logo

ప్రజల మధ్యకు రావడానికి బందోబస్తు ఎందుకు?

ప్రజలతో ఎన్నికైన శాసనభ్యుడు, మంత్రి కేటీఆర్‌, ప్రజల్లోకి రావడానికి పోలీసుల రక్షణ కవచం ఎందుకని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా ఎల్లారెడ్డిపేటకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు, వంద పడకల ఆసుపత్రిని

Published : 11 Aug 2022 06:57 IST

ఎల్లారెడ్డిపేటలో పాదయాత్ర నిర్వహిస్తున్న పొన్నం

ఎల్లారెడ్డిపేట, న్యూస్‌టుడే: ప్రజలతో ఎన్నికైన శాసనభ్యుడు, మంత్రి కేటీఆర్‌, ప్రజల్లోకి రావడానికి పోలీసుల రక్షణ కవచం ఎందుకని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా ఎల్లారెడ్డిపేటకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు, వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రెండో రోజు బుధవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుంచి వెంకటాపూర్‌ వరకు పాదయాత్ర కొనసాగింది. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోకి ప్రవేశించింది. వర్షానికి తమ ఇల్లు కూలిపోయినా ఎలాంటి నష్టపరిహారం అందలేదని, రెండు పడక గదుల ఇంటిని మంజూరు చేయలేదని పేర్కొంటూ కోనేటి అనిత అనే మహిళ పొన్నం ఎదుట వాపోయింది. మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయాలని పేర్కొంటూ జూనియర్‌ కళాశాల విద్యార్థులు పొన్నంకు వినతిపత్రం సమర్పించారు. వీఆర్‌ఏలు, సుంకరి ఇస్సాదారుల సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. వీఆర్‌ఏలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి డిమాండ్‌లను తీర్చేందుకు సీఎంకు లేఖ రాస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ కేటీఆర్‌ పర్యటించిన ప్రతిసారి ప్రతిపక్ష నాయకులను ఎందుకు అరెస్ట్‌ చేయిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీనిపై జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లు, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. పేదలు, టెక్స్‌టైల్‌ పార్కుపై కేంద్రం పన్నులు వేస్తే ఎంపీ బండి సంజయ్‌ మౌనంగా ఉండటం సిగ్గు చేటని పేర్కొన్నారు.  
సిరిసిల్లకు చేరిన పాదయాత్ర
సిరిసిల్ల గ్రామీణం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను గ్రామ గ్రామాన వివరించడానికే పాదయాత్ర చేస్తున్నట్లు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ పేర్కొన్నారు. బుధవారం రెండో రోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుంచి సిరిసిల్ల పట్టణ పరిధిలోకి 14 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని సర్దాపూర్‌, పెద్దూరు గ్రామాల్లో మహిళలతో ముచ్చటించారు. విలీన గ్రామాల సమస్యలను గ్రామస్థులు ఆయనకు వివరించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యానారాయణగౌడ్‌,    మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్‌, రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక,   శ్రీనివాస్‌, సూర దేవరాజు, దొమ్మాటి నర్సయ్య పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని