logo

నేతన్నకు దక్కని నైపుణ్య శిక్షణ

నేతన్నల నైపుణ్యాలను సానబెట్టి నూతన వస్త్రోత్పత్తులను ప్రోత్సహించే మరమగ్గాల సేవా కేంద్రం నిరుపయోగంగా మారింది. తొలుత బాగానే పనిచేసినా.. తర్వాత కొత్తతరం ఉత్పత్తులను అందించ్చుకోలేని పరిస్థితి. దీనికితోడు శిక్షణ నిపుణుల నియామకం లేదు.

Published : 14 Aug 2022 06:32 IST

నిరుపయోగంగా మరమగ్గాల సేవాకేంద్రం

కమిషనర్‌ ఆదేశాలతో ప్రణాళికలు

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల

టెక్స్‌టైల్‌పార్కులోని పరిపాలన, మరమగ్గాల సేవాకేంద్ర భవనాలు

నేతన్నల నైపుణ్యాలను సానబెట్టి నూతన వస్త్రోత్పత్తులను ప్రోత్సహించే మరమగ్గాల సేవా కేంద్రం నిరుపయోగంగా మారింది. తొలుత బాగానే పనిచేసినా.. తర్వాత కొత్తతరం ఉత్పత్తులను అందించ్చుకోలేని పరిస్థితి. దీనికితోడు శిక్షణ నిపుణుల నియామకం లేదు. ఇటీవల ఈ కేంద్రాన్ని చేనేత, జౌళిశాఖ కమిషనర్‌ జ్యోతి బుద్ద ప్రకాశ్‌ సందర్శించారు. అప్పుడు ఇందులో రూ.కోట్ల విలువైన మరమగ్గాలు.. పక్కనే ఉన్న నూలు నాణ్యత పరీక్షా కేంద్రం పరిశీలించారు. దీనిని వినియోగంలోకి తీసుకొచ్చే ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, పార్కు అధికారులకు సూచించారు. దీంతో నైపుణ్య శిక్షణపై జిల్లా నేతన్నల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

జిల్లాలో ప్రధానమైన వస్త్రోత్పత్తి రంగం. ఇందులోని కార్మికుల నైపుణ్యాలతో మార్కెట్ను ఆకట్టుకోగలరు. కార్మికులకు ఉపాధి నైపుణ్యాలు మెరుగుపరిచే ఉద్దేశంతో 2002లో టెక్స్‌టైల్‌ పార్కులో మరమగ్గాల సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. అయిదేళ్ల పాటు సీసీపీడబ్లుటీ (సర్టిఫికేట్‌ కోర్స్‌ ఇన్‌ పవర్‌లూం టెక్నాలజీ)పై ఆరు నెలల శిక్షణ ఇచ్చారు. తర్వాత 21 రోజుల శిక్షణలో భాగంగా ఐఎస్‌డీఎస్‌ (ఇంటిగ్రేటెడ్‌ స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ స్కీం)తో శిక్షణనిచ్చారు. శిక్షణలో ఆధునికతలోపించడం.. మూసధోరణిలో సాగడంతో యువతలో ఆసక్తి తగ్గింది. ఉపాధి శిక్షణకు చేనేత, జౌళి విభాగంలో ఇంజనీరింగ్‌, డిప్లమా పూర్తిచేసిన ఆరుగురు సిబ్బందిని నియమించారు. వీరితోపాటు ఒక ప్రిన్సిపల్‌, నాన్‌టెక్నికల్‌లో ఇద్దరు, ఒక అటెండరును నియమించారు. తర్వాతి కాలంలో ఇందులో పనిచేసే సిబ్బంది చేనేత, జౌళిశాఖ లోని ఇతర విభాగాల్లోకి మారారు. ప్రస్తుతం ఒక అటెండరు, ఒక టెక్నీషియన్‌ మాత్రమే ఉన్నారు.

వినియోగంలోకి వస్తే

జిల్లా వస్త్రోత్పత్తి పరిశ్రమకు ఏటా రూ.500 కోట్ల మేర ప్రభుత్వ వస్త్రోత్పత్తుల ఆర్డర్లు వస్తున్నాయి. వీటిలో ప్రధానంగా బతుకమ్మ చీరలు మహిళలను ఆకర్శించేలా డిజైన్లను మార్చుతున్నారు. 2016-17 వరకు సాధారణ మరమగ్గాలకే పరిమితమైన పరిశ్రమలో ఇప్పుడు సగానికిపైగా డాబీ, జకార్డ్‌ నుంచి ఎలక్ట్రానిక్‌ జకాట్‌ అమర్చుకునే స్థాయికి వచ్చాయి. ఇలా ఆధునికతవైపు అడుగులు పడిన ప్రతిసారి పరిశ్రమలోని కార్మికులకు వృత్తి నైపుణ్యత తప్పనిసరి. ఉత్పత్తిలో మెలకువలు నేర్పించడంతోపాటు వాటి మార్కెటింగ్‌ అవకాశాలపై సూచనలు అవసరం.

ప్రతిపాదనలు పంపాం - అశోక్‌కుమార్‌, ప్రాంతీయ ఉప సంచాలకులు, చేనేత జౌళిశాఖ

వస్త్రోత్పత్తులు మార్కెట్‌ను అకర్శించేలా ఉంటేనే పరిశ్రమకు మనుగడ. దీనికి తగ్గట్టుగా కార్మికుల్లో నైపుణ్య శిక్షణ అవసరం. మరమగ్గాల సేవాకేంద్రం వినియోగంలోకి తీసుకువచ్చేలా గత నెల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఉత్తర్వులు వచ్చాకే అవసరమైన సిబ్బంది నియామకం జరుగుతుంది. దాని తర్వాత శిక్షణ ప్రణాళికలు తయారు చేస్తాం.

ఎందుకీ పరిస్థితి?

ఉపకారవేతనం నెలకు రూ.1000గా ఉంది. ఇది ఒక కార్మికుడు పరిశ్రమలో ఏ విభాగంలో పనిచేసినా నెలకు రూ.6వేల పైనే పొందుతాడు. దీనికి తోడు మరమగ్గాల సేవాకేంద్రంలో పురాతనమైన మరమగ్గాలున్నాయి. వీటిని ఆధునిక వాటర్‌జెట్ మరమగ్గాలుగా ఆధునికీకరించాలి. 2017లో పవర్‌టెక్స్‌ ఇండియాలో జిల్లా ఎంపికైంది. దీనిలో రూ.26.8 కోట్లతో కేంద్ర చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో మరమగ్గాల సేవా కేంద్రం నిర్వహణకు ప్రతిపాదించారు. అంతర్జాతీయంగా నూలు ధరల వివరాలు.. వస్త్రోత్పత్తుల విక్రయాలకు మార్కెటింగ్‌ వంటివి అదనపు విభాగాలను చేర్చారు. ఇవి కార్యరూపం దాల్చకుండానే పథకం గడువు ముగిసింది. జిల్లాలోని ప్రభుత్వ ఆర్డర్లకు ఉపయోగించే నూలు, తయారు చేసిన వస్త్రం నాణ్యతను పరిశీలించేందుకు ప్రత్యేక ప్రయోగశాల ఉంది. ఇందులో సుమారు రూ.2 కోట్ల విలువైన యంత్ర పరికరాలూ ఉన్నాయి. నిపుణులులేక పరికరాలు తుప్పుపడుతున్నాయి.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని