logo

పుర ఆదాయానికి గండి

అనుమతులు లేకుండా బహుళ అంతస్థుల నిర్మాణాలు చేపడితే.. అడ్డు చెప్పాల్సిన పాలకవర్గం, అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో పురపాలిక ఆదాయానికి గండి పడుతోంది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానం తీసుకొచ్చినా నిర్మాణాలు మాత్రం యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.

Updated : 11 Aug 2022 06:51 IST

పట్టణంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు
కోరుట్ల గ్రామీణం, న్యూస్‌టుడే


గడిగురుజు సమీపంలో బహుళ అంతస్థుల నిర్మాణం

అనుమతులు లేకుండా బహుళ అంతస్థుల నిర్మాణాలు చేపడితే.. అడ్డు చెప్పాల్సిన పాలకవర్గం, అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో పురపాలిక ఆదాయానికి గండి పడుతోంది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానం తీసుకొచ్చినా నిర్మాణాలు మాత్రం యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.

కోరుట్ల పట్టణంలోని అతి పురాతనమైన గడి గురుజు ప్రాంతం పురావస్తు ఆధీనంలో ఉంది. జీవో 168 ప్రకారం గడిగురుజు ప్రాంతంలో 150 మీటర్ల వరకు ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరాదు. దాని పరిసర ప్రాంతాల్లోనే నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా బహుళ అంతస్థుల నిర్మాణాలు చేపడుతున్న పాలకవర్గ సభ్యులు, పుర అధికారులు ‘మాములు’గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో ఇంటి అనుమతికి దాదాపుగా రూ.1.50 నుంచి రూ.2 లక్షల మేరకు పురపాలికకు ఆదాయం రావాల్సి ఉండగా అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడంతో పుర ఆదాయానికి గండిపడుతున్నా అధికారులు అడ్డు చెప్పకపోవడం గమనార్హం.

పురాతన ఇళ్లు
గడి గురుజు ప్రాంతంలో స్థలాలకు డిమాండ్‌ పెరిగింది. పరిసర ప్రాంతాల్లో పురాతన ఇళ్లు ఉన్నాయి. పురాతన ఇళ్లను కూల్చివేసి నూతన నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులు రాకపోవడం, స్థలాలను విక్రయించుకోలేక యజమానులు సైతం ఇబ్బందులకు గురవుతన్నారు. మాస్టరుప్లానులో 60 అడుగుల రహదారి ఉండటం ఇంటి అనుమతులకు అడ్డుగోడగా నిలుస్తుంది. పుర అనుమతి లభించక పోవడంతో ఇంటి నిర్మాణాలకు బ్యాంకు రుణాలు రాకపోవడం భారంగా మారుతున్నాయి. ఇంటి నిర్మాణం కోసం సంబంధిత కౌన్సిలరు లేదా అధికారులను సంప్రదించి సమస్యను తెలియజేస్తుంటారు. ‘మామూలు’గా కలిస్తే అటువైపు పురపాలిక అధికారులు కన్నెత్తి చూడరని నిర్మాణదారులు బహాటంగానే వాపోతున్నారు. 150 మీటర్లకు బయట ఉన్న స్థలాలకు సైతం పురావస్తు శాఖ నుంచి ఎన్‌వోసీ కావాలని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు కోరుతున్నారు. పురావాస్తు శాఖ ఎన్‌వోసీ ఇవ్వడం లేదని నిర్మాణదారులు వాపోతున్నారు. గడిగురుజు ఉన్న ప్రాంతంలో హద్దులు ఏర్పాటు చేసి పరిసరాలలో ఇంటి నిర్మాణాలకు అనుమతులు వచ్చేలా పాలకవర్గం చొరవ చూపాల్సిన అవసరముంది. దీంతో పురపాలికకు ఆదాయం పెరగడంతో పాటు నిర్మాణదారుల సమస్యకు పరిష్కరం లభించనుంది.

ఎన్‌వోసీ ప్రకారం అనుమతి : -శ్రీనివాస్‌, పట్టణా ప్రణాళిక అధికారి
టీఎస్‌బీపాస్‌లో తీసుకున్న అనుమతి ప్రకారం నిర్మాణాలు చేపట్టాలి. గడి గురుజు ప్రాంతంలో ఎన్‌వోసీ తెచ్చిన వారికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అక్రమ నిర్మాణాలపై ఉన్నతాధికారులకు నివేదించడం జరిగింది. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కమిటీ చర్యలు తీసుకుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని