logo

ఏళ్ల నిరీక్షణకు తెర... దక్కనున్న ఆసరా

ఆదరణ లేని అభాగ్యులకు ఆసరాగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు అందజేస్తుంది. ప్రతి నెలా అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేస్తుంది. చాలా రోజులుగా కొత్త పింఛన్లు మంజూరు కాక దరఖాస్తు చేసుకున్న వారు ఏళ్ల తరబడి

Published : 10 Aug 2022 04:55 IST

సీఎం ప్రకటనతో దరఖాస్తుదారుల్లో ఆశలు
న్యూస్‌టుడే, వీర్నపల్లి

దరణ లేని అభాగ్యులకు ఆసరాగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు అందజేస్తుంది. ప్రతి నెలా అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేస్తుంది. చాలా రోజులుగా కొత్త పింఛన్లు మంజూరు కాక దరఖాస్తు చేసుకున్న వారు ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. ప్రతీ సారి వస్తాయన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయినా లబ్ధి చేకూరలేదు. ఇటీవల సీఎం కేసీఆర్‌ ప్రకటనతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురించాయి.
గతంలో ఎన్నడూ లేని విధంగా 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 2019 నుంచి వృద్ధులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, వితంతువులకు రూ. 2,016, దివ్యాంగులకు రూ. 3,016లకు పింఛను మొత్తాన్ని పెంచింది. జిల్లాలో ప్రస్తుతం 1,06,851 మంది లబ్ధిదారులున్నారు. ప్రతి నెలా రూ. 22.58 కోట్లకు పైగా సాయాన్ని ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేస్తుంది.


* ఈ చిత్రంలోని వ్యక్తి పేరు గంగిపెల్లి ఎల్లయ్య. వీర్నపల్లి మండలం మద్దిమల్ల నివాసి.  భార్య లక్ష్మి పదేళ్ల క్రితమే మృతి చెందగా కొడుకు ఇల్లరికం వెళ్లాడు. దీంతో ఊరికి చివరన ఉన్న పశువుల పాకలో వృద్ధుడు నివసిస్తున్నాడు. రేషన్‌కార్డు లేకపోవడంతో స్థానికుల సాయంతో కడుపు నింపుకుంటున్నాడు. ఆసరా కోసం రెండు సార్లు దరఖాస్తు చేసుకున్నాడు. వయస్సు 70కి పైగా ఉన్న ఆధార్‌లో తప్పుగా నమోదు చేయడంతో తిరస్కరణకు గురైందని వాపోయాడు. చిన్నబోయిన కంటిచూపుతో కార్యాలయాల చుట్టూ తిరిగాడు. ఈ సారైనా ఆసరా వస్తుందేమోన్న ఆశతో ఎదురుచూస్తున్నాడు.


వెల్లువెత్తిన అర్జీలు
రెండేళ్లుగా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, గీత, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, పైలేరియా బాధితులు కలిపి మొత్తం 7,454 మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి ఎప్పుడో అందించాల్సి ఉండగా కాలయాపన చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం వెసులుబాటు కల్పించి 57 సంవత్సరాల పైబడిన వారికి పింఛన్లు అందిస్తామని ప్రకటించడంతో ఎనిమిది నెలల కిందట జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. సుమారు 19,390 మంది ఆసరా కోసం అర్జీలు సమర్పించారు.


* షేక్‌ సహేరా, ఖాసీం దంపతులకు ముగ్గురు సంతానం. ఖాసీం మోటార్‌ మెకానిక్‌గా పని చేస్తుండగా సహేరా బీడీలు చుడుతూ భర్తకు చేదోడువాదోడుగా ఉంటుంది. వారి రెండో కుమార్తె ఆయీషా పుట్టుకతోనే మెదడులోపం తలెత్తింది. అమాయకంగా చూసే కళ్లు.. నేలపై కదలాడే శారీరక స్థితి ఆమెది. వైద్యం కోసం సుమారు రూ.6 లక్షలు వెచ్చించినా మార్పు కనిపించలేదు. ప్రతినెలా ఔషధాల కొనుగోలుకు రూ. 4 వేల వరకు ఖర్చవుతుందని ఖాసీం తెలిపారు. ఆసరా అందతే చిన్నారి వైద్యం, మందులకు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.


మంజూరు కాగానే పంపిణీ
- మదన్‌మోహన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

జిల్లాలో ప్రస్తుతం లక్షకు పైగా లబ్ధిదారులకు రూ. 22.58 కోట్లను ఆసరా కింద అందిస్తున్నాం. ప్రభుత్వం వృద్ధాప్య పింఛను అర్హత వయస్సు 57 ఏళ్లకు తగ్గించడంతో 19 వేలకు పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు 7,454 మందిని అర్హులుగా గుర్తించాం. ప్రభుత్వం నిధులు మంజూరు చేయగానే పంపిణీ చేస్తాం. స్వాతంత్య్ర దినోత్సవానికి ఆసరా పింఛన్లు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటన ఇచ్చారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా రాలేదు.

జిల్లాలో పింఛన్ల వివరాలు
*
జిల్లాలో ప్రస్తుతం లబ్ధిదారులు:  1,06,851
*
ప్రతి నెల చెల్లిస్తున్న మొత్తం: రూ. 22.58 కోట్లు
*
57 ఏళ్లు పైబడిన వారి నుంచి వచ్చిన దరఖాస్తులు: 19,390

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని