logo

తెగువ చూపారు.. జెండా ఎగురవేశారు!

దేశమంతటా స్వాతంత్య్ర కాంతులు.. అయినా నిజాం నిరంకుశ పాలనలో చీకట్లు.. ఆనాటి రజాకార్ల దమన నీతిని ధైర్యంగా ఎదుర్కొని ధర్మపురిలో పురాతన చారిత్రాత్మక భవనంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.. సాయుధ

Published : 10 Aug 2022 04:55 IST

ధర్మపురి స్వాతంత్య్ర సమరయోధుల పోరాట స్ఫూర్తి

సంగనభట్ల మాణిక్యశాస్త్రి, కేవీ కేశవులు

న్యూస్‌టుడే, ధర్మపురి: దేశమంతటా స్వాతంత్య్ర కాంతులు.. అయినా నిజాం నిరంకుశ పాలనలో చీకట్లు.. ఆనాటి రజాకార్ల దమన నీతిని ధైర్యంగా ఎదుర్కొని ధర్మపురిలో పురాతన చారిత్రాత్మక భవనంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.. సాయుధ పోలీసులు చేరుకునేలోపే చాకచక్యంగా తప్పించుకున్నారు. రజాకార్లను ముప్పుతిప్పలు పెడుతూ.. నిండు గోదావరిని దాటి మంచిర్యాల రైలుమార్గంలో మహారాష్ట్రలోని నాగపూర్‌కు చేరుకొని మిలట్రీ శిబిరంలో శిక్షణ పొందారు..ధర్మపురికి చెందిన మాజీ మంత్రి దివంగత కేవీ కేశవులు, స్వాతంత్య్ర సమరయోధులు సంగనభట్ల మాణిక్యశాస్త్రి అన్యోన్య స్నేహితులు.. రేడియో ద్వారా స్వాతంత్య్ర పోరాట విశేషాలను అవగాహన చేసుకుని ఈ ప్రాంత ప్రజలను చైతన్యపర్చేవారు. 14వ తేదీ 1947న అర్ధరాత్రి రేడియో ద్వారా స్వాతంత్య్రం వచ్చిందనే విషయాన్ని తెలుసుకొని అత్యవసరంగా అర్ధరాత్రి ధర్మపురిలోని కేవీ కేశవులు ఇంటిలో రహస్యంగా పోరాట యోధులతో సమావేశం నిర్వహించారు. నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని తీర్మానించారు. వెంటనే రాత్రికి రాత్రే త్రివర్ణ పతాకాన్ని ఈ భవనంపై ఎగురవేశారు. రజాకార్లు చేరుకునే సరికి చాకచక్యంగా తప్పించుకుని, నిండు గోదావరిలోకి దూకి తెప్పపై అవతలి తీరానికి, అక్కడి నుంచి మంచిర్యాల రైల్వే మార్గానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నాగపూర్‌ స్వాతంత్య్ర సమరయోధుల క్యాంప్‌కి వెళ్లి చాలా నెలల పాటు శిక్షణ పొందారు. ఆనాటి వీరి పోరాట స్ఫూర్తిని స్థానికులు నెమరు వేసుకుంటున్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల నేపథ్యంలో నాటి పోరాటానికి గుర్తుకు మిగిలిన పురాతన భవనాన్ని అలంకరించి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు.

కేవీ కేశవులు ఇంటిపై జెండా ఆవిష్కరణ


జైహింద్‌ ప్రోత్సాహకుల ముందడుగు.. 72 ఏళ్ల కిందటి మహాత్ముడి విగ్రహం

జమ్మికుంటలో గాంధీజీ విగ్రహం

న్యూస్‌టుడే, జమ్మికుంట: జైహింద్‌ ప్రోత్సాహకులు ముందడుగుతో 72 ఏళ్ల  కిందట ఆవిష్కరించిన మహాత్మా గాంధీ విగ్రహం దేశభక్తి, స్వాతంత్య్ర కీర్తిని, మహాత్ముడి  ఆశయాలను స్ఫూర్తింపజేస్తోంది. నాడు రైలు మార్గంలో గాంధీజీ ప్రయాణం సందర్భంగా జమ్మికుంట రైల్వేస్టేషన్‌లో  పలువురు గాంధీని పలువురు కలిశారని చెపుతుంటారు. వావిలాలలో గాంధీజీ శిష్యులు అన్నాసాహెబ్‌ సహస్రబుద్దే, లేలేజీలు 1929లో మహారాష్ట్ర చరఖా సంఘ్‌ను ప్రారంభించటంతోనూ, జమ్మికుంటలో గాంధీజీ విగ్రహం ఏర్పాటుకు ముందుకు రావటం విశేషం. మద్రాస్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీతో రూ11వేల వ్యయంతో గాంధీజీ విగ్రహాన్ని తయారు చేయించి తీసుకురావటం విశేషం. పట్టణ కూడలిలో గాంధీ విగ్రహం ఏర్పాటుకు నవంబర్‌ 3న కరీంనగర్‌ జిల్లా సివిల్‌ అడ్మినిస్ట్రేటర్‌ ఎ.సత్యనారాయణమూర్తి శంకుస్థాపన చేశారు.  విగ్రహాన్ని ఫిబ్రవరి 2, 1950లో అప్పటి హైదరాబాద్‌ ప్రభుత్వ ప్రధాన మంత్రి ఎమ్‌. కె.వెల్లోడి (సీఐఐసీఎస్‌) ఆవిష్కరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని