logo

ఆహ్లాదం.. అందనంత దూరం

పట్టణ ప్రజలకు ఆహ్లాదం అందనంత దూరంగా మారింది.. ఉద్యానవనాలు, మినీట్యాంక్‌ బండ్‌ నిర్మాణం కోసం రూ.కోట్లు వెచ్చించినా ఏళ్ల తరబడి పనులను మధ్యలోనే వదిలేసి నిర్లక్ష్యం చేస్తున్నారు.. పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రాకుండానే

Published : 13 Aug 2022 04:07 IST

న్యూస్‌టుడే, కోరుట్ల

కోరుట్లలో మినీ ట్యాంక్‌బండ్‌

పట్టణ ప్రజలకు ఆహ్లాదం అందనంత దూరంగా మారింది.. ఉద్యానవనాలు, మినీట్యాంక్‌ బండ్‌ నిర్మాణం కోసం రూ.కోట్లు వెచ్చించినా ఏళ్ల తరబడి పనులను మధ్యలోనే వదిలేసి నిర్లక్ష్యం చేస్తున్నారు.. పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రాకుండానే నిర్మాణ దశలోనే కట్టడాలు దెబ్బతినాల్సిన పరిస్థితి నెలకొంది..

కోరుట్ల పట్టణంలో మద్దుల చెరువును మినీట్యాంకు బండ్‌గా మార్చేందుకు సుమారు ఐదేళ్ల క్రితం రూ.2 కోట్లకుపైగా నిధులను కేటాయించి పనులు ప్రారంభించారు. చెరువు కట్ట విస్తీర్ణం, ఎత్తును పెంచారు. కట్టకు ఇరువైపులా ఇనుప రెయిలింగ్‌ను ఏర్పాటు చేసి కట్టపై సీసీరోడ్డును నిర్మించారు. కట్టకు ఇరువైపులా గేట్లను బిగించి, లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. చెరువులో ఎక్కువైన నీరు వెళ్లేందుకు నూతనంగా మత్తడి నిర్మాణ పనులు చేశారు. మినీ ట్యాంకుబండ్‌ పనులు పూర్తిచేసి మూడేళ్లుగా సుందరీకరణ పనులు చేపట్టకుండా వదిలేశారు. మినీ ట్యాంకుబండ్‌ సుందరీకరణ కోసం టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.1.20 కోట్లను మూడేళ్ల క్రితం కేటాయించారు. సుందరీకరణ పనులు ప్రారంభించి ఏడాది గడుస్తున్నా మధ్యలోనే వదిలేశారు. ఈ నిధులతో స్వాగత తోరణం, బతుకమ్మగాట్‌, గార్డెనింగ్‌, పిల్లల పార్కు, నీడనిచ్చే, పూల మొక్కల పెంపకం, ధ్యాన మందిరం, గార్డ్‌ గది, ఫుడ్‌కోర్‌, లైటింగ్‌, కుర్చీలు, మూత్రశాలల నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది.

బోటింగ్‌ ఏర్పాటు ఎప్పుడో?

ట్యాంకుబండ్‌ పనులు పూర్తయ్యేలోపు చెరువులో బోట్‌ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ట్యాంకుబండ్‌ వద్దకు వచ్చే చిన్నారులు గార్డెన్‌లో ఆడుకోవడంతోపాటు బోటులో షికారు చేసేలా ప్రణాళికలను రూపొందించారు. ఉదయం, సాయంత్రం వేళలో వాకింగ్‌కు వచ్చే వారి కోసం, వారు సేదతీరేందుకు కుర్చీలు, కట్టపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. మద్దుల చెరువు(మినీ ట్యాంకుబండ్‌) పూర్తి విస్తీర్ణంను గుర్తించి చుట్టూ శాశ్వతంగా హద్దులను ఏర్పాటు చేయాల్సి ఉంది. చెరువు శిఖం భూమిలో ఎలాంటి నిర్మాణాలు జరగకుండా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి. పైభాగం నుంచి వచ్చే మురుగు కాలువ నీరు చెరువులో చేరి నీరంతా పూర్తిగా కలుషితమౌతోంది. చెరువులో గుర్రపుడెక్క పెరిగి, కట్టపై పిచ్చిమొక్కలు పెరిగి పూర్తి ఆధ్వానంగా తయారైంది. చెరువు పైభాగంలో కాలువలను నిర్మించి మురుగు నీరు చేరకుండా, పాదచారుల నడక కోసం ఫుట్‌ఫాత్‌, రెయిలింగ్‌ నిర్మాణం కోసం రూ.2.5 కోట్ల కేటాయించి ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభానికి నోచుకోలేదు.

నిర్మాణ దశలో పిల్లల పార్క్‌

అధ్వానంగా ఉద్యానవనాలు

పట్టణంలోని చిన్నారులు ఆడుకునేందుకు సుమారు 16 ఏళ్ల క్రితం సాయిరాంపురకాలనీలో మున్సిపల్‌ పార్క్‌ను ఏర్పాటు చేశారు. మూడేళ్ల క్రితం పార్క్‌ను ఆధునికీకరించేందకు టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.50 లక్షలను మంజూరు చేశారు. పనులు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా మధ్యలోనే వదిలేశారు. చుట్టూ నూతనంగా ప్రహరీ నిర్మించి రంగులను వేయించారు. టైల్స్‌ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. చిన్నారులు ఆడుకునేందుకు పలు పరికరాలు, వ్యాయామం చేసేందుకు జిమ్‌ పరికరాలను ఏర్పాటు చేసినా అసంపూర్తిగా వదిలేశారు. పార్క్‌లో పిచ్చిమొక్కలు పెరిగి కళావిహీనంగా కనిపిస్తుంది. దీంతో చిన్నారులకు ఉద్యానవనం అందుబాటులో లేకుండా పోయింది. బాబుజగ్జీవన్‌రామ్‌ విగ్రహం ఆవరణలోని వాగులో ఉద్యానవనం నిర్మించేందుకు 3.20 ఎకరాల స్థలం, టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.40 లక్షలను కేటాయించారు. పార్క్‌ నిర్మాణ పనులను ఏడాదిన్నర క్రితం ప్రారంభించారు. వాగులోని స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణం కోసం పిల్లర్లను నిర్మించారు. రెండేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలకు పార్క్‌ స్థలం వరద నీటిలో మునిగిపోయింది. ప్రహరీ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన పిల్లర్లు ఓవైపు కూలిపోయాయి.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని