logo

అంతర్గత దారులు.. అడుగడుగునా గుంతలు

కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో వర్షాలకు అంతర్గత రహదారులు అధ్వానంగా మారుతున్నాయి. నెల రోజులుగా కురుస్తున్న వానాలకు పెద్ద గుంతలు ఏర్పడి నరకాన్ని తలపిస్తున్నాయి. తాత్కాలిక మరమ్మతుల పేరిట ఏటా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా ఎక్కడి గుంతలు అక్కడే వదిలేయడంతో నగరవాసులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో మట్టి రోడ్లు నడవడానికి వీల్లేకుండా మారాయి.

Published : 11 Aug 2022 06:28 IST

న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌

అశోక్‌నగర్‌ నుంచి కాపువాడ వెళ్లే దారి సర్కస్‌ ఫీట్లను తలపిస్తోంది. పెద్ద, చిన్న గుంతలతో రోడ్డు పూర్తిగా శిథిలమైంది. దారి తప్పి ఆ వైపు రాకపోకలు సాగిస్తే ఇబ్బందులు పడాల్సిందే.

కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో వర్షాలకు అంతర్గత రహదారులు అధ్వానంగా మారుతున్నాయి. నెల రోజులుగా కురుస్తున్న వానాలకు పెద్ద గుంతలు ఏర్పడి నరకాన్ని తలపిస్తున్నాయి. తాత్కాలిక మరమ్మతుల పేరిట ఏటా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా ఎక్కడి గుంతలు అక్కడే వదిలేయడంతో నగరవాసులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో మట్టి రోడ్లు నడవడానికి వీల్లేకుండా మారాయి.

ఇంకెన్నాళ్లు..మట్టి రోడ్లు
నగరంలో స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా పలు రహదారులు అభివృద్ధి చెందగా శివారు, వెనుకబడిన ప్రాంతాల్లోని వీధులు చూస్తే భయంకరంగా తయారయ్యాయి. భూగర్భ డ్రైనేజీ పనుల కారణంగా తవ్విన సీసీ రోడ్లు, మట్టి రోడ్లు గుంతలు పడి దారుణంగా మారాయి. వర్షాలు పడితే నీరంతా ఆ గుంతల్లోనే నిలిచి ఉంటుంది. అశోక్‌నగర్‌, కాపువాడ, మారుతీనగర్‌, కోతిరాంపూర్‌, కట్టరాంపూర్‌, అలకాపురి, ఆమేర్‌నగర్‌, లక్ష్మీనగర్‌, గాయత్రీనగర్‌, పోచమ్మవాడ, హుస్సేనీపుర, ఖాన్‌పుర, సప్తగిరికాలనీ, బ్యాంకుకాలనీ, రాంనగర్‌, విద్యానగర్‌, మంకమ్మతోట, వావిలాలపల్లి, సుభాష్‌నగర్‌, కిసాన్‌నగర్‌ ప్రాంతాల్లో రోడ్లు చెడిపోయాయి. కొన్ని చోట్ల టెండర్లు దక్కించుకొని గుత్తేదారులు పని చేయకపోవడంతో సమస్యలు వస్తున్నాయి.

విలీన కాలనీల్లో అదే పరిస్థితి
విలీన కాలనీల్లోని రోడ్ల పరిస్థితి అలాగే మారింది. ఒక్కో కాలనీ పరిశీలిస్తే విస్తీర్ణంలో పెద్దగా ఉండగా రహదారుల నిర్మాణానికి, మురుగునీటి కాల్వలు నిర్మించేందుకు కేటాయిస్తున్న నిధులు ఏ మూలకు సరిపోవడం లేదు. మూడేళ్లుగా కాలనీల్లో సౌకర్యాలు మెరుగు పడలేదనే ఫిర్యాదులు స్థానికుల నుంచి వినిపిస్తోంది. పంచాయతీ సమయంలో పెద్దగా రోడ్లు వేయకపోవడం, అక్కడి ప్రాంతవాసులు నగరపాలికపై ఆశలు పెంచుకోగా ప్రత్యేక నిధులు ప్రభుత్వం కేటాయిస్తే తప్ప అక్కడ మార్పు వచ్చేలా లేదు.

రూ.60 లక్షలు కేటాయింపు
వర్షాల కారణంగా గుంతలు పడిన రహదారులకు మరమ్మతులు చేసేందుకు నగర మేయర్‌ వై.సునీల్‌రావు రూ.60లక్షలు కేటాయించారు. వీటికి టెండర్లు పిలిచి పనులు చేయాల్సి ఉంది. అయితే సీసీ, తారు రోడ్లపై ఉన్న గుంతలను వాటితోనే ప్యాచ్‌ వర్క్‌ చేయించాలి. మట్టి రోడ్లపై సిమెంటు, కంకర మిశ్రమంతో వేస్తే మళ్లీ వర్షం పడినా గుంతలు పడే అవకాశం ఉండదు. తూతూ మంత్రంగా కాకుండా పనులను పక్కాగా చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు.


హుస్సేనీపుర ప్రాంతంలో కొన్ని రోడ్లు మాత్రమే పూర్తి కాగా మిగతా మట్టి రోడ్లు ప్రమాదకరంగా మారాయి. సీసీ రోడ్లు మధ్యలో చెడిపోగా వర్షం పడితే నీరు నిలిచి గుంత లోతు తెలియక ప్రమాదాల బారిన పడుతున్నారు.


ఆమేర్‌నగర్‌-లక్ష్మీనగర్‌కు వెళ్లే రహదారి రద్దీగా ఉంటుంది. కొన్నేళ్లుగా మరమ్మతులు చేయకుండా అలాగే ఉంటుంది. అన్నీ రోడ్లు బాగు చేస్తుండగా ఈ ఒక్క రోడ్డు మాత్రం వదిలేస్తున్నారు.


కోతిరాంపూర్‌ నుంచి గిద్దెపేరుమాండ్ల దేవస్థానం వెళ్లే  ప్రధాన రహదారి గుంతలు పడి ఇబ్బందికరంగా మారింది. భూగర్భ డ్రైనేజీ పనుల కారణంగా ప్యాచ్‌ వర్క్‌ చేయగా అదీ ఊడిపోయింది. వర్షం పడితే చాలు రోడ్డంతా గుంతలమయంగా మారుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని