logo

విద్యుత్తు సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తం

మండలంలో విద్యుత్తు సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. చొప్పదండి రీజియన్‌ పరిధిలో అధికారులతో పాటు సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండటంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇక్కడ పనిచేస్తున్న ముగ్గురు లైన్‌మెన్‌లను నెల క్రితం బదిలీ చేయగా ఇద్దరిని మాత్రమే కేటాయించారు.

Published : 18 Aug 2022 06:46 IST

 తరచూ అంతరాయం
ఖాళీగా అధికారుల పోస్టులు
చొప్పదండి,న్యూస్‌టుడే


చెట్టు కింద బిల్లులు వసూలు చేస్తున్న సిబ్బంది

మండలంలో విద్యుత్తు సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. చొప్పదండి రీజియన్‌ పరిధిలో అధికారులతో పాటు సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండటంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇక్కడ పనిచేస్తున్న ముగ్గురు లైన్‌మెన్‌లను నెల క్రితం బదిలీ చేయగా ఇద్దరిని మాత్రమే కేటాయించారు. అందులో ఒకరు దీర్ఘకాలిక సెలవులో వెళ్లి ఇటీవలే విధుల్లో చేరారు. ఇద్దరు కొత్తవారు కావడంతో పట్టణంలో విద్యుత్తు సరఫరా వ్యవస్థపై అనుభవం లేకపోవడంతో ఇబ్బందిగా పరిణమిస్తుంది. దీనికి తోడు పక్షం రోజుల క్రితం ఏఈ, సబ్‌ ఇంజినీర్‌, సీనియర్‌ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ను సైతం బదిలీ చేశారు. వారి స్థానంలో ఇతరులను కేటాయించలేదు.
పని చేయని ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్‌
పట్టణంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు కలిగితే వినియోగదారులు తమ సమస్యలను సిబ్బందికి తెలిసేలా ఏర్పాటు చేసిన ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్‌కు సరైన భవనం లేకపోవడంతో ప్రజలు తమ సమస్యలను ఎక్కడ చెప్పాలో అర్థం కావడంలేదు. విద్యుత్తు శాఖ అందించిన చరవాణికి ఫోన్‌ చేసిన లైన్‌మెన్లు ఎవరు స్పందించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపనికి వారాల తరబడి విద్యుత్తు ఉపకేంద్రానికి పరుగులు తీస్తున్నారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులతో సిఫారసు చేసిన వారికి పనులు చేస్తున్నారు. విద్యుత్తు బిల్లుల చెల్లింపు కేంద్రానికి భవనం లేకపోవడంతో చెట్ల కిందనే వసూళ్లు చేస్తున్నారు. గతలో ఓ ప్రైవేటు ఇంటిలో బిల్లుల వసూలు కేంద్రం ఉండగా అద్దె చెల్లించలేదనే కారణంతో కార్యాలయాన్ని తొలగించారు. ప్రజలు ఇబ్బందులు చూడలేక వ్యవసాయ మార్కెట్‌కు వెళ్లే దారిలోని మండల పరిషత్‌కు సంబంధించిన భవనంలో ఏర్పాటు చేశారు. అది సైతం వర్షానికి కూలిపోవడంతో అక్కడ నుంచి ఐకేపీ కార్యాలయం ఆవరణలోని చెట్ల కిందకు మార్చారు. అక్కడ వినియోగదారులు రావడంతో ఐకేపీ కార్యాలయ మహిళలు ఇబ్బందిపడుతున్నారు. అలాగే తరుచు వర్షాలు కురుస్తుండటంతో బిల్లుల వసూలుకు వచ్చే సిబ్బంది సైతం ప్రతీరోజు రావడంలేదు.  బిల్లులు ఎక్కడ చెల్లించాలో తెలియక అయోమయానికి లోనవుతున్నార. చొప్పదండి పట్టణ పరిధిలో విద్యుత్తు సరఫరా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడో ఉండదో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. విద్యుత్తు ఉన్నత అధికారులు స్పందించి ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.


త్వరలోనే సమస్యలకు పరిష్కారం
   - శ్రీనివాస్‌, విద్యుత్తు ఏడీఈ

చొప్పదండి పరిధిలో విద్యుత్తు సిబ్బందిని త్వరలోనే కేటాయింపు చేసేలా చర్యలు తీసుకుంటాం. ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్‌ కోసం సిబ్బంది కేటాయించిన తర్వాత నూతన భవనం కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఏర్పాటు చేసేలా చూస్తాం. సిబ్బంది సక్రమంగా పనిచేసి తరుచు విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలగకుండా చేస్తాం.  


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని