logo

‘పట్టు’ క్షేత్రం... ఆక్రమణల పర్వం

మెట్ట ప్రాంతమైన జిల్లాలో ఒకప్పుడు ఉద్యానవన పంటలు ఎక్కువగా సాగయ్యేవి. అందులో మల్బరీ వేల ఎకరాల్లో ఉండేది. దీనికి అనుబంధంగా పట్టుగూళ్ల పెంపకం చేపట్టేవారు. ప్రస్తుతం జిల్లాలో 30 ఎకరాల్లో ఉన్నట్లు అంచనా. ఉమ్మడి కరీంనగర్‌

Published : 13 Aug 2022 04:07 IST

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల, న్యూస్‌టుడే, గంభీరావుపేట

పట్టుక్షేత్ర ప్రాంగణం

మెట్ట ప్రాంతమైన జిల్లాలో ఒకప్పుడు ఉద్యానవన పంటలు ఎక్కువగా సాగయ్యేవి. అందులో మల్బరీ వేల ఎకరాల్లో ఉండేది. దీనికి అనుబంధంగా పట్టుగూళ్ల పెంపకం చేపట్టేవారు. ప్రస్తుతం జిల్లాలో 30 ఎకరాల్లో ఉన్నట్లు అంచనా. ఉమ్మడి కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాలకు పట్టు గూళ్లు, మల్బరీ మొక్కలను పంపిణీ చేసే పట్టు క్షేత్రం నిరాదరణకు గురవుతోంది. శిథిలమైన భవనాలు, కనీస వసతులు లేక పర్యవేక్షణ కరవైంది. చుట్టూ ఆక్రమణలతో పట్టు తప్పుతోంది.

జిల్లా పూర్తిగా మెట్టప్రాంతం కావడంతో వాణిజ్య పంటలకు ప్రత్యామ్నాయంగా మల్బరీ సాగును ప్రోత్సహించేవారు. దీనికోసం గంభీరావుపేట మండలం నర్మాలలో నిజాం కాలంలో పట్టు క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. మల్బరీ సాగుకు మొక్కల పంపిణీ, పట్టుగూళ్ల పెంపకం, మార్కెటింగ్‌ అవకాశాలపై ఇక్కడ రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించేవారు. ప్రస్తుతం నీటి లభ్యత పెరుగుతుండటం, ప్రత్యామ్నాయ పంటలు రావడంతో మల్బరీ సాగు, పట్టుగూళ్ల పెంపకం కనుమరుగవుతుంది. దీనితోపాటే ఈ క్షేత్రంపై ఉద్యానవనశాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఈ క్షేత్రంలో ఉద్యానవన అధికారి, పరిశోధన, సాంకేతిక సహాయకులు పని చేసేందుకు 15 మంది సిబ్బంది ఉండాలి. ప్రస్తుతం ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇందులో ఒకరు జిల్లా ఉద్యానవనశాఖ కార్యాలయంలో పని చేస్తుండగా మరొకరు స్థానిక క్షేత్రంలో ఉన్నారు. రెండేళ్ల క్రితం పట్టు పరిశ్రమను ఉద్యానవనశాఖలో విలీనం చేయడంతో ఇందులో ప్రత్యేకంగా ఉద్యోగ నియామకాలు లేవు.

సరిహద్దులు లేక...

నర్మాలలోని 27.11 ఎకరాల విస్తీర్ణంలోని ఈ క్షేత్రం చుట్టూ సరిహద్దులు లేవు. దీంతో దీని చుట్టూ ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. 2017లో దీనిపై ఫిర్యాదులు రావడంతో రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో సర్వే చేసి హద్దురాళ్లు ఏర్పాటు చేశారు. తర్వాత పర్యవేక్షణ కొరవడంతో తిరిగి యథాస్థితి పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల నివాసానికి ఏర్పాటు చేసిన గృహాలు, కార్యాలయం, పరిశోధన భవనాలు నిరుపయోగంగా మారడంతో దీనికి ఉన్న తలుపులు, కిటికీలు అపహరణకు గురవుతున్నాయి.

ప్రహరీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం - జ్యోతి, జిల్లా ఉద్యానవన అధికారి

పట్టుక్షేత్రం చుట్టూ ప్రహరీ, నీటి వసతి ఏర్పాటుకు రూ. 40 లక్షలతో ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు పంపాం. నిధుల కేటాయింపును బట్టి క్షేత్రం అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. సిబ్బంది కొరత ఉండటంతో మల్బరీసాగు, పట్టుగూళ్ల పెంపకంపై ఆసక్తి ఉన్న రైతులకు వివరిస్తున్నాం. జిల్లాలో ముస్తాబాద్‌, ఇల్లంతకుంట, వేములవాడలో మల్బరీ సాగుకు రైతులు ముందుకొస్తున్నారు.

శిథిలమైన భవనం

అవసరాలు అనేకం

జిల్లాలో ఆయిల్‌పాం సాగుపై రెండేళ్లుగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో సిరిసిల్ల శివారు రగుడులో 20 ఎకరాల్లో ఆయిల్‌పాం మొక్కల పెంపకం చేపడుతున్నారు. సాగుపై ఆసక్తితో ముందుకొచ్చే రైతులకు ఈ నర్సరీ నుంచి ఉద్యానవనశాఖ ద్వారా మొక్కలు అందించనున్నారు. ప్రస్తుతం జిల్లా సాగు విస్తీర్ణంలో ఉద్యానవన పంటలు 20 శాతానికి మించడం లేదు. కూరగాయలు, పండ్లను ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. వ్యవసాయ, ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో ఈ క్షేత్రంలో కూరగాయలు, జిల్లా నేలలకు అనువైన ఉద్యానవన పంటలను ప్రోత్సహించేలా నర్సరీలను ఏర్పాటు చేసిన రైతులకు అందజేస్తే జిల్లాలో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయ, పాలిటెక్నిక్‌ కళాశాలల విద్యార్థులకు అధ్యయన కేంద్రంగా వినియోగంలోకి తీసుకొస్తే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని