logo

సామాజిక ఆసుపత్రి సేవలు కలేనా?

మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సామాజిక ఆరోగ్యకేంద్రంగా మారుస్తున్నట్లు దశాబ్దం క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానికి అనుగుణంగా ఆ సమయంలో 30 పడకలకు సరిపడా నూతన భవనం సైతం

Published : 10 Aug 2022 04:55 IST

పేరు మార్చినా అందని వైద్యం

చొప్పదండి సామాజిక ఆసుపత్రి భవనం

చొప్పదండి, న్యూస్‌టుడే: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సామాజిక ఆరోగ్యకేంద్రంగా మారుస్తున్నట్లు దశాబ్దం క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానికి అనుగుణంగా ఆ సమయంలో 30 పడకలకు సరిపడా నూతన భవనం సైతం నిర్మించారు. సామాజిక ఆరోగ్యకేంద్రంగా పేరు మార్చడంతో పాటు వైద్యాధికారులను, కావాల్సిన సిబ్బందిని సమకూర్చారు. అది కాస్తా మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. ప్రభుత్వం ఒక్కో అధికారిని డిప్యూటేషన్‌ల పేరుతో ఇతర ఆసుపత్రులకు బదిలీచేస్తున్నారు. చొప్పదండిలో ప్రజలు ఆశించిన వైద్యసేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కాగితాలకే పరిమితం
సామాజిక ఆరోగ్యకేంద్రంగా మార్చడంతో 30 పడకలతో పాటు 24 గంటలపాటు వైద్యసేవలు అందుతాయని అంతా భావించి అవి కాస్తా కాగితాలకే పరిమితమయ్యాయి. గతంలో జనరల్‌ వైద్యసేవలు, మహిళ, శిశువైద్య నిపుణులు, దంతవైద్యులను నియమించినప్పటికి వారికి ఎక్కువ కాలం ఇక్కడ పనిచేయకుండా డిప్యూటేషన్‌ల పేరుతో తరుచు మారుస్తున్నారు. గతంలో వారానికి 15కి పైగా ప్రసవాలు జరిగేవి. ఇప్పుడు మహిళా వైద్యురాలిని డిప్యూటేషన్‌పై పంపించడంతో అవి కాస్తా జరగడంలేదు. కరీంనగర్‌ మాతా శిశు ఆసుపత్రికి తరలిస్తున్నారు. వైద్యులు ఉదయం పూటనే అందుబాటులో ఉండటంతో అత్యవసర సమయాల్లో స్టాఫ్‌నర్సులే దిక్కవుతున్నారు. మరి అత్యవసరమైతే కరీంనగర్‌కు సిఫారసు చేస్తున్నారు.

మూలకు చేరిన పరికరాలు
గర్భిణులు పరీక్షల నిమిత్తం మూడేళ్ల కిందట స్కానింగ్‌ మిషన్‌ కొనుగోలు చేసినప్పటికీ టెక్నిషియన్‌ లేకపోవడంతో అది కాస్తా మూలకు చేరింది. కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.వెయ్యికి పైగా వెచ్చించి స్కానింగ్‌ తీసుకుంటున్నారు. రక్త, మూత్ర పరీక్షలు సైతం నమూనాలు తీసుకుని కరీంనగర్‌కు పంపిస్తుండటంతో వాటి ఫలితాలు ఆలస్యంగా వస్తున్నాయి. పలువురు దాతలు ఇచ్చిన బెడ్లు సైతం వినియోగించకపోవడంతో అవి కూడా మూలకు చేరాయి.

పేరుకే..
ఇటీవల రాష్ట్రంలోని 64 పీహెచ్‌సీలను సామాజిక ఆసుపత్రులుగా మార్చడంతో పాటు వాటిని వైద్యవిధాన పరిషత్‌కు బదిలీ చేశారు. కానీ చొప్పదండి ఇప్పటికే సామాజిక ఆసుపత్రిగా ఉన్నప్పటికి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా విస్మరించారు. గత దశాబ్దం క్రితం చొప్పదండితో పాటు ఉమ్మడి జిల్లాలోని హుస్నాబాద్‌, కమలాపూర్‌, వేములవాడ, ధర్మపురి, రాయికల్‌, గంభీరావుపేట సామాజిక ఆసుపత్రి(సీహెచ్‌సీ)గా మార్చి దానికి అనుగుణంగా సేవలు అందిస్తున్నారు. కానీ చొప్పదండిలో మాత్రం పీహెచ్‌సీ సేవలకే పరిమితమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని