logo

స్వాతంత్య్రోదమానికి ఆ‘ధారం’

మెట్పల్లి అంటేనే ఖాదీ.. ఖద్దర్‌ ఉద్యమం.. ఇక్కడి యువకులు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరుగబాటు ఉద్యమంలో పాల్గొనడం.. ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిల్చి వీరత్వం చాటారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం వేళ ఆనాటి పోరాటాలు,

Updated : 15 Aug 2022 05:03 IST

స్వరాజ్య కాంక్ష రగిల్చిన మెట్పల్లి, వావిలాల ఖాదీ ప్రతిష్ఠాన్లు
న్యూస్‌టుడే, మెట్‌పల్లి, జమ్మికుంట

మెట్పల్లి ఖాదీ ముఖద్వారం

మెట్పల్లి అంటేనే ఖాదీ.. ఖద్దర్‌ ఉద్యమం.. ఇక్కడి యువకులు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరుగబాటు ఉద్యమంలో పాల్గొనడం.. ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిల్చి వీరత్వం చాటారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం వేళ ఆనాటి పోరాటాలు, కీర్తి శేషులైన మహానుభావులను ఓసారి మననం చేసుకుందాం.

స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరిపోసి నిజాం జాగీర్లకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో మెట్పల్లి ఖాదీ స్ఫూర్తి కేంద్రంగా నిలిచింది. విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తువుల ప్రోత్సాహ లక్ష్యంతో 1929లో గాంధీ శిష్యుడు అన్నాసాహెబ్‌ సహస్ర బుద్దే ఏర్పాటు చేసిన ఖాదీ జనాల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిల్చడంలో ప్రధాన పాత్ర పోషించింది. మెట్పల్లి ప్రాంతంలో జాగీర్దార్లు, సంస్థానాలు, భూస్వాముల అరాచకాలను ఎదిరించి నిజాం వ్యతిరేక పోరాటం చేశారు. హైదరాబాద్‌, నాగ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ మహాసభలకు హాజరై జైలు పాలయ్యారు. పగలు గ్రామాల్లో తిరుగుతూ ఖాదీ సంస్థలో తయారైన స్వదేశీ వస్త్రాలను అమ్ముతూ రాత్రివేళల్లో బుర్రకథలు చెబుతూ సమావేశాలు నిర్వహిస్తూ, నిరక్షరాస్యులకు పాఠాలు బోధిస్తూ ప్రజలను చైతన్య పరిచారు. 1935లో సిరిసిల్లలో మాడపాటి హనుమంతరావు అధ్యక్షతన జరిగిన నాలుగో ఆంధ్ర మహాసభలో పీవీ నరసింహారావు, సురవరం ప్రతాపరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, కె.వి.రంగారెడ్డి పాల్గొన్న మహాసభకు మెట్పల్లి ప్రాంత ఉద్యమకారులు హాజరయ్యారు. 1947లో మెట్పల్లిలో 22 మందిని ఒకే సారి అరెస్టు చేసి రెండునెలలపాటు కరీంనగర్‌ జైలులో నిర్బంధించారు. తెల్లదొరల పాలన నుంచి 1947లో భారతీయులకు స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల మూకలు సృష్టించిన బీభత్సంతో సంబరాలు జరుపుకోలేక పోయారు. పలువురు ఉద్యమకారులు రహస్యంగా తమ ఇళ్లపై ఖాదీ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఇళ్లలో సంబరాలు జరుపుకున్నారు.

వావిలాల ఖాదీని సందర్శించిన గాంధీ మనవరాలు

ఖాదీ ఉద్యమం
ఖాదీ వ్యాప్తి, హిందూ ముస్లింల మధ్య ఐకమత్యం పెంపొందించడం, అస్పృశ్యత నివారణ లక్ష్యంతో ఖాదీలో పనిచేస్తున్న కార్యకర్తలు, కాంగ్రెస్‌ నాయకులు, ఉద్యమకారులు తప్పనిసరిగా ఖాదీ వస్త్రాలు ధరించాలి, ప్రతి నెల ఒక్కొక్కరు 2 వేల గజాల నూలు వడకాలని 1930లో కాంగ్రెస్‌ నిర్ణయించింది. దీనికి దేశ వ్యాప్తంగా విశేష స్పందన లభించింది. దీంతో మెట్పల్లి ప్రాంతంలో ప్రజలు విదేశీ వస్త్రాలను దహనం చేశారు. స్వదేశీ వస్త్రాల ఉత్పత్తి పెరిగింది. ఖాదీ సంస్థ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో ఖాదీ వస్త్రాలను విక్రయించే కేంద్రాలు వెలిశాయి. అప్పటి నుంచి దేశంలో ఖాదీ రాట్నం స్వాతంత్య్ర ఉద్యమ చిహ్నమైంది. ఇక్కడ తయారైన దోమతెరలు విదేశాలకు ఎగుమతి చేశారు. కుట్టులేకుండా రూపొందించిన చొక్కాను నాటి ప్రధానమంత్రి నెహ్రూకు, షేర్వానిని రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌కు అందించిన ఘనత   మెట్పల్లి ఖాదీది.'

మెట్పల్లి సంస్థ అధ్యక్షులు
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ఎంపీ చొక్కారావు, మాజీ ఎమ్మెల్యే విజయరంగారావు, జిల్లా పరిషత్‌ మాజీ అధ్యక్షులు రాజేశ్వరరావు, హన్మంతరావు మెట్పల్లి ఖాదీ ప్రతిష్ఠాన్‌కు అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే విద్యాసాగరావు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.


రాష్ట్రపతి భవన్‌కు వావిలాల ఖాదీ జెండాలు

గాంధీ జయంతి సందర్భంగా నూలు వడుకుతున్న కార్యకర్తలు

స్వదేశీ ఉద్యమంలో భాగంగా హైదరాబాద్‌ ఖాదీ సమితికి అనుబంధంగా 1929లో జమ్మికుంట మండలం వావిలాలలో అన్నాసాహెబ్‌ సహస్రబుద్దె, లేలేజీలు చరఖా సంఘాన్ని ఏర్పాటు చేసి ఖాదీ వస్త్రోత్పత్తికి శ్రీకారం చుట్టారు. వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తూ వస్త్రోత్పత్తిలో గుర్తింపు పొందింది. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు జాతీయ జెండాలు, అలంకరణ పరదాలు అందించిన ఘనత వావిలాల ఖాదీకి దక్కింది. 1953 నుంచి 1963 వరకు రాష్ట్రపతి భవన్‌పై వావిలాల ఖాదీ జెండాలు రెపరెపలాడాయని సంస్థ నిర్వాహకులు మననం చేసుకుంటున్నారు. 1968 నుంచి వావిలాల ఖాదీ నిర్వహణను మెట్పల్లి ఖాదీ చేపట్టింది. 1983లో మెట్పల్లి నుంచి విడిపోయింది. వావిలాల, తొర్రూర్‌, రాంపూర్‌, మొగుళ్లపల్లి కేంద్రాల్లో ఏటా రూ.3.50 కోట్ల వస్త్రోత్పత్తి జరుగుతుండగా రాష్ట్రంలోని 13 బండార్లలో విక్రయిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు వస్త్రాలను ఎగుతి చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని