logo

ఉద్యమ చరిత... పోరాటాల ఘనత

స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు కళ్లముందు కనిపిస్తున్న ప్రస్తుత తరుణాన.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఉప్పొంగే పోరాట స్ఫూర్తి నరనరాన కనిపిస్తోంది. గత తాలుకు పోరాటాల చరితను గురుతు చేసుకుంటోంది. ఉద్యమాల జిల్లాగా భాసిల్లిన ఈ నేలపై

Published : 10 Aug 2022 04:55 IST

త్యాగధనుల పురిటిగడ్డ ఉమ్మడి కరీంనగర్‌
ఈనాడు, కరీంనగర్‌ న్యూస్‌టుడే- కరీంనగర్‌ పట్టణం

స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు కళ్లముందు కనిపిస్తున్న ప్రస్తుత తరుణాన.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఉప్పొంగే పోరాట స్ఫూర్తి నరనరాన కనిపిస్తోంది. గత తాలుకు పోరాటాల చరితను గురుతు చేసుకుంటోంది. ఉద్యమాల జిల్లాగా భాసిల్లిన ఈ నేలపై ఎందరో త్యాగధనులు అందించిన సేవలు మరువలేనివి. తిరగబడ్డ పోరుగడ్డగా పేరొందిన కరీంనగర్‌ తెలంగాణకే ఉద్యమాలకు ఊపిరి పోసిన ప్రాంతంగా ఆదర్శంగా నిలిచింది. ఓ వైపు స్వాతంత్య్ర సంగ్రామ పోరాటం.. మరోవైపు తరతరాలుగా సాగిన నిజాం నిరంకుశ పాలన విముక్తి కోసం సాగించిన సాయుధ సమరం.. ఇలా రెండింటిపై అలుపెరగని పోరు సల్పిన అగ్నిశిఖగా ఈ గడ్డ పేరొందింది. మడమ తిప్పని యోధుల పుట్టిల్లుగానే మారింది. నాటి నుంచి నేటి దాకా అన్నింటా అదే స్ఫూర్తితో భవిత దిశగా అడుగులేస్తోంది.

సిరిసిల్లలో ఆంధ్రా మహాసభలో పాల్గొన్న యోధులు

బాటలు వేసిన సిరిసిల్ల..!
కరీంనగర్‌ జిల్లా అంటేనే కదనరంగమనేలా ఖ్యాతిని మూటగట్టుకుంది. స్వాతంత్య్ర ఉద్యమంలోనూ సాయుధ పోరాటంలోనూ కీలక భూమిక పోషించింది. ముఖ్యంగా స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో సిరిసిల్ల కేంద్రంగా 1935 జనవరి 26,27,28వ తేదీలలో జరిగిన ఆంధ్ర మహాసభ ఇక్కడి పోరాట యోధుల్లో అమితమైన ఆత్మవిశ్వాసాన్ని నింపింది. మాడపాటి హన్మంతరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆంగ్లేయుల అరాచకాలకు వ్యతిరేకంగా కీలకమైన తీర్మానాల్ని చేశారు. సురవరం ప్రతాపరెడ్డి, రావినారాయణరెడ్డిలాంటి యోధులు పాల్గొన్న ఈ సమావేశంలో జిల్లాకు చెందిన బద్దం ఎల్లారెడ్డి, పీవీ నర్సింహారావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి, సీహెచ్‌ రాజేశ్వర్‌రావు సహా ఎందరో పోరాటపటిమగల మన వీరులు పాల్గొన్నారు. ఇదే ప్రాంగణంలో జరిగిన మహిళా సభకు కూడా ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు మహిళలు పాల్గొన్నారు. ఈసభ ప్రభావంతోనే ఊరూర బాలందడుతోపాటు మహిళలు సాయుధాలను పట్టేలా పోరాట పటిమను అందరిలో పెంపొందించారు. సామాన్యులే బందూకులు పట్టి చారిత్రాత్మకమైన పోరులో భాగస్వామ్యమయ్యారు. సాయుధ గెరిల్లాలుగా, నాయకులుగా అగ్రభాగాన నిలుస్తూ అలుపెరగని ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేయడంలో ముఖ్య పాత్రను పలువురు పోషించారు.

మహ్మదాపూర్‌లో అమరవీరుల స్తూపం

తిరగబడ్డ పల్లెలు..
స్వాతంత్య్ర సంగ్రామం, తెలంగాణ సాయుధ, రైతాంగ గెరిల్లా పోరాటంలో జిల్లాలోని ప్రతి పల్లెకు అనుబంధంముంది. నిజాం సైన్యానికి, రజకార్ల ఆగడాలను ఎదిరించేందుకు ప్రతి పల్లెల్లో ప్రజల నుంచి ఊహించని తిరుగుబాటు ఎదురైంది. ముఖ్యంగా 1946 నుంచి 1948 సెప్టెంబరు వరకు ఊరూర ఉద్రిక్తత అనే పరిస్థితి ఉండేది. సిరిసిల్ల, హుజూరాబాద్‌, హుస్నాబాద్‌, మంథని, పెద్దపల్లి, ఇల్లంతకుంట, గాలిపెల్లి, కరీంనగర్‌, కోనారావుపేట, కోహెడ, ధర్మపురి, జగిత్యాల, భీమదేవరపల్లి తదితర గ్రామాలు రక్తంతో తడిసిపోయాయి.


ఉద్యమసేనానులు..

ద్దం ఎల్లారెడ్డి, అనభేరి ప్రభాకర్‌రావు, సీహెచ్‌ రాజేశ్వరరావులు స్వాతంత్య్ర, సాయుధపోరాట ఘట్టాల్లో తమదైన పాత్రను పోషించారు. ఇల్లంతకుంట మండలం గాలిపెల్లికి చెందిన బద్దం ఎల్లారెడ్డి పోరాట పటిమ నేటి తరానికి స్ఫూర్తిదాయకమే.! నిజాం దురహంకారాన్ని అణచివేతను అంతమొందించేందుకు ఎల్లారెడ్డి 1947 ఆగస్టు 19న గాలిపెల్లిలో జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు 12వేల మందితో సిద్ధమైన తీరు ఆయన పోరాట స్ఫూర్తికి నిదర్శనం.  విద్యార్థి దశనుంచే సిరిసిల్ల జిల్లాకు చెందిన చెన్నమనేని రాజేశ్వర్‌రావు హైద్రాబాద్‌ సంస్థానంలో జెండాను ఎగురవేసిన ధీరుడిగా గుర్తింపును అందుకున్నారు. 17 సంవత్సరాల వయస్సులోనే ఆయన ఉద్యమాల్లో పాల్గొన్నారు.


వీరి పోరాటస్ఫూర్తి ఆదర్శమే..!

విద్యార్థి  దశలోనే స్వాతంత్య్ర ఉద్యమంలో చేరిన జువ్వాడి గౌతంరావు ఆదర్శంగా నిలిచారు. ఉద్యమంలో పాల్గొన్న ఆయన్ని కరీంనగర్‌, వరంగల్‌ జైళ్లో ఉంచారు. ఔరంగాబాద్‌ జైలు నుంచి తప్పించుకుని వచ్చిన ఆయన బద్దం ఎల్లారెడ్డిలాంటి ఉద్యమనాయకుల పర్యవేక్షణలో పనిచేశారు.

1947లో ప్రైవేటు ఉపాధ్యాయునిగా పాఠశాలను నడిపే చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన దేశిని చినమల్లయ్య నాటి పోరాటానికి సై అన్నారు. వందలాది మందిని సమీకరించి ఊళ్లల్లో ర్యాలీలు తీయించారు.ఆయా గ్రామాల సమాచారాన్ని సేకరిస్తూ కొరియర్‌గా వ్యవహరించారు.


బోయినిపల్లి వెంకటరామారావు (బోవెరా) గాంధీ మహాత్ముడి స్ఫూర్తితో పోరాటాన్ని సాగించారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత నిజాం సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావాలనేలా నినాదాలు చేశారు. నిజాం పోలీసులు ఆయన ఇంటిని ధ్వంసం చేసినా పోరుబాటను వీడలేదు.


చందుర్తి మండలం బండపల్లికి చెందిన గడ్డం తిరుపతిరెడ్డి నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నారు. నిజాం పాలనకు, భూస్వాములకు వ్యతిరేకంగా పలు కార్యక్రమాల్ని నిర్వహించేవారు. కారాగారంలో మూడేళ్లు ఖైదీగా ఉన్నారు. ఊళ్లల్లో పోరాటానికి నేతృత్వాన్ని వహించారు.


సిరిసిల్లకు చెందిన అమృత్‌లాల్‌ శుక్లా ఎదురుదాడుల్లో ఉత్సాహంగా పాల్గొనేవారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడమే కష్టమనిపించే నాటి రోజుల్లో ఏకంగా హుజూరాబాద్‌, సిరిసిల్ల, ఇల్లంతకుంట, సైదాపూర్‌, నిమ్మపల్లి ఠాణాలపై తన అనుచరులతో కలిసి దాడులు చేశారు.


భీమదేవరపల్లి మండలం ముల్కనూరుకు చెందిన బొజ్జపురి వెంకటయ్యా స్వాతంత్య్ర ఉద్యమాలకు ఆకర్శితులై బుర్రకథలతో ఊరూర చైతన్యాన్ని నింపేవారు. ఆంగ్లేయుల పాలనలో మగ్గుతున్న భారతావని పడతున్న ఇబ్బందుల్ని తెలియజెప్పుతూ ఇతరుల్లో పోరాట స్ఫూర్తిని నింపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని