logo

బంజారా బతుకమ్మ... తీజ్‌ పండుగ

తరాలు మారిన రాష్ట్రంలోని గిరిజనులు ఆధునిక యుగంలోనూ బంజారాలు తమ సంస్కృతి, సంప్రదాయాలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. సీత్లా భవానీ, బోగ్‌ బండార్‌, తీజ్‌ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. బంజారాలు జరుపుకునే ఈ వేడుక రాష్ట్రంలోని బతుకమ్మని పోలి ఉంటుంది.

Published : 18 Aug 2022 06:53 IST

న్యూస్‌టుడే, వీర్నపల్లి

వేడుకల్లో నృత్యం చేస్తున్న యువతులు, మహిళలు

తరాలు మారిన రాష్ట్రంలోని గిరిజనులు ఆధునిక యుగంలోనూ బంజారాలు తమ సంస్కృతి, సంప్రదాయాలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. సీత్లా భవానీ, బోగ్‌ బండార్‌, తీజ్‌ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. బంజారాలు జరుపుకునే ఈ వేడుక రాష్ట్రంలోని బతుకమ్మని పోలి ఉంటుంది. నేడు ఈ ఉత్సవాన్ని నిర్వహించుకునేందుకు గిరిజనం సిద్ధమవుతున్నారు.
జిల్లాలోని అత్యధిక గిరిజనులున్న వీర్నపల్లి, రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట, ముస్తాబాద్‌, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో తీజ్‌ వేడుకలు ఘనంగా నిర్వహిస్తుంటారు. లంబాడి బాషలో తీజ్‌ అంటే ఎర్రని ఆరుద్ర, నారు అనే అర్థాలు ఉన్నాయి. సీత్లా భవానీ వేడుకలు ముగించుకున్న అనంతరం బంజారాలు తమ సంప్రదాయం ఉట్టిపడేలా పండుగను జరుపుకుంటారు. శ్రావణమాసంలో అవివాహిత యువతులు, బాలికలు నిష్టతో తొమ్మిది రోజులు ఉపవాస దీక్షలను చేస్తారు. అనాదిగా వస్తున్న ఆచారాలను పాటిస్తూ తీజ్‌ ఉత్సవాల్లో పాల్గొంటారు.

తొమ్మిది రోజుల పాటు...
తండాల్లో అవివాహిత యువతులు, బాలికలు, సోదరులు, తండా నాయక్‌ల సాయంతో బుట్టలు కొనుగోలు చేసి అందులో ప్రత్యేక పూజలతో మట్టి, గోధుమలు చల్లుతారు. ఆలయాల ఆవరణలు, తండాలోని నాయక్‌ ఇంటి ఎదుట పందిరిపై ఈ గోధుమనారు బుట్టలను ఉంచుతారు. భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉంటున్న యువతులు గిరిజన పాటలు పాడుతూ తీజ్‌(బుట్ట)లకు రోజులో మూడుసార్లు నీరు పోస్తుంటారు. ఈ పండుగ ముగిసే వరకూ ఒకే పూట ఆకుకూరలతో భోజనం చేస్తుంటారు. ఆ ప్రాంతంలో ఓ పెద్ద ఊయలను ఏర్పాటు చేసి సంబరాలు జరుపుకుంటారు.
అమ్మవార్లకు నైవేద్యం...
చివరి రోజు వేడుకలు అంబరాన్నంటుతాయి. స్థానికంగా సేకరించిన బియ్యంతో పాయసాన్ని నైవేద్యంగా సేవాలాల్‌, జగదాంబ అమ్మవార్లకు సమర్పిస్తుంటారు. గిరిజన వేషధారణ, సంప్రదాయ దుస్తులతో తండావాసులు వేడుకల్లో పాల్గొంటారు. తీజ్‌లను పందిరిపై నుంచి కిందికి దించి బతుకమ్మ మాదిరి తమ సంప్రదాయ నృత్యాలను చేస్తుంటారు. గోధుమ నారును తెంచి బంధువులు, కుటుంబ సభ్యులకు అందజేస్తుంటారు యువతులు. అనంతరం తీజ్‌లను సమీప జల వనరుల్లో నిమజ్జనం చేస్తారు. ఈ వేడుకల్లో గిరిజనులు మాంసంతో చేసిన సలోయి వంటకం ప్రత్యేకంగా నిలుస్తుంది.


ప్రతి వేడుకకు ఓ ప్రత్యేకత ఉంది
- గుగులోతు కళావతి, జడ్పీటీసీ సభ్యురాలు, వీర్నపల్లి

గిరిజనులు చేసుకునే ప్రతి పండుగకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో పండుగ వెనుక ఒక్కో చరిత్ర దాగి ఉంటుంది. తీజ్‌ పండుగ గిరిజనులకు ఓ పెద్ద వేడుక. వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వారు సైతం ఉత్సవాలకు వస్తుంటారు. వీర్నపల్లి మండలంలోని అన్ని తండాల్లో ఈ వేడుకలు బాగా జరుగుతాయి.


అవివాహిత యువతులు ఆరాధిస్తుంటారు
- మాలోతు భూల, ఎంపీపీ, వీర్నపల్లి

వీర్నపల్లి మండలంలో తీజ్‌ వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. సీత్లా భవానీ వేడుకల అనంతరం ఈ తీజ్‌ ఉత్సవాలు జరుపుకుంటారు. పెళ్లికాని యువతులు మంచి తోడు దొరకాలని తీజ్‌లను ఏర్పాటు చేస్తుంటారు. కుటుంబ సభ్యులు, పాడిపశువులు, పంటలు బాగుండాలని సేవాలాల్‌, జగదాంబ అమ్మవార్లను పూజిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని