logo

దేశ నిర్మాణంలో కాంగ్రెస్‌ పాత్రే కీలకం

దేశ నిర్మాణంలో కాంగ్రెస్‌ కీలక పాత్ర పోషించిందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. గంభీరావుపేట మండలంలోని దమ్మన్నపేట గ్రామ శివారులో పెద్దమ్మ స్టేజి నుంచి పొన్నం పాదయాత్ర చేపట్టారు. ఉదయం

Published : 10 Aug 2022 04:55 IST

పాదయాత్రలో పొన్నం ప్రభాకర్‌

ఎల్లారెడ్డిపేటలో పాదయాత్ర చేస్తున్న పొన్నం ప్రభాకర్‌, కాంగ్రెస్‌ నాయకులు

గంభీరావుపేట, న్యూస్‌టుడే: దేశ నిర్మాణంలో కాంగ్రెస్‌ కీలక పాత్ర పోషించిందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. గంభీరావుపేట మండలంలోని దమ్మన్నపేట గ్రామ శివారులో పెద్దమ్మ స్టేజి నుంచి పొన్నం పాదయాత్ర చేపట్టారు. ఉదయం కరీంనగర్‌లోని తన నివాసంలో తల్లి, కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం గంభీరావుపేటకు చేరుకున్నారు. వర్షంలోనే పాదయాత్రను చేపట్టారు. పెద్దమ్మ తల్లి ఆశీర్వచనం తీసుకుని ముందుకు సాగారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ  పాదయాత్రలో 75 సంవత్సరాల భారత దేశంలో కాంగ్రెస్‌ చేసిన పనులు ప్రజలకు వివరిస్తామని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తు తరాలను ఉద్దేశించి ప్రాజెక్టుల నిర్మాణం చేసింది కాంగ్రెస్‌ పార్టీయేనని తెలిపారు. సముద్రలింగాపూర్‌లో మధ్యాహ్నం భోజనం చేశారు. అక్కడి నుంచి ఎల్లారెడ్డి మండలం వైపు సాగింది.

మహనీయులను మరిచిపోయారు
ఎల్లారెడ్డిపేట: ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల సందర్భంగా రూ. వేల కోట్లు వెచ్చించి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరిట ప్రచారం చేస్తోందని, స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణాలను అర్పించిన వారిని ఎక్కడ ప్రస్తావించకపోవడం శోచనీయమని పొన్నం పేర్కొన్నారు.  పాదయాత్ర మంగళవారం సాయంత్రం ఎల్లారెడ్డిపేట మండలంలోకి ప్రవేశించింది. తిమ్మాపూర్‌, రాచర్ల గొల్లపల్లి గ్రామాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన పీఎం నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్‌ ప్రజలపై భారం మోపడం మినహా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ప్రజల సమస్యపై కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందని, ఆశీర్వదించాలని కోరారు. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ గత మూడున్నరేళ్లుగా ఈ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. మంత్రి కేటీఆర్‌ మళ్లీ సిరిసిల్ల నుంచి గెలిచే పరిస్థితి లేదని ఆయన అభిప్రాయపడ్డారు.పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణగౌడ్‌, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల బాధ్యులు ఆది శ్రీనివాస్‌, మేడిపల్లి సత్యం, మండల కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు నర్సయ్య, హమీదొద్దిన్‌, ఎన్‌ఎస్‌యూఐ, మహిళ కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని