logo

పంద్రాగస్టుకు పాత దుస్తులేనా!

కరోనా విపత్కర పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే విద్యాసంస్థలు పూర్తి స్థాయిలో కోలుకుంటున్నాయి. దాదాపు రెండేళ్ల పాటు ప్రత్యక్ష తరగతులు లేకపోవడంతో విద్యార్థులకు ఏకరూప దుస్తుల(యూనిఫాంల) అవసరం రాలేదు. ఈ ఏడాది జూన్‌ 13న పాఠశాలలు

Published : 13 Aug 2022 04:07 IST

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తప్పని నిరీక్షణ

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి

ఓదెల మండలం ఉప్పరపల్లి ప్రాథమికోన్నత

పాఠశాలలో సాధారణ దుస్తుల్లోనే విద్యార్థులు

కరోనా విపత్కర పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే విద్యాసంస్థలు పూర్తి స్థాయిలో కోలుకుంటున్నాయి. దాదాపు రెండేళ్ల పాటు ప్రత్యక్ష తరగతులు లేకపోవడంతో విద్యార్థులకు ఏకరూప దుస్తుల(యూనిఫాంల) అవసరం రాలేదు. ఈ ఏడాది జూన్‌ 13న పాఠశాలలు ప్రారంభం కాగా దాదాపు రెండు నెలలవుతున్నా ఇప్పటికీ విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులు ఇప్పటికీ అందలేదు.

ప్రతి సంవత్సరం జెండా పండుగ రోజున కొత్త ఏకరూప దుస్తులతో మెరిసిపోయే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈసారి సివిల్‌ దుస్తుల్లోనే కనిపించే పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటివరకు పాఠ్యపుస్తకాల కొరత ఉండగా, ఇప్పుడేమో యూనిఫాంల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. పేద విద్యార్థులు చిరిగిన దుస్తులతోనే పాఠశాలలకు హాజరు కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జిల్లాలోని 14 మండలాల్లో ఏకరూప దుస్తులను కుట్టే పనులను ఎక్కడిక్కడ మహిళా సమాఖ్యలకు అప్పగించారు. ఏటా ఏప్రిల్‌, మే నెలలో ఇవ్వాల్సిన ఆర్డర్లు విద్యాశాఖకు ముందుచూపు లేక ఈసారి జులై నెలలో ఇవ్వడంతో ఇంకా కుట్టే దశలోనే ఉన్నాయి. ఈ పరిస్థితి చూస్తే సెప్టెంబరు నెలాఖరు వరకు కూడా విద్యార్థులకు యూనిఫామ్‌లు అందేలా లేవు.

తక్కువ ధరతో నాణ్యత మృగ్యం

జతకు రూ.50 ఇవ్వడం వల్ల టైలర్లు నాణ్యత పాటించడం లేదని విద్యార్థులు గతంలో ప్రధానోపాధ్యాయులకు ఫిర్యాదులు చేశారు. ఏడాది కాలమంతా రెండు యూనిఫామ్‌లతోనే నెట్టుకు రావాల్సి వస్తుండటం, అవీ మధ్యలోనే చినిగిపోతుండటంతో విద్యార్థులు వాటితోనే హాజరు కావాల్సిన పరిస్థితులున్నాయి. బహిరంగ విపణిలో దారం విలువ పెరగడంతో రూ.50తో విద్యార్థులకు చొక్కా, నిక్కరు, పెద్దవారికి చొక్కా, ప్యాంట్లు కుట్టడం సాధ్యం కావడం లేదని, కుట్టు కూలీ పెంచాలని దర్జీలు కోరుతున్నారు.

వస్త్రం అప్పగింతలో జాప్యంతో..

జిల్లావ్యాప్తంగా 573 ప్రభుత్వ పాఠశాలలుండగా 43,465 మంది విద్యార్థులున్నారు. వీరికి రెండు జతల చొప్పున ఏకరూప దుస్తులు అందజేయాల్సి ఉంటుంది. అయితే పాఠశాలలు తెరిచి రెండు నెలలు కావస్తున్నా ఒక్కరికీ అందించలేదు. ప్రభుత్వం రెండు జతల వస్త్రాలు కుట్టడానికి జతకు రూ.50 చొప్పున రెండింటికి కలిపి రూ.100 చొప్పున ఆయా సమాఖ్యల ఏజెన్సీల బ్యాంకు ఖాతాలకు జమ చేసింది. తక్కువ మొత్తంలో కుట్టు కూలీ నిర్ణయించడంతో దర్జీలు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో మండలకేంద్రాల్లో ఉన్న మహిళ సమాఖ్యలకు అందించడంతో జాప్యానికి కారణమైంది.

త్వరలోనే ఒక జత అందజేస్తాం : మాధవి, జిల్లా విద్యాశాఖాధికారిణి

కొవిడ్‌ కారణంగా రెండేళ్లుగా ప్రభుత్వం వస్త్రం అందించలేదు. ఈ సారి జులై నెలాఖరు వరకు సామగ్రి వచ్చింది. ఇప్పటివరకు ఎవరికీ కొత్త యూనిఫాంలు అందించలేదు. ఎక్కడికక్కడే మహిళ సమాఖ్యల వారిచే కుట్టిస్తున్నాం. త్వరలో విద్యార్థులందరికీ ఒక జత ఏకరూప దుస్తులు అందిస్తాం. రెండో జత ఇచ్చేందుకు మరికొంత సమయం పట్టనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని