logo

పల్లె దవాఖానాల్లో నిపుణుల సేవలు

పేదలకు సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నాయి. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో పట్టణాలకు వెళ్లలేని గ్రామీణ ప్రజలకు

Published : 18 Aug 2022 06:53 IST

‘టెలీ మెడిసిన్‌’తో ఆన్‌లైన్‌లో వైద్యం
ఏడు నెలల్లో 6,543 మంది సద్వినియోగం
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌

వీడియో కాల్‌లో రోగితో మాట్లాడుతున్న వైద్య నిపుణురాలు

పేదలకు సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నాయి. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో పట్టణాలకు వెళ్లలేని గ్రామీణ ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందించేందుకు ‘టెలీమెడిసిన్‌’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా దూర ప్రాంతాల వారికి అంతర్జాలం ద్వారా వైద్య నిపుణుల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. జ్వరాలు, కీళ్ల నొప్పులు, జలుబు, చర్మ వ్యాధులు, చెవి, ముక్కు, గొంతు తదితర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికి ఆన్‌లైన్‌లోనే సేవలు లభిస్తున్నాయి. వారంలో రోజువారీగా వివిధ విభాగాలకు సంబంధించిన సేవలు అందిస్తున్నారు. ఈ సేవలు వినియోగించుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు ఉన్న ‘టెలీ మెడిసిన్‌’ను ప్రస్తుతం ‘ఈ-సంజీవని’గా మార్చి సేవలు అందిస్తున్నారు.
ఇదీ ఉద్దేశం
ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ‘టెలీమెడిసిన్‌’ కార్యక్రమాన్ని రూపొందించారు. ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ను అనుసంధానించి చికిత్స సమాచారాన్ని అందిస్తున్నారు. నిపుణులైన వైద్యులతో వీడియో కాల్‌ ద్వారా మాట్లాడిస్తున్నారు. మారుమూల ప్రాంతాల వారు పట్టణ ప్రాంతాలకు వెళ్లకుండానే మెరుగైన సేవలు పొందుతున్నారు. మెడికల్‌ చిత్రాలను ప్రసారం చేయడం, డాక్యుమెంట్‌ షేరింగ్‌, కీలక సంకేతాల రిమోట్‌ పర్యవేక్షణ ద్వారా రోగుల సమస్యలను వైద్యుడు గుర్తించి చికిత్స అందిస్తున్నారు.  
రోజువారీగా సేవలు ఇలా..
రోజువారీగా ప్రత్యేక విభాగాలకు చెందిన వైద్య నిపుణుల సేవలను రోగులకు అందించేందుకు ఈ ఏడాది జనవరిలో టెలీమెడిసిన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోమవారం గైనకాలజీ, నెఫ్రాలజీ, మంగళవారం చర్మవ్యాధులు, చెవి, ముక్కు, గొంతు, కంటిచూపు, మూత్రపిండాలు, బుధవారం జనరల్‌ మెడిసిన్‌, మూత్రపిండాలు, గురువారం పిల్లల వైద్యం, జనరల్‌ సర్జరీ, నెఫ్రాలజీ, శుక్రవారం స్త్రీ సంబంధిత వ్యాధులు, శనివారం కీళ్లు, మోకాలు నరాల వ్యాధులు, ఫిజియోథెరపీ, క్యాన్సర్‌ వంటి వ్యాధులకు ఆన్‌లైన్‌లో వైద్య సేవలను అందిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 6,543 మంది రోగులు ఈ సేవలను వినియోగించుకున్నారు.  
పెరుగుతున్న ఆదరణ
గ్రామీణ ప్రాంతాల రోగులు టెలీ మెడిసిన్‌ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. వ్యాధిగ్రస్థులను మొదట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పరీక్షిస్తున్నారు. వారి అనారోగ్య సమస్యలపై వివరాలు నమోదు చేసుకుంటున్నారు. సంబంధిత నిపుణులకు సిఫార్సు చేసి పీహెచ్‌సీ నుంచే టెలీ మెడిసిన్‌లో రోగి వీడియో కాల్‌ ద్వారా సమస్యను చెప్పుకునే అవకాశం కల్పిస్తున్నారు. వ్యాధి లక్షణాలు తెలుసుకున్న వైద్యులు సలహాలు, సూచనలు అందిస్తారు. అనంతరం టెలీ మెడిసిన్‌ పోర్టల్‌ నుంచి మందుల చీటీ వస్తుంది. వాటిని ఉచితంగా అందిస్తున్నారు. రోగి పట్టణాలకు వెళ్లకుండా స్థానిక ఆరోగ్య కేంద్రం నుంచే మెరుగైన వైద్య సేవలను పొందుతున్నారు.
అందుబాటులో మెరుగైన వైద్య సేవలు
డాక్టర్‌ ప్రమోద్‌కుమార్‌, జిల్లా వైద్యాధికారి

టెలీమెడిసిన్‌ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఉండే రోగులకు సైతం వైద్య నిపుణుల సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీడియో కాల్‌ ద్వారా రోగి ప్రత్యక్షంగా వైద్యుడితో మాట్లాడగలుగుతున్నాడు. వ్యాధి రకాన్ని బట్టి మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. టెలీ మెడిసిన్‌ కార్యక్రమంతో పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందుతోంది.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts