logo

ముదిమిని మురిపిద్దాం

బతుకు భారమని.. ఇక జీవించలేమని ఆరు నెలల కిందట జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు తనను ఆదరించే వారు లేరనే వ్యథతో తాను పడుకున్న మంచానికి నిప్పు పెట్టుకుని ఆత్మాహుతి చేసుకున్నాడు. అడపాదడపా ఇలాంటి సంఘటనలు

Published : 01 Oct 2022 04:28 IST

నేడు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం

ఈనాడు, కరీంనగర్‌

బతుకు భారమని.. ఇక జీవించలేమని ఆరు నెలల కిందట జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు తనను ఆదరించే వారు లేరనే వ్యథతో తాను పడుకున్న మంచానికి నిప్పు పెట్టుకుని ఆత్మాహుతి చేసుకున్నాడు. అడపాదడపా ఇలాంటి సంఘటనలు జిల్లాలో కలవరపరుస్తున్నాయి. మలివయస్సులోని వారి వ్యథను చూపుతున్నాయి.

కరీంనగర్‌ సమీపంలోని ఓ గ్రామంలో రెండు నెలల కిందట కన్న కొడుకులు తమను పట్టించుకోవడం లేదని ఉన్న ఇల్లును ఆస్తిని తీసుకున్నారని బాధతో ముదిమి వయస్సులో ఉన్న ఇద్దరు రోడ్డు పక్కన జీవనాన్ని సాగిస్తున్నారు. ఇదే విధంగా తిమ్మాపూర్‌ మండలంలోని వృద్ధ దంపతులు కూడా ఇదే విధంగా అయినవారికి దూరమయ్యామనే వేదనను కనిపించిన వారికి వినిపించారు.

వారిని చూస్తే చేతులు జోడించాలనిపిస్తుంది.. వారి ఆప్యాయత పలకరింపును చూసి ఆనందమనిపిస్తుంది. ముఖంపై పడిన ముడతలు వారి జీవన అనుభవాలకు నిదర్శనం. అలాంటి వృద్ధుల విషయంలో అక్కడక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గడ్డాలొచ్చే దాకా బిడ్డల్ని పెంచిన పెద్దలకు మలివయస్సులో కానరాని కష్టాలు ఎదురవుతున్నాయి. సూటిపోటి మాటలు.. చీత్కారాలు దరిచేరుతున్న వారి జీవితాలకు భరోసానిచ్చేలా పరిస్థితులు మారాల్సిన అవసరముంది. నేడు ‘అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనమిలా..

అనాథాశ్రమాలే దిక్కు..

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు వృద్ధాశ్రమాలలో తలదాచుకుంటున్న వారి సంఖ్య దాదాపుగా 850కిపైగా ఉంది. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వృద్ధుల ఆశ్రమంలో 60 మంది ఉంటుండగా జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లోనూ వీరికి తోడ్పాటునిచ్చేలా పలు స్వచ్ఛంద సంస్థలు సహకారాన్ని అందిస్తున్నాయి. కన్నకొడుకులు, కూతుళ్లున్న చాలా మంది తప్పనిసరైన పరిస్థితుల్లో అయినవాళ్లకు దూరంగా బతుకును సాగిస్తున్నారు. స్థానికంగానే కాకుండా ఇక్కడి వారిలో చాలామంది రాష్ట్ర రాజధాని సమీపంలో ఉన్న ఆశ్రమాల్లో చివరి దశకు చేరిన జీవితాన్ని గడుపుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్‌ వీరికి కొంత ఆర్థిక భరోసా ఇస్తున్నా.. ఇద్దరు వృద్ధ దంపతుల్లో ఒకరికి మాత్రమే పింఛన్‌ వస్తుండటంతో ఇబ్బంది నెలకొంది.

చట్టం వచ్చినా అంతంతే..!

ఆసరాలేని మలివయస్సు వారిని చేరదీసి వారిని అన్నిరకాలుగా బాగా చూసుకునేందుకు వృద్ధుల పోషణ చట్టం-2007లో అమలులోకి వచ్చింది. తల్లిదండ్రులు, సీనియర్‌ పౌరుల పోషణ, సంక్షేమ బాధ్యతల్ని ప్రభుత్వమే తీసుకుని వారి సంఖ్యను బట్టి వృద్ధాశ్రమాలను నెలకొల్పాలి. ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా వారికి అన్నిరకాలుగా ఆరోగ్యం, ఆహారం, వసతి రూపంలో అండగా నిలబడాలి. కాని అనుకున్న విధంగా వారి సంరక్షణకు నిధులు రాకపోవడంతో దాతల సహకారంతో ఉన్న ఆశ్రమాలు అతి కష్టంగా నెట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా వారి ఆరోగ్య పరీక్షలు అవసరమైన చికిత్సల విషయంలో మరింత చొరవ నాలుగు జిల్లాల పరిధిలో పెరగాల్సిన అవసరముంది. పైగా తమను పిల్లలు చూసుకోవడం లేదని ఠాణా మెట్లెక్కేవారికి పోలీసులు, ఇతర శాఖల అధికారుల సహకారం సంపూర్ణంగా అందితే మేలు జరగనుంది.

ఇలా భరోసానిస్తేనే..!

* మనం కూడా పెద్దాయ్యాక వృద్ధులమవుతామే విషయాన్ని యువ దంపతులు గుర్తించాలి. తమ పిల్లలకు తాతా నానమ్మల ప్రాధాన్యం తెలియజేయాలి.

* ఓపికగా వారి బాధను కష్టాలను అడిగి తెలుసుకోవాలి. వృద్ధాప్యంలో వారిలో కనిపించే ఒకరకమైన ఇబ్బందిని అర్థం చేసుకుని వారి మాటలకు విలువనివ్వాలి.

* ఆస్తులను పంచుకున్నట్లు అమ్మానాన్నలను పంచుకునే పరిస్థితి మారాలి. వారితో మసులుకునే ప్రేమ ఆప్యాయతల్ని, అనుబంధాల్ని చిన్నారులకు తెలియజేయాలి.

* 60 ఏళ్లు దాటిన అమ్మానాన్నలకు సరైన ఆసరాను ఇంట్లో కల్పించాలి. వారిపై విసుగు చూపకుండా.. వారి బాగోగులను బాధ్యతగా భావించి చూసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని