logo

లెక్క తప్పిందా?

సింగరేణి సంస్థ ప్రకటించిన లాభాలపై కార్మిక సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.1227 కోట్ల లాభాలు వచ్చినట్లు యాజమాన్యం ప్రకటించింది. దీనిపై 30 శాతం కార్మికులకు లాభాల వాటాను పంపిణీ చేసేందుకు నిర్ణయించింది.

Updated : 29 Sep 2022 05:09 IST

నికర లాభాలపై కార్మిక సంఘాల అనుమానం

న్యూస్‌టుడే, గోదావరిఖని: సింగరేణి సంస్థ ప్రకటించిన లాభాలపై కార్మిక సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.1227 కోట్ల లాభాలు వచ్చినట్లు యాజమాన్యం ప్రకటించింది. దీనిపై 30 శాతం కార్మికులకు లాభాల వాటాను పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. కార్మికులకు రూ.368 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపిన సింగరేణి యాజమాన్యం నికర లాభాల ప్రకటనపై కార్మిక సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. రూ.26,607 కోట్ల వ్యాపారం చేసినట్లు ప్రకటించింది. పన్నులు చెల్లించేందుకు ముందు రూ.1,722 కోట్లు లాభాలు ఆర్జించినట్లు ప్రకటించింది. బొగ్గు, విద్యుత్తు అమ్మకం ద్వారా రూ.1227 కోట్లు నికర లాభాలు వచ్చినట్లు వెల్లడించింది. మొదట ప్రకటించిన రూ.1722 కోట్ల లాభాలపై కార్మికులకు 35 శాతం వాటాను పంపిణీ చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. నికర లాభాలపై యాజమాన్యం అంకెల గారడీ చేసిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. గత ఏడాది 29 శాతం లాభాల వాటాను చెల్లించిన సింగరేణి ఈసారి 30 శాతం పంపిణీ చేసేందుకు ప్రకటించింది. మస్టర్లు, బోనస్‌ ఆధారంగా కార్మికులకు పంపిణీ చేసే వాటా శాతాన్ని నిర్ణయించనున్నారు. అక్టోబరు 1న పంపిణీ చేసేందుకు యాజమాన్యం ప్రకటించింది.

సంఘాల ప్రమేయం లేకుండానే..
ప్రభుత్వ సూచన మేరకు కార్మికులకు 30 శాతం పంపిణీ చేసేందుకు యాజమాన్యం నిర్ణయించింది. 1999లో కార్మికులకు లాభాల వాటా పంపిణీ చేయాలన్న డిమాండ్‌ మేరకు గుర్తింపు సంఘం సమక్షంలో వాటా శాతాన్ని ప్రభుత్వం ప్రకటించింది. మొదటి సారిగా 10 శాతం లాభాల వాటాను ప్రకటించిన ప్రభుత్వం ఏటా ఇదే విధంగా గుర్తింపు సంఘం సమక్షంలోనే ప్రభుత్వం వాటా శాతాన్ని ప్రకటిస్తూ వస్తుంది. ఈ ఏడాది మాత్రం కార్మిక సంఘాల ప్రమేయం లేకుండానే ప్రభుత్వ సూచన మేరకు 30 శాతం పంపిణీ చేసేందుకు నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని