logo

ఆమ్మో...డెంగీ

ఈ నెలలో ఇప్పటికే ప్రభుత్వాసుపత్రిలో చేపట్టిన రక్తనమూనా పరీక్షల్లో 22 మందిలో డెంగీ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. రెండేళ్ల కిందట ఇదే నెలలో రెండు మూడు కేసులే కనిపించేవి.

Published : 18 Aug 2022 06:53 IST

 జిల్లాలో పెరుగుతున్న కేసులు

ఈనాడు, కరీంనగర్‌, న్యూస్‌టుడే- చైతన్యపురి

జిల్లాసుపత్రిలో రోగాలతో బాధపడుతున్న వారు

* ఈ నెలలో ఇప్పటికే ప్రభుత్వాసుపత్రిలో చేపట్టిన రక్తనమూనా పరీక్షల్లో 22 మందిలో డెంగీ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. రెండేళ్ల కిందట ఇదే నెలలో రెండు మూడు కేసులే కనిపించేవి. ఇప్పుడు రికార్డు స్థాయిలో ఇవి నమోదవుతున్నాయి. గత నెలలో 25 మందికి ఉన్నట్లు తేలగా.. ఈ నెలలో ఈ సంఖ్యను దాటేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
* కరీంనగర్‌ పట్టణంలో అత్యధికంగా ఈ ఏడాదిలో 25 కేసులు నమోదయ్యాయి. మానకొండూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 22, గంగాధర, తిమ్మాపూర్‌ పీహెచ్‌సీల పరిధిలో 13 కేసులున్నట్లు వైద్యఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. మొత్తంగా ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 116 మందిలో డెంగీ లక్షణాలు అగుపించాయి.
జిల్లా ప్రజలను పగటి దోమ పట్టి పీడిస్తోంది.  పల్లె, పట్టణాలు అనే తేడా లేకుండా ఇళ్లల్లో జ్వరపీడితుల సంఖ్య ఇప్పటికే పెరగడానికి తోడుగా.. అందులో డెంగీ బారిన పడిన వారి సంఖ్య అధికంగా ఉంటోంది. గత సీజన్లలో ఎన్నడూ లేని విధంగా ఈ తరహా కేసులు ప్రమాద ఘంటికల్ని మోగిస్తున్నాయి. జిల్లా కేంద్రాసుపత్రితోపాటు పలు ప్రైవేటు ఆస్పత్రులు రోగుల చేరికతో కిటకిటలాడుతున్నాయి. ఇటీవల వరసగా వర్షాలు కురిసి వాతావరణ పరిస్థితుల్ని మార్చడం.. కొన్ని చోట్ల పారిశుద్ధ్యం పడకేయడంతో మశకాల విజృంభణ అధికమవుతోంది. ప్రధానంగా డెంగీ జ్వరాలను వ్యాపింపజేసే దోమలు ఎక్కడపడితే అక్కడ నిలువ నీళ్లలో ఉంటూ వ్యాధులు ప్రబలేందుకు కారణమవుతోంది. దీన్ని నియంత్రించే విషయంలో నామమాత్రపు చర్యలుండటం శాపంగా మారుతోంది.

తీరు మారట్లేదు..!
పల్లె పట్టణాల్లో డ్రైడేల నిర్వహణ సహా ఫాగింగ్‌ విషయంలో అనుకున్న స్థాయిలో చర్యలు లేకపోవడం కేసుల విజృంభణకు కారణమవుతోంది. దోమల నిర్మూలనకు క్రమం తప్పకుండా ఫాగింగ్‌ చేసేపరిస్థితుల్లో ఆయా పంచాయతీల్లో కనిపించడంలేదు. పైగా హుజూరాబాద్‌, కొత్తపల్లి, చొప్పదండి, జమ్మికుంట పురపాలికలతోపాటు నగరపాలక సంస్థలో మురుగునీటి కాలువలు, గుంతల్లో ఆయిల్‌ బాల్స్‌ వేయడం, గంబూషియా చేపల్ని వదలడం లాంటి చర్యలు చేపట్టడంతో విఫలమనే తీరు నెలకొంది. కొన్నిచోట్ల మాత్రం నామమాత్రపు చర్యలు కనిపిస్తున్నా.. మశకాల మరణాల ఊసు అనుకున్న విధంగా లేకపోవడంతో జ్వరాలు పంజా విసురుతున్నాయి. ఇప్పటికైనా పెరుగుతున్న తీవ్రత దృష్ట్యా క్షేత్రస్థాయిలో సరైన చర్యల్ని తీసుకుంటే ఈ సీజన్‌లో మున్ముందు కేసుల సంఖ్యను తగ్గించే వీలుంటుంది.

ఆస్పత్రుల్లో కిటకిట..
ఊరూ.. వాడా.. పల్లె.. పట్టణం అనే తేడా లేకుండా అన్ని వయస్సుల వారిని జ్వర సమస్య పీడిస్తోంది. ప్రతి ఇంటిలో ఒకరైనా బాధపడే పరిస్థితులు పల్లెలో కనపడుతున్నాయి.  జిల్లాసుపత్రిలో మంచాలపై రోగులు చికిత్స అందుకుంటున్నారు. ఇక ప్రైవేటు ఆస్పత్రులకు ఒళ్లు నొప్పులు, తలనొఇ్న, నీరసం వంటి లక్షణాలతో రోగులు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు.ప్రైవేటు ఆస్పత్రిలోకి వెళ్తున్న వారికి ఆర్థికంగా ఊహించని నష్టం జరుగుతోంది. 350 పడకల ఆస్పత్రి ఉన్న కరీంనగర్‌ జిల్లాసుపత్రిలో జ్వరపీడితులతో ఆస్పత్రి కిటకిటలాడుతోంది. ఈ నెల 15వ తేదీన 647 మంది రోగులు జిల్లాసుపత్రికి రాగా.. మరుసటి రోజున 608 మంది పరీక్షల కోసం వచ్చారు. జ్వరాలతో బాధపడే వారు కొందరు మందులు, ఇంజక్షన్లు తీసుకుని ఇంటిబాట పడుతుండగా విషమంగా ఉన్నవారు ఆస్పత్రిలో చేరి చికిత్సనందుకుంటున్నారు.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts