logo

యువ నైపుణ్యం.. ఉపాధి సాకారం

గ్రామీణ నిరుపేద యువత ఆలోచన, అభిరుచికి అనుగుణంగా వ్యాపార రంగంలో ఉపాధి కల్పించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. స్థానికంగానే వ్యక్తిగతంగా, సమష్టిగా కుటీర పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన నైపుణ్యం అందిస్తున్నారు.

Published : 29 Sep 2022 04:53 IST

‘ఉన్నతి’ శిక్షణతో నిరుద్యోగులకు బాసట
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌


కొవ్వొత్తులు తయారు చేస్తున్న యువతులు

గ్రామీణ నిరుపేద యువత ఆలోచన, అభిరుచికి అనుగుణంగా వ్యాపార రంగంలో ఉపాధి కల్పించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. స్థానికంగానే వ్యక్తిగతంగా, సమష్టిగా కుటీర పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన నైపుణ్యం అందిస్తున్నారు.

జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో 100 పని దినాలు పూర్తి చేసిన కుటుంబాల్లోని యువతలో జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ‘ఉన్నతి’ పథకం పేరిట శిక్షణ ఇస్తున్నారు. ఈ పథకం కింద జిల్లాలోని 13 గ్రామీణ మండలాల్లో 2,946 మంది అర్హులున్నట్లు గుర్తించగా ఇప్పటివరకు విడతల వారీగా 266 మందికి వివిధ రంగాల్లో తర్ఫీదునిచ్చారు. జిల్లాల ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా ఈ ఏడాది శిక్షణ ఇవ్వడంతో యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

మార్కెటింగ్‌లో మెలకువలు
* పేదల కుటుంబాల్లోని చాలా మంది యువత డిగ్రీ, ఐటీఐ తదితర చదువులు పూర్తి చేసినా సరైన మార్గదర్శకం లేక ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నారు. చిరు వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు స్థాపించాలనే ఉత్సాహం ఉన్నా నైపుణ్యం, అనుభవం లేక వెనుకాడుతున్నారు.
* జిల్లాలో 2018-19 ఆర్థిక సంవత్సరంలో ‘ఉన్నతి’ పథకానికి 18-40 ఏళ్లలోపు 2,946 మంది అర్హులు తేలారు. విద్యార్హత ఆధారంగా తాపీమేస్త్రీ, ఎలక్ట్రిషియన్‌, ప్లంబర్‌, శానిటేషన్‌ పనిలో నైపుణ్యం పెంచడంతో పాటు అగరుబత్తులు, కొవ్వొత్తులు, ల్యాండ్‌ సర్వేయర్‌, స్టోర్‌, కుట్టు శిక్షణ, కీపర్‌ తదితర రంగాల్లో పది రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు.
* పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లో జనపనార, శ్రీరాంపూర్‌, ఓదెల మండలాల్లోని వారికి కొవ్వొత్తుల తయారీ, మంథని, ముత్తారం మండలాల్లో వర్మీకంపోస్టు, కూరగాయల సాగు, అంతర్గాం, పాలకుర్తి మండలాలకు అగరుబత్లు తయారీపై తర్ఫీదునిచ్చారు.

మా కాళ్లపై మేం నిలబడతాం: కల్యాణి, పెద్దంపేట, అంతర్గాం మం.
ఏదైనా వ్యాపారం చేయాలన్న ఆలోచన ఉండేది. నైపుణ్యం లేక, మార్కెటింగ్‌ ఎలా చేయాలో తెలియక ముందుకెళ్లలేని పరిస్థితి. అగరుబత్తుల తయారీ, విక్రయంలో మెలకువలు నేర్చుకున్నాను. మా కాళ్లపై మేం నిలబడగలమన్న ధైర్యం వచ్చింది. 

ఊరిలోనే ఉపాధి: సాయిప్రమోద్‌, మల్యాల, శ్రీరాంపూర్‌ మం.
ఐటీఐ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నాను. కొవ్వొత్తు తయారీపై శిక్షణ పొందాను. పది రోజుల్లోనే ఉత్పత్తి, ముడి పదార్థాలపై అవగాహన పెంచుకున్నాను. వివిధ ఆకృతుల్లో ఆకర్షణీయంగా తయారు చేయడం నేర్చుకున్నాను. ఊరిలోనే ఉపాధి దొరుకుతోంది.

స్థానికంగానే ఆదాయ మార్గం: బండి కావ్య, పెద్దంపేట, శ్రీరాంపూర్‌ మం.
ఉపాధిహామీలో మా కుటుంబం వంద రోజులు పని పూర్తి చేయడంతో శిక్షణ పొందే అవకాశం వచ్చింది. నేను వ్యవసాయ పనులకు వెళ్తున్నాను. శిక్షణలో కొవ్వొత్తుల తయారీపై నేర్చుకున్నాను. ప్రస్తుతం ఎక్కడో తయారైన అగరుబత్తులను ఇక్కడికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. కుటీర పరిశ్రమ ఏర్పాటుతో ఆదాయ మార్గం దొరికింది.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts