logo

కంప్యూటర్‌ పరిజ్ఞానం.. అందని ద్రాక్షేనా..!

ప్రభుత్వ పాఠశాలల్లో పలు సంస్కరణలు చేపడుతూ విద్యాబోధనలో ప్రభుత్వం కొత్త మార్పులను తీసుకువస్తున్నా కంప్యూటర్‌ పరిజ్ఞానానికి మాత్రం విద్యార్థులు దూరమవుతున్నారు. జిల్లాలోని సర్కారు బడుల్లో గత కొన్నేళ్ల క్రితం ప్రారంభించిన కంప్యూటర్‌ శిక్షణ కనుమరుగైంది.

Published : 19 Aug 2022 04:29 IST

ప్రభుత్వ పాఠశాలల్లో కానరాని బోధన


శిక్షణ కోసం ఏర్పాటు చేసిన కంప్యూటర్లు  

న్యూస్‌టుడే, కరీంనగర్‌ విద్యావిభాగం: ప్రభుత్వ పాఠశాలల్లో పలు సంస్కరణలు చేపడుతూ విద్యాబోధనలో ప్రభుత్వం కొత్త మార్పులను తీసుకువస్తున్నా కంప్యూటర్‌ పరిజ్ఞానానికి మాత్రం విద్యార్థులు దూరమవుతున్నారు. జిల్లాలోని సర్కారు బడుల్లో గత కొన్నేళ్ల క్రితం ప్రారంభించిన కంప్యూటర్‌ శిక్షణ కనుమరుగైంది. రూ.లక్షలు వెచ్చించి బడుల్లో ఏర్పాటు చేసిన కంప్యూటర్లు, ఇతర సామగ్రి మూలన చేరాయి. కొన్ని బడుల్లో అవి కానరాని పరిస్థితి నెలకొంది. ఓవైపు జిల్లాలోని విద్యార్థులు కంప్యూటర్‌ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నా నేర్పించే సౌకర్యం సర్కారు బడుల్లో కనిపించడం లేదు. పలుమార్లు ప్రభుత్వంచే ఉపాధ్యాయులకు కంప్యూటర్‌ శిక్షణ ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు సాంకేతిక విద్య అందించే విషయంలో విద్యాశాఖ చెతులెత్తేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కనిపించని నిర్వహణ

జిల్లాలో 650 పాఠశాలల్లో 49,754 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిల్లో 149 ఉన్నత పాఠశాలలున్నాయి. ఇందులోని విద్యార్థులకు కంప్యూటర్‌ శిక్షణను ప్రభుత్వం 2006లో ప్రారంభించింది. ఒక్కో పాఠశాలకు 11 కంప్యూటర్లు, వాటికి కావాల్సిన సామగ్రిని అందించింది. వీటి నిర్వహణ బాధ్యతను ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించగా ప్రతి పాఠశాలలో కంప్యూటర్‌ బోధన కోసం సిబ్బందిని ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకున్నారు. కాగా 2013లో కంప్యూటర్‌ బోధన చేపట్టే సిబ్బందిని తొలగించడంతో ఈశిక్షణ కార్యక్రమం నిలిచిపోయింది. అప్పటి నుంచి నేటి వరకు కంప్యూటర్‌ శిక్షణ అందించే వారు లేని కారణంగా అవి మూలకు చేరి అక్కరకు రాకుండా పోయాయి. వాటి నిర్వహణ గురించి పట్టించుకునే వారే కరవయ్యారు. జిల్లాలోని 149 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 981 కంప్యూటర్లు ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ వివరాలు తెలుపుతున్నాయి. గత కొన్నేళ్లుగా వాటి నిర్వహణ లేక పాఠశాలల్లో ఓ మూలన పడేశారు. కొన్నింటి విడిభాగాలు కనిపించని స్థితిలో ఉన్నాయి. అధికారుల లెక్కల ప్రకారం 557 కంప్యూటర్లు పనిచేయని దుస్థితిలో ఉన్నట్లు తేల్చినా అంతకు పైగానే ఆపరిస్థితి ఉందనే విషయాన్ని అంచనా వేయవచ్చు. మెజారిటీ పాఠశాలల్లో కంప్యూటర్‌, ఇతర సామగ్రిని స్టోర్‌ రూంలలో పడేశారు.

శిక్షణలు వృథా...

కంప్యూటర్‌ బోధకులు లేని కారణంగా మూలకు చేరిన కంప్యూటర్లను వినియోగంలోకి తెచ్చేందుకు గత నాలుగైదు సంవత్సరాల్లో ఉపాధ్యాయులు, సమగ్రశిక్ష సిబ్బందికి శిక్షణ ఇచ్చినా ఫలితం లేదు. ఎంఈవో కార్యాలయాల్లోని ఎంఐఎస్‌ కో-ఆర్డినేటర్లు పాఠశాలల్లోని కంప్యూటర్లకు మరమ్మతులు చేసేలా వారికి విద్యాశాఖ శిక్షణ ఇచ్చింది. విద్యార్థులకు కంప్యూటర్‌ విద్యా బోధించేలా పాఠశాలల వారిగా ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు ఐదు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఇంత చేసినా పాఠశాలల్లోని కంప్యూటర్లు వినియోగంలోకి రాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈవిషయంలో శ్రద్ధచూపి కంప్యూటర్‌ శిక్షణను పాఠశాలల్లో అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


అందరికీ ఆదర్శంగా...

జిల్లాలోని పాఠశాలల్లో కంప్యూటర్‌ శిక్షణ కనుమరుగైనా గన్నేరువరం మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు అందులో నైపుణ్యతను సాధిస్తున్నారు. ఫ్లోరిడాలో ఉంటున్న ఈ గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ జువ్వాడి రఘు ఇక్కడి బడిలోని విద్యార్థులు కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని పెంచుకునేలా సదుపాయాలు కల్పించారు. పాఠశాలకు 10 కంప్యూటర్లు, సామగ్రిని సమకూర్చి విద్యార్థులకు శిక్షణ అందించేందుకు ఒకరిని నియమించి వేతనాన్ని చెల్లిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. శిక్షణ తీరు, కంప్యూటర్ల బాగోగులను క్రమం తప్పకుండా ఆన్‌లైన్‌ సమావేశం ద్వారా పర్యవేక్షిస్తున్నారు. దీంతో గత కొంత కాలంగా విద్యార్థులు నిత్యం కంప్యూటర్‌లో శిక్షణ పొందుతున్నారు. ఇదే స్ఫూర్తితో విదేశాల్లో ఉంటున్న జిల్లాకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు, ఇతర దాతలు, స్వచ్ఛంద సంస్థలు గ్రామాలు, పట్టణాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి శిక్షణ సౌకర్యాన్ని కల్పిస్తే పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని