logo

అభివృద్ధి పేరు... అక్రమాల జోరు

అభివృద్ద్ధి పనుల పేరుతో ఏర్పాటు చేసిన సిమెంట్‌ కాంక్రీట్‌ మిక్సింగ్‌ ప్లాంట్ల పనులు నిలిచిపోయినా యథేచ్ఛగా అక్రమ వ్యాపారాన్ని కొసాగిస్తున్నారు. వాస్తవానికి భూగర్భ గనులు, రెవెన్యూ, ఇరిగేషన్‌, కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల అనుమతులు

Published : 11 Aug 2022 06:58 IST

శ్రీ యథేచ్ఛగా సిమెంట్‌ కాంక్రీట్‌ మిక్సింగ్‌ ప్లాంట్ల జీరో దందా
న్యూస్‌టుడే, వేములవాడ

అభివృద్ద్ధి పనుల పేరుతో ఏర్పాటు చేసిన సిమెంట్‌ కాంక్రీట్‌ మిక్సింగ్‌ ప్లాంట్ల పనులు నిలిచిపోయినా యథేచ్ఛగా అక్రమ వ్యాపారాన్ని కొసాగిస్తున్నారు. వాస్తవానికి భూగర్భ గనులు, రెవెన్యూ, ఇరిగేషన్‌, కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల అనుమతులు పొందిన తరవాతే సిమెంట్‌ కాంక్రీట్‌ మిక్సింగ్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి. ఇవేమీ పట్టించుకోకుండా అభివృద్ధి పనుల పేరుతో ఏర్పాటు చేస్తూ నిబంధనలను తుంగలో తొక్కి జీరో దందాకు తెర తీస్తున్నారు. ఇందులో వినియోగించే ఇసుక, కాంక్రీట్‌కు సంబంధించి ప్రభుత్వ నిబంధనల మేరకు కొనుగోలు చేసి వినియోగించాలి ఉంది. ఇసుకను దొంగచాటున మూలవాగు, మానేరు వాగుల నుంచి తరలించి వినియోగిస్తున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
వేములవాడ పట్టణంలోని బాల్‌నగర్‌, జయవరం, వేములవాడ మండలంలోని ఆరెపల్లి వద్ద సిమెంట్‌ కాంక్రీట్‌ మిక్సింగ్‌ ప్లాంట్లు నడుస్తున్నాయి. ఇందులో వేములవాడ గుడి చెరువు అభివృద్ధి పనుల కోసం బాల్‌నగర్‌ వద్ద దాదాపు 2016లో ఎలాంటి అనుమతులు లేకుండానే సిమెంట్‌ కాంక్రీట్‌ మిక్సింగ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. గుడి చెరువులో చేపట్టిన వివిధ పనులకు ఈ మిక్సింగ్‌ ప్లాంట్‌ను వినియోగించారు. పనుల కోసం పెద్ద ఎత్తున ఇసుకను డంప్‌ చేశారు. మూడేళ్ల క్రితమే గుడి చెరువు పనులు నిలిచిపోయాయి. గుత్తేదారు పనులకు సంబంధించిన టిప్పర్లు, జేసీబీలు వంటి భారీ వాహనాలను తరలించి క్యాంప్‌ను ఎత్తేశారు. అప్పటి నుంచి సిమెంట్‌ కాంక్రీట్‌ మిక్సింగ్‌ ప్లాంట్‌ ప్రైవేటు వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతుంది. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. ఇక్కడ నుంచి కొంత మంది గుత్తేదారులకు మిక్సింగ్‌ మెటీరియల్‌ను నిరంతరాయంగా సరఫరా అవుతుంది. అయినా ఏ శాఖకు సంబంధించిన అధికారులూ అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. సిమెంట్‌ కాంక్రీట్‌ మిక్సింగ్‌ ప్లాంట్‌ నిరంతరాయంగా పెద్ద ఎత్తున నడిపిస్తూ గుడి చెరువు కోసం డంపు చేసిన ఇసుకలో సగం వరకు వినియోగించినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ప్లాంట్‌ బైపాస్‌ రోడ్డును ఆనుకుని ఉండటంతో దుమ్ము, ధూళితో బాల్‌నగర్‌ ప్రజలు, రోడ్డుపై వెళ్లే వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.

అధికారులు ఏమంటున్నారంటే...
జయవరం సిమెంట్‌ కాంక్రీట్‌ మిక్సింగ్‌ ప్లాంట్‌ను తనిఖీ చేసిన సందర్భంలో వెల్లడైన అంశాలపై ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు చర్యలు తీసుకుంటారని మైనింగ్‌ ఏడీ సైదులు పేర్కొన్నారు. దీనిపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. సిమెంట్‌ కాంక్రీట్‌ మిక్సింగ్‌ ప్లాంట్లను పరిశీలించి అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వేములవాడ తహసీల్దార్‌ రాజు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.


వేములవాడ బైపాస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన సిమెంట్‌ కాంక్రీట్‌ మిక్సింగ్‌ ప్లాంట్‌

చెక్‌డ్యాం పేరుతో మరొకటి...
వేములవాడ పట్టణ శివారులోని జయవరం మూలవాగులో నిర్మిస్తున్న చెక్‌డ్యాం పేరుతో మూలవాగు ఒడ్డున సిమెంట్‌  కాంక్రీట్‌ మిక్సింగ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్‌లోని మిక్సింగ్‌ అయిన సిమెంట్‌, కాంక్రీట్‌ చెక్‌డ్యాం నిర్మాణానికి వినియోగిస్తూనే ఇతర ప్రాంతాలకు మెటీరియల్‌ను తరలిస్తూ వ్యాపారం కొనసాగించారు. ఒక ట్రిప్పు ఇసుక కూడా నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. పక్కనే ఉన్న వాగులోని ఇసుకతో అక్రమ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగించారు. ఇటీవల ఈ ప్లాంటును సంబంధిత శాఖల అధికారులు ఏక కాలంలో తనిఖీ చేసి కాంక్రీట్‌ మిక్సింగ్‌ ప్లాంటుకు సంబంధించిన పైళ్లను పరిశీలించారు. ఏ ఒక్క శాఖ నుంచి అనుమతులు తీసుకోలేదని వెల్లడైంది. దీంతో ఆయా శాఖల అధికారులు పైళ్లను స్వాధీనం చేసుకున్నారు. మిక్సింగ్‌ ప్లాంట్‌ తనిఖీ చేసి దాదాపు నెల రోజులు గడిచిపోయినప్పటికి ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా ఆయా శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించి అక్రమ ప్లాంట్లపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని