logo

మాతా శిశువులకు అభయం

కరోనా సోకిన గర్భిణులకు వైద్యం అందిస్తూ.. బాధితుల్లో భరోసా నింపుతూ ఖని వైద్యులు, నర్సులు ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో పాటు తీవ్రమైన లక్షణాలతో రోగులు ఇబ్బంది పడుతున్న తరుణంలో కొవిడ్‌ ఐసోలేషన్‌

Published : 10 Aug 2022 04:55 IST

కరోనా సోకిన గర్భిణులకు ప్రసవాలు
న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం

బాధిత మహిళకు శస్త్రచికిత్స చేస్తున్న వైద్యులు, శిశువుతో సిబ్బంది

రోనా సోకిన గర్భిణులకు వైద్యం అందిస్తూ.. బాధితుల్లో భరోసా నింపుతూ ఖని వైద్యులు, నర్సులు ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో పాటు తీవ్రమైన లక్షణాలతో రోగులు ఇబ్బంది పడుతున్న తరుణంలో కొవిడ్‌ ఐసోలేషన్‌ కేంద్రంలో వైద్యులు, వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ రోగుల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా సేవలు అందిస్తున్నారు. మరోవైపు కరోనా బారిన పడ్డ గర్భిణులకు ప్రసవాలను చేయడం ఛాలెంజ్‌గా తీసుకొని ముందుకు సాగుతున్నారు. గత నెల రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.. దాదాపు 5 మంది గర్భిణులకు కరోనా నిబంధనలతో ప్రసవాలు చేశారు. మొదట్లో కరోనా సోకిన గర్భిణులకు ప్రసవాలంటే హైదరాబాద్‌, వరంగల్‌ తదితర ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చేది.. అలాంటి పరిస్థితుల్లో గర్భిణులు పడుతున్న ఇక్కట్లను తప్పించాలనే భావంతో ఆస్పత్రి నిర్వాహకులు, వైద్యులు, వైద్య సిబ్బంది సమన్వయంతో స్థానికంగానే కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ప్రసవాలు చేయడం మొదలుపెట్టారు. కరోనా సోకిన గర్భిణికి ప్రసవమంటే ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.లక్షకు పైగా చెల్లించాల్సి వచ్చేది.. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా సోకిన గర్భిణులకు సైతం ఉచితంగా ప్రసవాలు చేస్తుండడంతో సహజంగానే ‘ఖని’ ఆస్పత్రికి ‘కరోనా’ ప్రసవాల తాకిడి పెరిగింది. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 60కి పైగా కరోనా ప్రసవాలు జరిగాయి. నిరంతర పర్యవేక్షణతో వైద్య సేవలందిస్తున్నారు. ప్రసవం కాగానే తల్లిని ప్రత్యేక గదిలో ఉంచుతూ బిడ్డను ఆస్పత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు.

బాధితులకు వైద్యుల భరోసా
చాలా మంది గర్భిణులకు కరోనా లక్షణాలు కనిపించకపోగా ప్రసవం కోసం ఆస్పత్రికి వస్తుంటారు. ఆస్పత్రిలో చేర్చుకునే ముందు అవసరమైన వైద్య పరీక్షలతో పాటు కరోనా పరీక్షలు చేస్తారు. కరోనా పాజిటివ్‌ వచ్చిందని తెలియగానే గర్భిణులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది వారికి భరోసా కల్పిస్తున్నారు. ప్రత్యేక వార్డులో ఉంచుతూ పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు కరోనా లక్షణాలకు అనుగుణంగా వైద్య సేవలు అందిస్తున్నారు. గతంలో 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచగా ఇప్పుడు 5 నుంచి 7 రోజుల్లోనే పూర్తిగా కోలుకొని బిడ్డతో పాటు ఇంటికి వెళ్తున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్చి అయి ఇంటికి వెళ్తున్నప్పుడు వారు చూపుతున్న కృతజ్ఞతాభావాన్ని జీవితంలో మర్చిపోలేమని వైద్య సిబ్బంది అంటున్నారు.


బలవర్ధక ఆహారం తీసుకోవాలి
- డాక్టర్‌ కళ్యాణి, స్రీˆ్త వైద్య నిపుణురాలు

గర్భిణుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుండడంతో కరోనా సులువుగా అంటుకుంటోంది. ఈ లక్షణాలు కనిపించినా ఎలాంటి ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు. సాధారణ లక్షణాలుంటే ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటూ బలమైన ఆహారం, పండ్లు తీసుకుంటే సరిపోతుంది. కరోనా తీవ్రంగా ఉంటే నెలలు నిండక ముందే ప్రసవం జరిగే ప్రమాదం ఉన్నందున వెంటనే ఆసుపత్రిలో చేరడం తల్లీబిడ్డకు క్షేమకరం.. రెండేళ్లల్లో కరోనా సోకిన చాలా మందికి ప్రసవాలు చేశాం.


ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
- డాక్టర్‌ ఆర్‌.జె.స్వాతి, స్రీˆ్త వైద్య నిపుణురాలు

కరోనా సోకిందనగానే గర్భిణులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. చాలా మందిలో లక్షణాలు లేకపోయినా పరీక్షల్లో కరోనా సోకినట్లు తేలుతోంది. కొందరు తీవ్రమైన లక్షణాలతో ఆస్పత్రికి వస్తున్నారు. గర్భిణులు సైతం తప్పనిసరిగా కరోనా టీకాలు తీసుకోవాలి. శుభకార్యాలు, సమావేశాలు లాంటి రద్దీ ప్రదేశాలకు వెళ్లకూడదు. వీలైనంత మేరకు ఇంట్లోనే ప్రశాంతంగా ఒంటరిగా ఉండడమే ఆరోగ్యకరం..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని