logo

పకడ్బందీగా వజ్రోత్సవాలు

జిల్లాలో స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పీ సీహెచ్‌.సింధుశర్మ, అదనపు కలెక్టర్లు బీఎస్‌ లత, జె.అరుణశ్రీలతో కలిసి జిల్లాలోని అధికారులతో దృశ్య సమీక్ష నిర్వహించారు.

Published : 11 Aug 2022 06:46 IST


పిల్లలతో కలిసి సినిమా చూస్తున్న కలెక్టర్‌ రవి, ఎస్పీ సింధుశర్మ, అదనపు కలెక్టర్‌

జగిత్యాల, న్యూస్‌టుడే: జిల్లాలో స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పీ సీహెచ్‌.సింధుశర్మ, అదనపు కలెక్టర్లు బీఎస్‌ లత, జె.అరుణశ్రీలతో కలిసి జిల్లాలోని అధికారులతో దృశ్య సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం ఉదయం 6.30 గంటలకు జిల్లా వ్యాప్తంగా 2కె రన్‌ నిర్వహించాలని పోలీసు, నోడల్‌ అధికారులు కార్యక్రమ నిర్వహణకు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమ ప్రారంభ ప్రదేశంలో మంచినీటి వసతి ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో మినీస్టేడియం నుంచి కొత్తబస్టాండ్‌ వరకు పరుగు నిర్వహించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంటింటికి జాతీయ పతాకాల పంపిణీ వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లా ఎస్పీ సీహెచ్‌.సింధుశర్మ మాట్లాడుతూ 2కె రన్‌ నిర్వహణపై ఆయా పోలీసుస్టేషన్‌ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆసందర్భంలో దేశభక్తి పాటలను వేయాలన్నారు. 2కె రన్‌లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన వారికి మెడల్స్‌ ఇస్తామని సీనియర్‌ సిటిజన్లకు అవకాశముంటుందని దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు పరుగులో ముందున్న వారిని ఎంపిక చేయాలన్నారు.

పిల్లలందరికీ సినిమా చూపాలి
పిల్లలందరికీ కచ్చితంగా గాంధీ సినిమా చూపాలని జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి అన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ సింధుశర్మ, అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లతతో కలిసి పాఠశాల విద్యార్థులతోపాటు గాంధీ సినిమా చూశారు. నేటి తరానికి గాంధీ గొప్పదనాన్ని తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మహత్మాగాంధీ పోరాటంపై పిల్లలకు అవగాహన కలిగేందుకు జిల్లాలోని 10 థియేటర్లలో ప్రతిరోజు 5500 మందికి సినిమా చూసే అవకాశముందని ఈనెల 22లోగా 64 వేల మంది విద్యార్థులకు సినిమా చూపిస్తామని కలెక్టర్‌ అన్నారు.

ఫ్రీడం రన్‌ విజయవంతం చేయాలి
జగిత్యాల: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జిల్లాలో గురువారం నిర్వహించే ఫ్రీడం రన్‌ విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ సీహెచ్‌.సింధుశర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని అందులో భాగంగా గురువారం ఉదయం 6.30 గంటలకు పాతబస్టాండ్‌ మినీస్టేడియం నుంచి ప్రారంభమయ్యే ఫ్రీడం రన్‌లో విద్యార్థులు, క్రీడాకారులు, కళాకారులు ఉదయం 6 గంటల వరకు మినీస్టేడియం వచ్చి కార్యక్రమం విజయవంతం చేయాలని ఎస్పీ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని