logo

విన్నపాలు..బుట్టదాఖలు!

భూమి ఉన్నా.. పట్టా లేదు.. వైకల్యం బాధిస్తున్నా.. పింఛన్‌ రాలేదు.. నీడ లేదు.. సొంత గూడు కావాలని.. స్వయం ఉపాధి కల్పించాలని.. ఇలా ప్రజావాణికి బాధితులు పోటెత్తుతున్నారు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్‌ సమక్షంలో నిర్వహించే

Updated : 26 Sep 2022 05:13 IST

ప్రజావాణి దరఖాస్తులకు మోక్షం కరవు

నోటీసులతో సరిపెడుతున్న అధికారులు

న్యూస్‌టుడే-పెద్దపల్లి కలెక్టరేట్‌, కరీంనగర్‌ గ్రామీణం

పెద్దపల్లి: ప్రజావాణిలో బారులు తీరిన ఫిర్యాదుదారులు(పాతచిత్రం)

భూమి ఉన్నా.. పట్టా లేదు.. వైకల్యం బాధిస్తున్నా.. పింఛన్‌ రాలేదు.. నీడ లేదు.. సొంత గూడు కావాలని.. స్వయం ఉపాధి కల్పించాలని.. ఇలా ప్రజావాణికి బాధితులు పోటెత్తుతున్నారు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్‌ సమక్షంలో నిర్వహించే కార్యక్రమంలో తమ బాధ చెప్పుకుంటే పరిష్కరిస్తారని ఆశగా వస్తున్నారు. కానీ, వారికి అడియాసే ఎదురవుతోంది. పట్టువదలని విక్రమార్కుల్లా పదేపదే ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఉమ్మడి జిల్లాలో ప్రజావాణి తీరుపై ప్రత్యేక కథనమిది..

బాధితులకు భరోసా ఏదీ?

కరోనా అనంతరం రెండున్నరేళ్ల తర్వాత కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. చాలా కాలం తర్వాత అధికారులను ప్రత్యక్షంగా కలిసి సమస్యను చెప్పుకునే అవకాశం రావడంతో పెద్దఎత్తున తరలివస్తున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకు గురై జిల్లా కేంద్రానికి చేరుకొని దరఖాస్తు చేసుకుంటున్నారు. అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడి ఏళ్లగా దరఖాస్తులకు పరిష్కారం దొరకడంలేదు. పరిష్కారం చేయకుండానే అధికారులు నోటీసులు ఇచ్చి పరిష్కరించామని ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ప్రజావాణి దరఖాస్తుల ప్రగతిపై ప్రతి గురువారం కలెక్టర్‌ సమీక్షిస్తున్నారు. పరిష్కారంలో నిర్లక్ష్యం చేయరాదని ఆదేశిస్తున్నారు. కరీంనగర్‌ జిల్లాలో దరఖాస్తు తీసుకుని రశీదుతో సరిపెడుతున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో ప్రజల దరఖాస్తులకు మోక్షం లేదు.

మండల కేంద్రాల్లో కనిపించని ప్రజా‘వాణి’

దూరప్రాంతాల నుంచి ప్రజలు జిల్లాకేంద్రానికి రావడంలో ప్రయాణ ఖర్చు, ఇతర ఇబ్బందుల దృష్ట్యా మండల కేంద్రాల్లోనే ప్రజావాణి నిర్వహించేవారు. కరోనా కారణంగా ఈ ప్రక్రియ వాయిదా పడింది.. పరిస్థితి సాధారణ స్థితిలోకి వచ్చినప్పటికీ మండల కేంద్రాల్లో అమలు చేయడంలేదు. దీంతో ప్రజలు దూరభారమైనా జిల్లాకేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. మండలాల్లో ప్రజావాణి ఉంటే ప్రయాస తగ్గనుందని ప్రజలు అంటున్నారు. తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదంటూ మండల అధికారులు చేతులెత్తేస్తున్నారు.

సాంకేతిక సేవలకు మంగళం

జిల్లాల ఆవిర్భావం తర్వాత అప్పటి పాలనాధికారిణి అలగు వర్షిణి ప్రజావాణి కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు. ఒక గదిలో ఇద్దరు కంప్యూటర్‌ ఆపరేటర్లు బాధితుల దరఖాస్తును స్కానింగ్‌ చేసి ఒక సంఖ్య కేటాయించి ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసేవారు.. సంబంధిత బాధితుడు ప్రజావాణి వేదిక వద్దకు వెళ్లగానే కలెక్టర్‌ సంఖ్య ఆధారంగా సమస్యను చూసి అక్కడికక్కడే సంబంధిత అధికారికి పంపించేవారు.. జిల్లా స్థాయిలో పారదర్శకత పెరిగింది. కొవిడ్‌తో ఈ విధానం అటకెక్కింది.

అత్యధికం భూ సమస్యలే

ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా భూ సమస్యల ఫిర్యాదులే వస్తున్నాయి. భూదస్త్రాల ప్రక్షాళనలో జరిగిన తప్పిదాలతో ఒకటికి పలుమార్లు రావాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్త చట్టంలో ఐచ్ఛికాలు లేకపోవడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.

ఇలా చేస్తే.. పారదర్శకతతో పాటే సాంత్వన

ప్రతి దరఖాస్తు పరిష్కరించేందుకు నిర్ణీత గడువు ఉంటే పారదర్శకత పెరుగుతుంది. ప్రస్తుతం జిల్లాల నుంచి మండల స్థాయిలోని అధికారికి దరఖాస్తు చేరిన వెంటనే కొన్ని చోట్ల మీ అర్జీ పరిశీలనలో ఉందుంటూ నోటీసులతో సరిపెడుతున్నారు. అలా కాకుండా పరిష్కారం ఏ స్థాయిలో ఉందనే సమాచారం ఇస్తే బాధితుల్లో కొంత భరోసా కలగనుంది. ప్రతి దరఖాస్తు పురోగతి ఆన్‌లైన్‌లో ఉంటే పర్యవేక్షణ చేసేందుకు వీలుంటుంది.

ఈయన పేరు సదయ్య.. తన తండ్రి పేరిట పెద్దపల్లి మండలం మూలసాల శివారులో సర్వే నంబర్‌ 3లో పాత పట్టా పుస్తకం ఉంది. ఏళ్లతరబడి సాగు చేస్తూ ప్రతిఫలం పొందుతున్నారు. కొత్త పాసుపుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్న ఫలితంలేదు. ప్రజావాణిలో అర్జీ పెట్టుకున్నా ఫలితం శూన్యం

కరీంనగర్‌కు చెందిన దొమ్మడి రాజు నగర శివారులోని గ్రామాల్లో ప్రభుత్వ భూములను పరిరక్షించాలని నాలుగేళ్లుగా ప్రజావాణిలో దరఖాస్తు చేస్తున్నారు. కొందరు అక్రమంగా వెంచర్లు చేసి భూముల అమ్మకాలు చేస్తుండటంతో ప్రభుత్వ ఆదాయం కోల్పోతుందని ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేడు..

ఈమె కమాన్‌పూర్‌ మండలం కల్వచెర్లకు చెందిన పద్మ.. ఏడేళ్ల క్రితం రహదారి ప్రమాదంలో భర్త మృతిచెందాడు. ఆపద్బంధు పథకంలో పరిహారం కోసం ఉమ్మడి జిల్లాతో పాటు ప్రస్తుత జిల్లాలో నాలుగుసార్లు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంది. కడు పేదరికంలో జీవిస్తోంది. ఈమె గోడును పట్టించుకునే వారే కరవయ్యారు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని