logo

అవకాశాల నిధి..నైపుణ్యాల వారధి

వ్యవసాయం.. కూలీనాలీ.. వెట్టిచాకిరీ తప్ఫ. ఇతర పనులేవీ లేని రోజుల నుంచి పారిశ్రామిక అభివృద్ధి వైపు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పయనిస్తోంది. బతుకుదెరువును అందిపుచ్చుకునేలా ఉపాధి అవకాశాల దిశగా పరుగు పెడుతోంది. 75 ఏళ్ల కిందటితో

Updated : 13 Aug 2022 05:07 IST

ఉమ్మడి జిల్లా ముఖచిత్రం మార్చిన పారిశ్రామిక ప్రగతి

2.87 లక్షల మందికి ఉపాధి

ఈనాడు, కరీంనగర్‌, డిజిటల్‌, పెద్దపల్లి

వ్యవసాయం.. కూలీనాలీ.. వెట్టిచాకిరీ తప్ఫ. ఇతర పనులేవీ లేని రోజుల నుంచి పారిశ్రామిక అభివృద్ధి వైపు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పయనిస్తోంది. బతుకుదెరువును అందిపుచ్చుకునేలా ఉపాధి అవకాశాల దిశగా పరుగు పెడుతోంది. 75 ఏళ్ల కిందటితో చూస్తే పారిశ్రామిక ప్రగతి పూర్తి స్థాయిలో విస్తరించింది. ఉపాధి, ఉద్యోగాల కల్పన పురి విప్పుతోంది. సవాళ్ల పథంలో నైపుణ్యమే జిల్లా వాసులకు దారి చూపుతోంది. వ్యవసాయం తరువాత అంతటి అవకాశాలున్న పారిశ్రామిక రంగంలో స్థిర పడటానికి ఔత్సాహికులు వరుస కడుతున్నారు.

1945 దశకంలో వ్యవసాయానికి అనుబంధంగా పిండి మరలు, నూనె గానుగ, అక్కడక్కడ ఉన్న మిల్లులు మాత్రమే ఉపాధి కల్పించేవి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని రకాల పరిశ్రమలు సుమారు 100 వరకుండేవి. ప్రస్తుతం సూక్ష్మ, మధ్యతరహా, భారీ పరిశ్రమలు కలిపి 18,749 ఉన్నాయి. అప్పట్లో మొత్తం సుమారు వేయి మందిలోపే కార్మికులుండేవారు. ప్రస్తుతం దాదాపు 2.87 లక్షల మంది వివిధ రకాల పరిశ్రమల్లో పని చేస్తున్నారు. వీటితో పాటు స్వయం ఉపాధికి బాటలు వేసే చిరు వ్యాపార సంస్థలను సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్నారు.

కరీంనగర్‌లో ఐటీ టవర్‌

స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత స్థిరమైన జీవనోపాధి, సంతులిత అభ్యున్నతి, ఆర్థికాభివృద్ధికి పరిశ్రమలు బాటలు వేశాయి. యువత, మహిళల్లో సాధికారతను పెంచడం.. వస్తువుల తయారీ, విక్రయాలు, మార్కెటింగ్‌లతో పాటు ఉపాధి, ఉత్పాదకత విషయంలో ఉమ్మడి జిల్లా రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తోంది. ఆర్థిక పరిపుష్ఠికి ఊతమిచ్చేలా ముందుకు సాగుతోంది. నైపుణ్య శిక్షణ, మార్కెటింగ్‌ సౌకర్యాల విషయంలో అపారమైన అవకాశాలు జిల్లా సొంతమవుతున్నాయి. పెట్టుబడిదారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలు అందిపుచ్చుకుంటూ పరిశ్రమల స్థాపనకు మొగ్గు చూపుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల అనుమతులకు హక్కుగా నిర్ధారిస్తూ తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్ట్‌ అనుమతులు, స్వీయ ధ్రువీకరణ(టీఎస్‌ఐపాస్‌)ను అమల్లోకి తెచ్చింది. కొత్త విధానాలను ఏక గవాక్ష పద్ధతిలో అందేలా చూడటంతో నాలుగు జిల్లాల పరిధిలో రెండు దశాబ్దాలుగా ఊహించనంతగా పారిశ్రామిక ప్రగతి కనిపిస్తోంది. టీ-ఐడియా(తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, పారిశ్రామికవేత్తల పురోగతి), టీ-ప్రైడ్‌(తెలంగాణ రాష్ట్ర దళిత పారిశ్రామికవేత్తలకు శీఘ్రగతిన అనుకూలతలు కల్పించే ప్రోత్సాహకాలు) వల్ల గ్రామీణ ప్రాంత యువతకు స్థానికంగా ఉపాధి దొరుకుతోంది.

ఇవి మనకే ప్రత్యేకం

గ్రానైట్‌ పరిశ్రమలతో ఉమ్మడి జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. ఇక్కడ 300కు పైగా గ్రానైట్‌(బ్లాకులు తీసేవి), 200కు పైగా కటింగ్‌ పరిశ్రమలున్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దొరుకుతోంది. చైనా తదితర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా గ్రానైట్‌ పరిశ్రమ ద్వారా ఏటా రూ.కోట్లలో ఆదాయం వస్తోంది.

దేశానికి వెలుగులు పంచే ఎన్టీపీసీ పరిశ్రమకు రామగుండంలో 1978 నవంబరు 14న నాటి ప్రధాని మొరార్జీదేశాయ్‌ శంకుస్థాపన చేశారు. 2017 నుంచి తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌(టీఎస్‌టీపీపీ) పేరిట 2,600 మెగావాట్ల సామర్థ్యంతో రూ.10,599 కోట్లతో మరో విద్యుచ్ఛక్తి ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. రోజుకు 5 లక్షల యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తిని ప్రధాని మోదీ వర్చువల్‌లో ప్రారంభించారు.●

2016లో రూ.6,120 కోట్లకు పైగా పెట్టుబడి వ్యయంతో రామగుండం ఎరువుల కర్మాగారం పనులు ప్రారంభమయ్యాయి. గతేడాది ఉత్పత్తి ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌ తదితర రాష్ట్రాలకు ఇక్కడి ఎరువు ఆదరువుగా మారింది. స్థానికంగా చాలా మందికి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి.

రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చేనేత పరిశ్రమ 1972లో మరమగ్గాలకు విస్తరించింది. ఇక్కడ 38 వేల సాధారణ మగ్గాలుండగా 1500 వరకు అత్యాధునికమైన జెట్‌లూమ్స్‌ ఉన్నాయి. ప్రతి రోజూ వేలాది మీటర్ల కాటన్‌, పాలిస్టర్‌ వస్త్రాలు తయారవుతున్నాయి. బతుకమ్మ చీరల తయారీకి సిరిసిల్ల ప్రసిద్ధి పొందగా, ఇటీవలే జాతీయ జెండాలను తయారు చేసిన ఘనత ఇక్కడి కార్మికులు సొంతం చేసుకున్నారు.

నాలుగు జిల్లాల పరిధిలో 545 బియ్యం మిల్లులున్నాయి. పారాబాయిల్డ్‌ మిల్లులు 254 ఉండగా వీటి ద్వారా ప్రత్యక్షంగా 3500 మంది, పరోక్షంగా మరో 4 వేల మంది ఉపాధి పొందుతున్నారు. జగిత్యాల జిల్లా మామిడి విపణికి చిరునామాగా మారింది. ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తుండగా రవాణా సహా ప్యాకింగ్‌ రంగాల్లో వేలాది మందికి పని దొరుకుతోంది. 

దేశంలోనే మొదటి 100 మెగావాట్ల సౌర విద్యుత్తు కేంద్రం

అందుబాటులో వనరులతో పురోగతి

ఆహారశుద్ధితో పాటు మిల్లులు, ఇంజినీరింగ్‌, సిమెంటు కాంక్రీట్‌, గ్రానైట్‌, రాయి క్రషింగ్‌, థర్మల్‌ పవర్‌ప్లాంట్లు, ఐటీ పార్కులు, ఎరువులు, టెక్స్‌టైల్స్‌, చేనేత, జౌళి పరిశ్రమలు ఉమ్మడి జిల్లాలో విస్తరిస్తున్నాయి. ఒకప్పుడు రాష్ట్ర రాజధానికి సమీపంలోనే ఉండే ఇవన్నీ ఇక్కడి రవాణా, రైలు, నీటి సౌకర్యాల ఆధారంగా అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడి నేలలో నిక్షిప్తమైన బొగ్గు, గ్రానైట్‌ ఇతర ఖనిజాల ద్వారా పారిశ్రామిక వికాసం సొంతమైంది. అందివస్తున్న సాంకేతికత ఆధారంగా కొన్నేళ్ల కిందటే జిల్లాలోకి ఐటీ రంగం అడుగు పెట్టింది. కరీంనగర్‌లో ఐటీ టవర్‌ అందుబాటులోకి రాగా, త్వరలోనే రామగుండంలో ఏర్పాటు కానుండటం యువతకు ఆశాకిరణంగా మారింది.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని