logo

కట్టారు... కళ్లు మూసుకున్నారు!

అంత్యక్రియలకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పల్లెల్లో సకల సౌకర్యాలతో వైకుంఠధామాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రెండు నమూనాల్లో 255 పంచాయతీల్లో సుమారు రూ.28 కోట్లతో పనులు చేపట్టారు.

Published : 29 Sep 2022 04:53 IST

అసంపూర్తి పనులతో ఆఖరి మజిలీకి అవస్థలు
ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల


ముస్తాబాద్‌ మండలం ఆవునూరు వద్ద వాగులో మధ్యలో ఆగిన పనులు

అంత్యక్రియలకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పల్లెల్లో సకల సౌకర్యాలతో వైకుంఠధామాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రెండు నమూనాల్లో 255 పంచాయతీల్లో సుమారు రూ.28 కోట్లతో పనులు చేపట్టారు. వీటి నిర్మాణ బాధ్యతలను ఆయా పంచాయతీల ప్రజాప్రతినిధులకే అప్పగించారు. చాలా చోట్ల నిధులు సరిపోక అప్పులు చేసి మరీ నిర్మించారు. రూ.కోట్లు వెచ్చించి నిర్మించి వాటి వినియోగాన్ని  పూర్తిగా విస్మరించారు. జిల్లా అధికారుల వద్ద మాత్రం వినియోగంలో ఉన్నట్లు చూపుతున్నా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. అసంపూర్తి పనులు, అరకొర వసతులతో నిర్వహణ లేక ఆఖరి మజిలీలో అవస్థలు తప్పడం లేదు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలుత 73 పంచాయతీలకు ఒక్కో నిర్మాణానికి రూ.10లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. నమూనాలో లోపాలు, కేటాయించిన నిధులు సరిపోక చాలా వరకు పనులు చేసేందుకు ముందుకు రాలేదు. తర్వాత 182 పంచాయతీల్లో ఒక్కో నిర్మాణానికి రూ.12.60 లక్షలు కేటాయించారు. పాత ప్రణాళికలోని వాటికి అదనంగా పంచాయతీ సాధారణ నిధులు కేటాయించారు. పనుల బాధ్యత ప్రజాప్రతినిధులకే అప్పగించారు. అయితే చాలా చోట్ల వీటిని చెరువు శిఖం, వాగుల్లో నిర్మించడంతో వర్షాలకు నీట మునగడం, గ్రామ శివారులోని ప్రభుత్వ భూముల్లో నిర్మించినా చాలా వాటికి రహదారి సౌకర్యం లేదు. కొన్ని చోట్ల పనులు నాసిరకంగా ఉండటంతో వర్షాలకు పగుళ్లు బారాయి. దీంతో ఎప్పటి మాదిరిగానే పంట పొలాలు, మరికొందరు ముంపు ప్రాంతం లేని చోట అంత్యక్రియలు నిర్వహించుకుంటున్నారు. స్నానాలు చేయడానికి, దుస్తులు మార్చుకోవడానికి మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు.

జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం అన్ని పంచాయతీల్లో వందశాతం వైకుంఠ ధామాల నిర్మాణాలు పూర్తయ్యాయి. మానేరు, మూలవాగు సమీపంలోని గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌, తంగళ్లపల్లి, వేములవాడ మండలాల పరిధిలోని పలు గ్రామాలు వాగు సమీపంలో నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడికి వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేక వర్షాకాలంలో వెళ్లలేని పరిస్థితి. మరికొన్నింటికి వసతి గదులు లేవు. వాగులు పొంగిపొర్లితే చాలా రోజుల పాటు అటువైపు వెళ్లలేరు. మెజారిటీ గ్రామాల్లో ఇప్పటికీ చెరువు శిఖం, వాగు ఒడ్డున, పొలం గట్లు, తమ సొంత పంట క్షేత్రాల్లో ఆఖరి మజిలీ కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. నీటి వసతి లేని చోట పంచాయతీ ట్రాక్టర్లు ఉపయోగిస్తున్నారు. అందుబాటులో లేకుంటే వ్యవసాయ బోరుబావులే దిక్కు. కార్యక్రమం తర్వాత స్నానం చేసేందుకు మహిళలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 94 వైకుంఠధామాల్లో విద్యుత్తు సౌకర్యం లేదు. దీనికి కోసం సెస్‌కు విద్యుత్తు వరుసలను అమర్చేందుకు రూ.4 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశారు. డబ్బులు చెల్లిస్తే పనులు చేస్తామని సెస్‌ అధికారులు చెబుతున్నారు.


వీర్నపల్లి మండలం బావుసింగ్‌నాయక్‌తండాలో రహదారి లేక నిరుపయోగంగా మారిన దృశ్యం

కొరవడిన ప్రణాళిక
వైకుంఠధామాల నిర్మాణాల్లో ప్రణాళికలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చెరువు శిఖం, వాగులు, వరద ప్రవాహాలు ఉన్నచోట నిర్మాణాలు చేపట్టరాదు. వీటికి జలవనరులశాఖ నుంచి అనుమతులు పొందలేదు. ఇవేవీ పరిశీలించకుండానే ఇంజినీరింగ్‌శాఖ బిల్లులు మంజూరు చేసింది. కొన్ని చోట్ల రెవెన్యూ అధికారులు ఎక్కడ స్థలాలు చూపిస్తే అక్కడ నిర్మించారు. ముంపు ప్రాంతం, దారి సౌకర్యం వంటికి పట్టించుకోలేదు. నిర్మాణాలు చేసే సమయంలోలైనా సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులూ ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామాలు నిరుపయోగంగా మారాయని గ్రామస్థులు వాపోతున్నారు.

రహదారి లేక ఇబ్బందులు : -దాసరి గణేష్‌, రాచర్ల గొల్లపల్లి, ఎల్లారెడ్డిపేట మండలం
గంగమ్మ ఆలయం వద్ద రహదారిపై వంతెన నిర్మాణంతో వైకుంఠధామానికి వెళ్లలేని పరిస్థితి ఉంది. ఒకవైపు దారిలేదు. మరోవైపు నుంచి వెళదామంటే మానేరువాగు ఉంది. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన వైకుంఠ ధామానికి దారి లేక నిరుపయోగంగా మారింది. వర్షాలు ఎక్కువగా కురిసినపుడు అంత్యక్రియలకు ఇబ్బందిగా మారుతుంది. అధికారులు స్పందించి కొత్తగా నిర్మించిన వంతెన నుంచి రహదారి ఏర్పాటు చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని