logo

ప్రయాణికులకు ఉత్తమ సేవలు... ఉద్యోగులకు అవార్డులు

ఆధ్యాత్మిక క్షేత్రమైన వేములవాడలోని ఆర్టీసీ డిపోకు ముఖ్యంగా రాజన్న భక్తులతోపాటు ప్రయాణికుల వల్ల ఆదాయం సమకూరుతోంది. వేములవాడ డిపో అధికారులు ప్రయాణికులకు మంచి సేవలందించడంతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారు.

Published : 29 Sep 2022 04:53 IST

లాభాల బాటలో ఆర్టీసీ వేములవాడ డిపో
న్యూస్‌టుడే, వేములవాడ

ఆధ్యాత్మిక క్షేత్రమైన వేములవాడలోని ఆర్టీసీ డిపోకు ముఖ్యంగా రాజన్న భక్తులతోపాటు ప్రయాణికుల వల్ల ఆదాయం సమకూరుతోంది. వేములవాడ డిపో అధికారులు ప్రయాణికులకు మంచి సేవలందించడంతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రయాణికులు ఎటుంటే అటువైపే బస్సులను నడిపిస్తూ వారి ఆదరణను పొందుతూ లాభాల బాటలో పయనిస్తోంది.

కరోనా తగ్గిన తరవాత ప్రయాణికుల కోసం ఆర్టీసీ అనేక రాయితీ పథకాలను అమలు చేసింది. శుభకార్యాలకు రాయితీతో ప్రజలకు బస్సు సౌకర్యం కల్పిస్తోంది. గర్భిణులు, డయాలసిస్‌, హెచ్‌ఐవీ రోగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. కార్గో ద్వారా వస్తువులను ఇంటికి చేర్చడం వంటివి చేపట్టడంతో ఆదరణ పెరుగుతూ వస్తోంది. కళాకారుల ద్వారా ఆర్టీసీ పథకాలపై విస్తృత ప్రచారం కల్పిస్తోంది. దీంతో కరీంనగర్‌ రీజియన్‌లోని 11 డిపోల్లో వేములవాడ డిపో అత్యుత్తమంగా సేవలందిస్తూ ఆదాయాన్ని పెంచుకుంటూ లాభాల బాటలో పయనిస్తోంది. వేములవాడ డిపోలో మొత్తం 66 బస్సులుండగా రోజూ రూ.9 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. శ్రావణ మాసంలో రోజుకు రూ.11.50 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ఈ సీజన్‌లో డిపో బస్సులు 8.60 లక్షల కిలో మీటర్లు తిప్పడంతో కిలో మీటరుకు రూ.6.44ల చొప్పున రూ.55 లక్షలపైన లాభం ఆర్జించి రీజియన్‌లో వేములవాడ డిపో మొదటి స్థానంలో నిలిచింది.

ప్రత్యేక శిక్షణ తరగతులతో...
ఆర్టీసీలో ఇప్పటి వరకు కేవలం సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యోగులకు సూచనలు, సలహాలు అందించేవారు. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్‌ బాధ్యతలు చేపట్టిన తరవాత అనేక సంస్కరణలకు రూపకల్పన చేసి అమలుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా  ఫైనాన్సియల్‌ మేనేజ్‌మెంట్‌, ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌, సంస్థ ఆర్థిక స్థితిగతులు, ప్రయాణికులతో వ్యవహరించాల్సిన తీరుపై ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతూనే ఆర్టీసీకి లాభాలు వచ్చే విధంగా సౌకర్యాలను మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్వహించిన ఆర్టీసీ ఉద్యోగుల శిక్షణ కార్యక్రమంలో వేములవాడ డిపో మేనేజరు భీమ్‌రెడ్డి పాల్గొని ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. దీంతో రాష్ట్ర స్థాయిలో డీఎం బెస్ట్‌ టీచింగ్‌ అవార్డు అందుకున్నారు. వంద రోజుల ఛాలెంజ్‌ కార్యక్రమంలో డిపో ఉద్యోగులు తమ ప్రతిభను చాటారు. ఆదాయం పెంచడంలో కీలక పాత్ర పోషించి ఉత్తమ అవార్డులను తీసుకున్నారు. డిపోకు చెందిన కండక్టర్‌ మొండయ్య, డ్రైవర్లు ఆంజనేయులు, శ్రీనివాస్‌, మెకానిక్‌లు శ్రీధర్‌, ఎం.ఎ.రవూఫ్‌, కమలాకర్‌, రామకృష్ణ ఏడీసీ (టైర్‌)లు ఉత్తమ అవార్డులు సొంతం చేసుకున్నారు. డిపోలో డీఎంతో పాటు మొత్తం 8 మంది  హైదరాబాద్‌లోని ఆర్టీసీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మంగళవారం ఆర్టీసీ ఎండీ చేతుల మీదుగా అవార్డులతో పాటు ప్రశంసలు అందుకున్నారు.


అవార్డు అందుకుంటున్న డీఎం భీమ్‌రెడ్డి

అందరి సహకారంతో లాభాలు : -భీమ్‌రెడ్డి, డిపో మేనేజరు, వేములవాడ
అందరి సహకారంతోనే డిపో లాభాల బాటలో నడుస్తోంది. ప్రస్తుతం ప్రజలు ఆర్టీసీని ఆదరించడంతోనే ఆదాయం బాగుంది. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సంస్థ అనేక రాయితీ పథకాలను ప్రవేశపెట్టింది. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఆర్టీసీ ఉద్యోగులకు అత్యుత్తమ శిక్షణ ఇవ్వడంతో ఉత్తమ అవార్డు లభించడం ఆనందంగా ఉంది.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts