logo

వైద్య సీట్లలో స్థానికత, రిజర్వేషన్లు కల్పించాలి

రాష్ట్రంలో ప్రైవేట్‌ వైద్య కళాశాలలో ప్రవేశాలకు ఏ కేటగిరీ మాదిరిగానే బీ, సీ కేటగిరీ కేటాయింపులలో సైతం స్థానికత, సామాజిక రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం

Published : 10 Aug 2022 04:55 IST

పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

కరీంనగర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రైవేట్‌ వైద్య కళాశాలలో ప్రవేశాలకు ఏ కేటగిరీ మాదిరిగానే బీ, సీ కేటగిరీ కేటాయింపులలో సైతం స్థానికత, సామాజిక రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో  మూడు వేల సీట్లు ఉంటే, వాటిలో సగానికి మాత్రమే స్థానిక, సామాజిక రిజర్వేషన్లు అమలు కాగా, మిగిలిన సీట్లకు అమలు కావట్లేదన్నారు. ఈ విధానం వల్ల జరిగే నష్టాన్ని గుర్తించిన మహారాష్ట్ర, గుజరాత్‌, ఒడిశా, పంజాబ్‌, జమ్ము, కశ్మీర్‌ రాష్ట్రాలు తమ విధానం మార్చుకున్నాయని తెలిపారు. ఆ రాష్ట్రాల్లో బీ, సీ కేటగిరిల్లో సైతం స్థానికత, సామాజిక పరమైన రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉద్యమ నాయకుడైన మన సీఎం ఈ విధానంలో మార్పు తీసుకురావాలని, లేదంటే ఆయనకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో మరో ఉద్యమ నాయకుడైన ఆరోగ్య శాఖ మంత్రి సైతం దృష్టి సారించాలని కోరారు.

మునుగోడు సీటు నాడు, నేడు కాంగ్రెస్‌దే
మునుగోడు ఎమ్మెల్యే స్థానం నాడు నేడు కాంగ్రెస్‌ పార్టీదేనన్నారు.  నిండు పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రధాని మోదీ తప్పుబట్టారని తెలిపారు. తెలంగాణకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఐటీఐఆర్‌ రద్దు చేసిందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతతో పాటు భాజపా వివక్షనే ప్రధాన కారణమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో కమీషన్లు అని నిత్యం విమర్శించే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాటలను విశ్వసించే పరిస్థితి లేదన్నారు. ఆ రెండు పార్టీలు పరస్పర అంగీకారంతోనే పనిచేస్తున్నాయని, మునుగోడులో రెండో స్థానం కోసమే ఆ పార్టీలు పోటీ పడుతున్నాయని తెలిపారు. సమావేశంలో నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని