logo

చేపల పెంపకానికి ప్రోత్సాహమేదీ!

మూస విధానంలో వ్యవసాయంతో రైతులకు నష్టాలే ఎదురవుతున్నాయి. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తే గిట్టుబాటు ధర కరవవుతోంది. ప్రకృతి విపత్తుల సమయంలో నిండా మునిగినా నష్ట పరిహారం అందడం లేదు. ఈ

Published : 10 Aug 2022 04:55 IST

పీఎంఎస్‌ఎస్‌వై నిధుల మంజూరుకు రైతుల నిరీక్షణ

గుంపుల శివారులో చేపల పెంపకానికి ఏర్పాటు చేసిన గుంత

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి: మూస విధానంలో వ్యవసాయంతో రైతులకు నష్టాలే ఎదురవుతున్నాయి. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తే గిట్టుబాటు ధర కరవవుతోంది. ప్రకృతి విపత్తుల సమయంలో నిండా మునిగినా నష్ట పరిహారం అందడం లేదు. ఈ నేపథ్యంలో అనుబంధ రంగాల వైపు అన్నదాత ఆసక్తి చూపుతున్నాడు. అయితే ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తున్నా సక్రమంగా అమలుకు నోచుకోక ఎదురుచూపులే మిగులుతున్నాయి.

పొలంలోనే గుంతలు తవ్వి చేపల పెంపకం చేపట్టే రైతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇలాంటి వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్‌వై)ను అమలు చేస్తోంది. ఈ పథకం కింద పలు రాయితీలు వర్తిస్తున్నా నిధులు కేటాయించకపోవడంతో బృహత్తర పథకం నీరుగారిపోతోంది. ఓదెల మండలం గుంపుల గ్రామంలో నీటి ఎద్దడి కారణంగా పదుల సంఖ్యలో రైతులు భూములను బీడుగా వదిలేశారు. గ్రామానికి చెందిన తాళ్లపల్లి మొగిళి మాత్రం వినూత్నంగా ఆలోచించారు. పొలంలో టార్పాలిన్లతో కృత్రిమ కుంటలు ఏర్పాటు చేసి, మినీ చేపల చెరువులుగా మార్చారు. ఈయన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు నిధులు విడుదల చేయడం లేదు.
ఏమిటీ ఈ పథకం!
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనను 2020 సెప్టెంబరులో ప్రవేశపెట్టారు. వ్యవసాయ భూముల్లోని ఖాళీ స్థలాల్లో, బీడు భూముల్లో సేద్యపు గుంతలు ఏర్పాటు చేసుకుని చేపల పెంపకంతో ఆర్థికాభివృద్ధిని సాధించడమే పథకం ముఖ్య ఉద్దేశం. పథకం యూనిట్‌ వ్యయాన్ని రూ.7 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల్లో పురుషులకు 40 శాతం, మహిళలకు 60 శాతం రాయితీలు వర్తింపజేస్తారు. జిల్లా పాలనాధికారి అధ్యక్షతన వ్యవసాయ, భూగర్భ జల, మత్స్య, నీటిపారుదల శాఖాధికారులతో కూడిన కమిటీ సమావేశమై లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. పథకం కింద జిల్లాలో 2020-21లో 49, 2022-23లో 43 దరఖాస్తులు వచ్చాయి. కాగా నిధులు విడుదల కాలేదనే కారణంతో ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఎవరికీ పథకం కింద ఫిష్‌పాండ్స్‌ యూనిట్లు కేటాయించలేదు.

నెలకు రూ.70 వేల పెట్టుబడి: తాళ్లపల్లి మొగిళి, రైతు
నాకున్న 10 గుంటల పొలంలో రూ.6 లక్షలు వెచ్చించి రెండు భారీ గుంతలు తవ్వి టార్పాలిన్లు వేసి కొలనులు ఏర్పాటు చేశాను. ఏపీలోని ఏలూరు నుంచి 4 వేల కొర్రమీను రకం చేప పిల్లలను కిలోకు రూ.120 చొప్పున కొనుగోలు చేసి తీసుకొచ్చాం. ప్రతి రోజూ రూ.2,250 విలువైన దాణాను వేస్తున్నాం. ఇందుకోసం రూ.67,500, విద్యుత్తు, ఇతరత్రా నిర్వహణ ఖర్చులు రూ.3 వేలతో కలిపి ప్రతి నెలా మొత్తం రూ.70,500 వరకు ఖర్చవుతోంది. ఏప్రిల్‌లో వేసిన చేప పిల్లలు ఆగస్టు నెలాఖరు వరకు చేతికందనున్నాయి. బహిరంగ మార్కెట్‌లో టోకున రూ.250, రిటైల్‌గా రూ.450 ధర పలుకుతోంది. దాణాకు రాయితీ లేకపోవడంతో కిలో రూ.125 పెట్టాల్సి వస్తోంది. రాయితీ పథకం వర్తింపజేస్తే కొంతైనా ఆసరాగా ఉండేది.

నిధుల మంజూరులో జాప్యంతోనే..: భాస్కర్‌, జిల్లా మత్స్య శాఖాధికారి
జిల్లాలో ఓదెల మండలం గుంపుల, జూలపల్లి మండలం వడ్కాపూర్‌ గ్రామాల్లోనే ఫిష్‌ పాండ్‌ కల్చర్‌ను రైతులు సొంతంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అమలులో ఉన్నా నిధులు కేటాయించలేదు. రెండేళ్లలో 92 దరఖాస్తులు వచ్చినప్పటికీ నిధులు మంజూరు చేయలేదు. దీంతో పథకం అమలులో జాప్యం జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని