logo

నిరంతర నిఘా.. నేరాల నియంత్రణ..

పోలీసు యంత్రాంగం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. అదే కోణంలో రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే రాష్ట్ర రాజధానిలో తెలిసే విధంగా ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌

Published : 11 Aug 2022 06:46 IST

కమాండ్‌ కంట్రోల్‌కు సీసీ కెమెరాల అనుసంధానం
న్యూస్‌టుడే, గోదావరిఖని

ఠాణాలో ఏర్పాటు చేసిన తెర

పోలీసు యంత్రాంగం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. అదే కోణంలో రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే రాష్ట్ర రాజధానిలో తెలిసే విధంగా ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి అనుసంధానం చేస్తున్నారు. రామగుండం కమిషనరేట్‌కు అందులో చోటు కల్పించారు. ఇప్పటికే గోదావరిఖని 32, పెద్దపల్లి ఠాణాల పరిధిలో 72 కెమెరాలను అనుసంధానం చేశారు. పట్ణంలోని ప్రధాన కూడళ్లతో పాటు ఠాణాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను అందుబాటులోకి తీసుకున్నారు. దీంతో ఇక్కడ ఏ సంఘటన జరిగినా సీసీ కెమెరా ఉన్న పరిధిలోని ప్రతి అంశం కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో ఉన్న వారు పరిశీలించే అవకాశం ఉంది. పెద్దపల్లి జిల్లాలో గోదావరిఖని-1, 2, రామగుండం, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ సర్కిల్‌ స్టేషన్‌లతో పాటు ప్రతి మండలానికి ఒకటి చొప్పున 13 ఠాణాలున్నాయి. వీటి పరిధిలో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలు చిత్రీకరించే వీడియోలు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి పర్యవేక్షించే విధంగా పోలీసు శాఖ ఏర్పాట్లు చేసింది.

మొదలైన ప్రక్రియ...
రామగుండం పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని పెద్దపల్లి జిల్లాలో ఉన్న నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఉన్న సీసీ కెమెరాలను అనుసంధానం చేసే ప్రక్రియ సాగుతోంది. జిల్లాలో మొత్తం 3,500 పైగా నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్‌ కింద కొన్ని, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార వర్గాలు, పరిశ్రమల సహకారంతో నగరాలు, పట్టణాల్లోని ముఖ్యమైన రద్దీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవి ఏర్పాటు చేసిన ప్రాంతంలో జరిగే ప్రతి సంఘటన సీసీ కెమెరాలో నిక్షిప్తమవుతోంది. ఇదే వీడియో ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి చేరుతుంది. ఒకవేళ ఆ ఠాణా పరిధిలో ఉన్న అధికారులు స్పందించని పక్షంలో అక్కడి నిఘా కెమెరాల దృశ్యాల ఆధారంగా అప్రమత్తం చేసే అవకాశం ఉంది. నిర్లక్ష్యం.. కేసు విచారణలో పారదర్శకత లోపించినా వెంటనే అక్కడి నుంచి అధికారులు స్పందించే అవకాశం ఉంటుంది. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్న ఆలోచన మేరకు పోలీసుశాఖ అన్ని ఠాణాల పరిధిలో నిఘానేత్రాలను ఏర్పాటు చేయించింది. వీటిపై ప్రజలు, వ్యాపారులు, అపార్టుమెంట్లటో నివాసంటున్న వారికి అవగాహన కల్పించింది. చోరీలు జరిగినా.. రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నా.. అపహరణలు.. ఇతర నేర సంఘటనలకు సంబంధించిన అంశాల్లో నిఘా కెమెరాలే కీలకంగా మారాయి.

చాలా చోట్ల నిర్వహణ లోపం
కమిషనరేట్‌ పరిధిలో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు చాలా చోట్ల పనిచేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. ప్రధాన కేంద్రాల్లో ఉన్న నిఘా కెమెరాలు సైతం పనిచేయకపోవడంతో కొన్ని సందర్భాల్లో అక్కడ జరిగిన సంఘటనలను అవి చిత్రీకరించలేకపోయాయి. నేర సంఘటనలు, ఇతర సంఘటనలు జరిగిన సమయంలో అక్కడి ఫుటేజీలు అందుబాటులో లేక స్థానికంగా ఉన్న వారిపైనే ఆధారపడాల్సి వచ్చింది. ఓవ్యక్తి మృతి సంఘటనలో కారణాలు తెలియరాలేదు. అక్కడున్న సీసీ కెమెరా పనిచేయకపోవడంతో రహదారి ప్రమాదమా.. సాధారణ మరణమా అన్నది తెలియలేదు. ఏదైనా గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడా అన్న విషయాన్ని కనుక్కోవడం కష్టతరంగా మారింది. చివరికి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన సంఘటన గోదావరిఖనిలో నెలకొంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించే వరకు ఆసక్తి చూపుతున్న పోలీసు అధికారులు అవి నిరంతరం పనిచేసే విధంగా చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇళ్లలో వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలపై ఆధారపడాల్సి వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని