logo

అక్షర సేద్యం..అధునాతన వైద్యం

జిల్లాభివృద్ధికి అందిస్తున్న విద్య.. అందుతున్న వైద్యం ఈ రెండూ కీలకం. పేదరికపు సమస్యల్ని దూరం చేయాలన్నా.. దరి చేరిన రుగ్మతలను రూపుమాపాలన్నా.. ఈ రెండు రంగాల పురోగతి అన్ని కాలలలో అత్యవసరం.  వీటి విషయంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో అనూహ్య మార్పులే చోటు చేసుకున్నాయి.

Published : 14 Aug 2022 06:26 IST

ఈనాడు, కరీంనగర్‌


 

జిల్లాభివృద్ధికి అందిస్తున్న విద్య.. అందుతున్న వైద్యం ఈ రెండూ కీలకం. పేదరికపు సమస్యల్ని దూరం చేయాలన్నా.. దరి చేరిన రుగ్మతలను రూపుమాపాలన్నా.. ఈ రెండు రంగాల పురోగతి అన్ని కాలలలో అత్యవసరం.  వీటి విషయంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో అనూహ్య మార్పులే చోటు చేసుకున్నాయి. స్వాతంత్య్ర సాధన కోసం జరుపుతున్న పోరాట సమయంలో కరీంనగర్‌ జిల్లాలో విద్య, వైద్యం అనేది అన్నివర్గాలకు అందని ద్రాక్షనే..! డెబ్బై ఐదేళ్ల కిందట కొన్ని చోట్లనే.. కొందరికే దక్కిన వనరుగానే ఇది ఉండేది. అక్షరాలు నేర్వాలంటే ఉన్నోళ్ల సొంతమనే మాటలు వినిపించేవి. గాయమైనా.. రోగమొచ్చినా అందుబాటులో ఉన్న ఆకు పసరులే అప్పటి ప్రజలకు మందులుగా ఉపయోగపడేవి. మారుతున్న కాలంతో పోటీపడుతూ ఈ రెండు రంగాలు ఊహించని అభివృద్ధిని అక్కున చేర్చుకుంటున్నాయి.

* 1913వ సంవత్సరంలో కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మిషన్‌ స్కూల్‌, మిషన్‌ ఆస్పత్రిలే జిల్లా ప్రజానీకానికి దిక్కయ్యేవి. కరీంనగర్‌లో అతిపెద్ద జెండా ఉన్న ప్రాంతం సమీపంలో ఉన్న పురాతన మల్టిపర్పస్‌ సర్కారు బడిలో విద్య అందేది. ఆంగ్లేయులు, నిజాం పాలనలో ఉర్దూ మీడియంలో బోధన సాగేది. ఇది కూడా సంపన్నవర్గాలకే ఉపయోగపడేది. 1950 తరువాత జిల్లాలో తెలుగు మాధ్యమం ప్రాధాన్యం పెరిగింది. సీఎస్‌ఐ స్కూల్‌ మిషన్‌ ప్రైవేటు రంగంలో ఏర్పడిన మొట్టమొదటి స్కూల్‌. హెచ్‌ఎస్సీ, పీయూసీ తరువాత డిగ్రీ చదివేవారు.  1968 జాతీయ విద్యావిధానం ద్వారా 10+2+3 వ్యవస్థ అమలులోకి వచ్చింది. సైన్స్‌ పరికరాలు తప్పా.. ఇతర ఏ సాంకేతికత అప్పట్లో లేదు. రేడియోల ద్వారానే కొన్ని విషయాలు తెలిసేవి. ఇక ప్రస్తుతం ఉన్న ఎస్సారార్‌ డిగ్రీ కళాశాల 1956లో ప్రైవేటు మేనేజ్‌మెంట్‌కింద ఏర్పాటైన మొట్ట మొదటి డిగ్రీ కళాశాల. శ్రీరాజరాజేశ్వర దేవస్థానం నుంచి రూ.50వేలు కార్ఫస్‌ ఫండ్‌ కింద ఇచ్చి దీన్ని ఏర్పాటు చేశారు. 1973లో మొదటి మహిళా డిగ్రీ కళాశాల కరీంనగర్‌లో ఏర్పాటైంది. జగిత్యాల, సిరిసిల్ల, రామగుండం ప్రాంతం వారందిరికి ఇక్కడే ఉన్నత విద్య లభించేది.
 


సర్కారు బడుల తీరిలా..
జిల్లా పాఠశాలలు  విద్యార్ధులు సగటు
కరీంనగర్‌ 1,001 1,45,109 145
జగిత్యాల 1141 1,38,098 121
పెద్దపల్లి 762 91,051 119
సిరిసిల్ల 652 72,509 111
మొత్తం 3,556 4,46,767 124


ప్రభుత్వ దవాఖానాల తీరిలా..
జిల్లా ఆస్పత్రులు పడకలు  
జగిత్యాల 178 528      
కరీంనగర్‌ 170 682
పెద్దపల్లి 132 505
సిరిసిల్ల 107 260
మొత్తం 587 1975


ఇలా ప్రగతి మార్గం.
ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు పాఠశాలలు పెరిగాయి. ఇటంర్మీడియట్‌, డిగ్రీ, బీఎడ్‌, పీజీ, ఇంజినీరింగ్‌ కళాశాలల సంఖ్య గణనీయంగా పెరిగింది. శాతవాహన విశ్వవిద్యాలయం 2008 జూన్‌లో ఏర్పాటైంది. జేఎన్‌టీయుల ద్వారా మంథని, కొడిమ్యాలలలో సాంకేతిక విద్య దరిచేరింది.
* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాల ద్వారా పేదలకు విద్య దగ్గరైంది. పాలిటెక్నిక్‌ కళాశాలలతోపాటు వెటర్నరీ కళాశాలలు, వ్యవసాయ కోర్సు సహా ఇతర కోర్సులు అన్ని ప్రాంతాల వారికి ఉపయుక్తంగా మారాయి. సెంటర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎక్కలెన్సీలతోపాటు సైనికపాఠశాలలు మన వద్ద ఉన్నాయి.
* ఉమ్మడి జిల్లాలో ప్రాథమిక పాఠశాలల స్థూల నమోదు నిష్పత్తి పెరుగుతోంది. ఒకప్పుడు 50 శాతంగా ఉండే ఇది ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో 86కు పెరిగింది. గత విద్యాసంవత్సరంలో 0-6 ఏళ్ల వయస్సున్నవారు 2,64,852 ఉండగా.. ఇందులో 2లక్షలకుపైగా చిన్నారులు అంగన్వాడీ, బడి బాట పట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలో 20, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాలో 21గా ఉంది.


మార్పునకు సంకేతం..
* ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 483 గ్రామాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలున్నాయి. మండల కేంద్రాలతోపాటు పెద్ద గ్రామాల్లో మరో 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా రోగులకు సేవలందుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా మెరుగైన వసతులు సమకూరుతున్నాయి.
* జిల్లాల పునర్విభజన తరువాత నాలుగు జిల్లా కేంద్రాల్లో జిల్లాసుపత్రులు ఏర్పాటయ్యాయి. వీటిలో ఐసీయూ ద్వారా అత్యవసర సేవల్ని అందిస్తున్నారు. దీంతోపాటు అన్ని చోట్ల మాతాశిశు సంరక్షణ కేంద్రాల ద్వారా తల్లిబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు బాటలు పడుతున్నాయి. ఇవే కాకుండా ఆయా ప్రాథమిక ఆరోగ్య కుంద్రాల వారీగా డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు.
* ఉమ్మడి జిల్లాలో 3135 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా తల్లులకు పిల్లలకు పోషకాహారాన్ని అందిస్తున్నారు. నాలుగు జిల్లాల పరిధిలో గతేడాది 48,271 మంది తల్లులు వివరాలు నమోదు చేసుకోగా.. 31,096 మంది బలవర్ధకమైన ఆహారాన్ని అందుకున్నారు. 1,91,314 మంది సంరక్షణ సహా అనుబంధ పోషకాహారాన్ని అందుకునేందుకు నమోదవగా ఇందులో 1,15,696 మంది పౌష్టికాహారాన్ని అందుకున్నారు.
* 2021-22 సంవత్సరంలో పెద్దపల్లిలో 3,829, సిరిసిల్లలో 3,059, జగిత్యాల జిల్లాలో 5,558, కరీంనగర్‌ జిల్లాలో 9,068 కేసీఆర్‌ కిట్‌లను అందించారు. ఆరోగ్యశ్రీ ద్వారా సిరిసిల్ల జిల్లాలో 2,083, జగిత్యాల జిల్లాలో 3,756, కరీంనగర్‌ జిల్లాలో 4,666, పెద్దపల్లిజిల్లాలో 2,949 మంది వివిధ రకాల శస్త్ర చికిత్సలను చేయించుకున్నారు.
*జిల్లాకో వైద్యకళాశాల మంజూరైంది. జిల్లాసుపత్రుల్లో ఆధునిక ఉపకరణాలు అందుబాటులోకి రావడంతోపాటు వైద్యసిబ్బంది సంఖ్య పెరిగింది. అన్ని రకాల వ్యాధుల నిర్ధారణ కోసం ప్రత్యేకంగా జిల్లాకో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయి నుంచి రోగుల రక్త నమూనాలను వాహనాల్లో తెచ్చి నిర్ధారిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని