logo

తక్కువ సైజు.. అక్రమాలే రివాజు

ఈ రెండు ఉదాహరణలు సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో అక్రమాలను వెల్లడిస్తున్నాయి. నీటి వనరుల్లో పెంపకానికి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం ప్రహసనంగా మారింది. టెండరు ప్రక్రియ మొదలు పిల్లల పంపిణీ వరకు అడుగడుగునా అక్రమాలు జరుగుతున్నాయి.

Published : 29 Sep 2022 04:53 IST

ప్రహసనంగా చేప పిల్లల పంపిణీ ప్రక్రియ
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌, కరీంనగర్‌ పట్టణం


జూలపల్లిలో చెరువులో చేప పిల్లలు వదులుతున్న ప్రజాప్రతినిధులు(పాతచిత్రం)

* పెద్దపల్లి జిల్లాలో ఈ ఏడాది టెండర్లలో పాల్గొన్న గుత్తేదారు తప్పుడు ధ్రువపత్రాలు, నకిలీ బ్యాంకు డాక్యుమెంట్లు సమర్పించినట్లు అధికారుల విచారణలో తేలింది. దీంతో టెండరు రద్దు చేసి మరొకరికి కట్టబెట్టారు.

* జగిత్యాల జిల్లాలో ఈ ఏడాది 711 చెరువులు, కుంటల్లో 1.56 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేస్తున్నారు. ఇక్కడి ‘జలపుష్ప ఫిష్‌ సీడ్‌ హేచింగ్‌ కంపెనీ’ తెచ్చిన 3.68 లక్షల చేప పిల్లలు నాసిరకంగా ఉన్నాయని మత్స్యశాఖ అధికారులు తిరస్కరించారు.

ఈ రెండు ఉదాహరణలు సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో అక్రమాలను వెల్లడిస్తున్నాయి. నీటి వనరుల్లో పెంపకానికి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం ప్రహసనంగా మారింది. టెండరు ప్రక్రియ మొదలు పిల్లల పంపిణీ వరకు అడుగడుగునా అక్రమాలు జరుగుతున్నాయి. నాణ్యత లేని పిల్లలు సరఫరా చేశారని ఆ శాఖ అంతర్గత తనిఖీలోనే తేలడం గుత్తేదారుల తీరును తేటతెల్లం చేస్తోంది. పథకం అమలుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో చేప పిల్లల పంపిణీ తీరుపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

మూడేళ్లుగా అనర్హులకు టెండర్లు దక్కడం పరిపాటిగా మారింది. టెండర్లలో పాల్గొన్న వారు నకిలీ పత్రాలు, బ్యాంకు లీకేజీలు సమర్పించినట్లు అధికారుల పరిశీలనలో తేలుతోంది. దీంతో వాటిని రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవడం, పంపిణీ తదితర ప్రక్రియతో ఏటా జాప్యం జరుగుతోంది. కొందరు గుత్తేదారులకు పిల్లల పంపిణీలో అనుభవం లేకున్నా, నకిలీ బ్యాంకు లింకేజీలతో విత్తన చేపలను నిర్వహిస్తున్నామని చెబుతూ టెండర్లలో పాల్గొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

3,066 వనరులు.. 6.68 కోట్లు
ఉమ్మడి జిల్లాలోని 3,066 వనరుల్లో చేప పిల్లల పెంపకం లక్ష్యం 6.68 కోట్లుగా పెట్టుకున్నారు. భారీ జలాశయాలైన సుందిళ్ల బ్యారేజీ, శ్రీపాద ఎల్లంపల్లి, మధ్యమానేరు, దిగువ, ఎగువ మానేరు జలాశయాల్లో ఎద్దఎత్తున రొయ్యల పెంపకం సాగుతోంది. పెద్ద పరిమాణంలో ఉంటే ఒక్క దానికి రూ.1.85, చిన్న పరిమాణంలోని వాటికి రూ.1.20 చొప్పున బొచ్చ, రోహు, బంగారుతీగ చేప పిల్లలకు వెచ్చించి ఇష్టారాజ్యంగా వదిలేసి చేతులు దులుపుకుంటున్నారు.

లెక్క తప్పుతోంది..
* ప్రతి సీజన్‌లో చేప పిల్లల పరిమాణం, మోతాదు విషయంలో కచ్చితమైన ప్రమాణాలు పాటించడం లేదు. పెద్ద సైజు(80-100 మి.మీ.లు) పిల్లలను కిలో చొప్పున, చిన్న సైజు(35-40 మి.మీ.లు) పిల్లలను పాలిథీన్‌ కవర్లలో 10 వేల పిల్లల చొప్పున నీటితో నిల్వ చేసి చెరువుల్లో వదులుతున్నారు.
కవర్లలో వేసే చేప పిల్లల లెక్క తప్పుతోంది. ప్రతి కవరులో కనీసం 100 కంటే ఎక్కువగానే తగ్గుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. పరిమాణం తక్కువగా ఉండటంతో ఎదుగుదల క్షీణించి కొన్ని చిన్న పిల్లలు చెరువుల్లోనే చనిపోతున్నాయి.
వర్షాల ఆరంభంలో అంటే జూన్‌లోనే పిల్లలను వదలాలని మత్స్యకారులు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ఏటా సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో వేస్తుండటంతో వేసవిలో దిగుబడి రావడం లేదు. చెరువుల్లో నీరు అడుగంటుతుండటంతో ఎదుగుదలపై ప్రభావం చూపుతోంది.


అదనులో వేయక తగ్గుతున్న దిగుబడి


కరీంనగర్‌లో పంపిణీకి వచ్చిన చిన్న పరిమాణంలోని చేప పిల్లలు

కరీంనగర్‌ జిల్లాలో ఈ ఏడాది పంపిణీ లక్ష్యం 2.29 కోట్లు. ఇక్కడి జలాశయాల్లో ఉత్పత్తి అయిన పిల్లలను జిల్లా అవసరాలు పోగా ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. పెద్ద పరిమాణంలోని చేపలు కోల్‌కతాకు ఎగుమతి అవుతున్నాయి. అదనులో పిల్లలను వేయకపోవడంతో దిగుబడి తగ్గుతోందన్న విమర్శలున్నాయి.
రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఎగువ మానేరు సమీపంలో 25 ఎకరాల్లో జాతీయ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ఉంది. ఇక్కడ కోటికి పైగా ఉత్పత్తి సామర్థ్యం ఉంది. సిబ్బంది కొరత, ఇతర కారణాలతో కేంద్రం నిర్వహణకు నోచుకోవడం లేదు. గంభీరావుపేట మండలం నర్మాలలో విత్తన చేప పిల్లలను ఉత్పత్తి చేసి ఈ ఏడాది 35 లక్షలు పంపిణీ చేస్తున్నారు.
జగిత్యాల జిల్లాలో ఈ ఏడాది 711 చెరువులు, కుంటల్లో 1.56 కోట్ల పిల్లల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. ఏటా చిన్న పరిమాణం కలిగిన పిల్లలు పంపిణీ చేస్తుండటంతో దిగుబడి తగ్గుతోంది. అర కిలో కంటే ఎక్కువ పరిమాణం రావడం లేదని ఆందోళన చెందుతున్నారు.


అవకతవకలకు తావు లేకుండా చర్యలు

-దేవేందర్‌, మత్స్య శాఖ అధికారి, కరీంనగర్

చేప పిల్లల పంపిణీలో పారదర్శకత పాటిస్తున్నాం. అవకతవకలకు తావు లేకుండా పర్యవేక్షిస్తున్నాం. కరీంనగర్‌ జిల్లాలో ఉత్పత్తి చేసిన చేపలను జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు గుత్తేదారుల ఒప్పందం ప్రకారం సరఫరా చేస్తున్నాం. నాణ్యమైన, రుచికరమైన చేపల ఉత్పత్తి జరుగుతుండటంతో కోల్‌కతాకు ఎగుమతి చేస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని