది సందేహంగా మారింది.

రాష్ట్రప్రభుత్వం 2014లో తొలిసారి రూ.ఒక లక్ష వరకు పంటరుణాన్ని మాఫీ చేసినపుడు నిధులను నేరుగా రైతుల ఎస్‌బీ ఖాతాలకు విడుదల చేశారు. ఈ మొత్తాన్ని ఏడాదికి పావుశాతం చొప్పున నాలుగేళ్లలో నాలుగు దఫాలుగా రైతులకు అందించారు. కాగా ప్రస్తుతం మాఫీ నిధులను రైతుల ఎస్‌బీ ఖాతాలకు కాకుండా నేరుగా పంటరుణ ఖాతాకే బదిలీచేయటం పెద్దసమస్యగా మారింది. కొన్ని బ్యాంకుల విలీనం, రైతుల రుణఖాతా నెంబరు మారటం, బంగారం కుదువపెట్టి తీసుకున్న సాగురుణ ఖాతాలను మూసేయటం, బ్యాంకులు మారటం తదితర కారణాలతో వేలాదిమంది నిధులందే అవకాశాన్ని కోల్పోయారు. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగా పొదుపు ఖాతాలకు నిధులను విడుదల చేయాలని, ప్రభుత్వ ఏర్పడి నాలుగో సంవత్సరంనకు చేరినందున రూ.లక్ష వరకు పంటరుణాన్ని ఒకేదఫాలో మాఫీచేయాలని రైతులు కోరుతున్నారు.

వివరాలు గతంలోనే సమర్పించాం
- పాక సురేశ్‌కుమార్‌, వ్యవసాయాధికారి, జగిత్యాల జిల్లా

జిల్లాలో రుణమాఫీకి అర్హులైన రైతుల జాబితాను గతంలోనే ప్రభుత్వానికి సమర్పించాము. దాదాపుగా రూ.33 వేల వరకు పంటరుణం గలవారికి నిధులందాయి. నిధులు చేరిన రైతుల జాబితాలు సైతం ప్రభుత్వం వద్దే ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని