logo

చీకటి బతుకుల్లో వెలుగులు

‘తమసోమా జ్యోతిర్గమయ.. మృత్యుర్మా అమృతంగమయ’ సదాశయ ఆశయం... కాకతీయ వైద్య కళాశాలకు దేహదానం చేసిన కాళోజీ నారాయణరావు ఆదర్శం... ఆయన స్ఫూర్తితో టి.అశోక్‌కుమార్‌ మరణానంతరం దేహదానం చేయడం.. రామగుండం పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా ‘సదాశయ ఫౌండేషన్‌’ స్థాపనకు బీజం పడింది..

Published : 02 Oct 2022 06:10 IST

సదాశయానికి’ పద్నాలుగేళ్లు

నేత్ర, అవయవదానంపై విశేష కృషి

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం

గత నెలలో దిల్లీలో జరిగిన సదస్సులో కేంద్ర మంత్రి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యిదర్శికి ‘సదాశయ’

ప్రత్యేక సంచిక అందిస్తున్న శ్రావణ్‌కుమార్‌

‘తమసోమా జ్యోతిర్గమయ.. మృత్యుర్మా అమృతంగమయ’ సదాశయ ఆశయం... కాకతీయ వైద్య కళాశాలకు దేహదానం చేసిన కాళోజీ నారాయణరావు ఆదర్శం... ఆయన స్ఫూర్తితో టి.అశోక్‌కుమార్‌ మరణానంతరం దేహదానం చేయడం.. రామగుండం పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా ‘సదాశయ ఫౌండేషన్‌’ స్థాపనకు బీజం పడింది.. నాటి నుంచి నేటి వరకు ‘సదాశయ ఫౌండేషన్‌’ చీకటి బతుకుల్లో వెలుగులు పూయిస్తోంది. కాళోజీ నారాయణరావు మృతి చెందినప్పుడు ఆయన కోరిక మేరకు మృతదేహాన్ని వైద్య విద్యార్థుల ప్రయోజనాల కోసం కాకతీయ వైద్య కళాశాలకు అందించారు. ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న టి.అశోక్‌కుమార్‌ తాను సైతం మరణానంతరం దేహదానం చేయనున్నట్లు ప్రకటించారు. దురదృష్టవశాత్తు 2006 మార్చి 17న మృతి చెందగా ఆయన కోరిక మేరకు మృతదేహాన్ని కాకతీయ వైద్య కళాశాలకు దానం చేశారు. ఈ రెండు సంఘటనల స్ఫూర్తితో దివంగత అశోక్‌కుమార్‌ సోదరుడు, సింగరేణి కార్మికుడైన శ్రావణ్‌కుమార్‌ తన స్నేహితులు, అభ్యుదయవాదుల సహకారంతో 2008 సంవత్సరంలో మహాత్మాగాంధీ జయంతి రోజైన అక్టోబరు 2న ‘సదాశయ ఫౌండేషన్‌’ను స్థాపించారు. పద్నాలుగేళ్లుగా నేత్ర, అవయవ, దేహదానంతో పాటు ప్లాస్టిక్‌ నివారణ, శబ్ద, వాయు కాలుష్య నివారణ, వరకట్న నిషేధం, గణపతి నవరాత్రోత్సవాల్లో మట్టి ప్రతిమలను కొలవడం, మహిళల వికాసం తదితర సామాజిక అంశాలపై పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఆవిర్భవించిన సదాశయ ఫౌండేషన్‌ రాష్ట్ర వ్యాప్తంగా అనేక అవగాహన సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించి ‘తెలంగాణ రాష్ట్ర నేత్ర, అవయవదాతల సంఘం’ ఏర్పాటుకు కారణమైంది. ఇటీవల న్యూదిల్లీలో జరిగిన అవయవ, శరీర, నేత్రదానాల ప్రత్యేక సదస్సులో పాల్గొన్న శ్రావణ్‌కుమార్‌ భారత ఉపరాష్ట్రపతి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటివరకు 600లకు పైగా నేత్ర, 80కి పైగా దేహ, 70కి పైగా అవయవదానాలు చేయించి ఎంతోమందికి పునరుజ్జీవం కల్పించారు. 50వేలకు పైగా మరణానంతరం తమ శరీరాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. నేత్రదానాలకు ముందుకు వచ్చిన వారి సంఖ్య అనేకం. సింగరేణి సహకారంతో వివిధ గనులు, సంస్థల్లో నేత్ర, అవవయదానంపై కార్మికుల్లో అవగాహన కల్గించారు. విద్యా సంస్థలు, ఆర్టీసీˆ తదితర ప్రభుత్వరంగ సంస్థల్లోను పలు అవగాహన సదస్సులు నిర్వహించారు.

అవార్డులతో మరింత ప్రోత్సాహం..

నేత్ర, అవయవ, దేహదానం, సామాజిక రుగ్మతలను రూపుమాపడంలో కీలకపాత్రను పోషిస్తున్న సదాశయ ఫౌండేషన్‌ అనేకమైన అవార్డులు, రివార్డులను అందుకుంది. పర్యావరణ పరిరక్షణలో జీపీˆపీˆపీపీˆజీ ఆధ్వర్యంలో, సీˆనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ, వాసన్‌ ఐ బ్యాంకు, మధర్‌ థెరిసా సొసైటీ, తెలంగాణ అవతరణ దినోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం వివిద సంస్థలచే రెండు సార్లు జీవిత సాఫల్య పురస్కారాలు, జీవన్‌దాన్‌ ఆధ్వర్యంలో సత్కారాలు సదాశయ ఫౌండేషన్‌ అధ్యక్షుడు శ్రావన్‌కుమార్‌ అందుకున్నారు. గత నెల 3, 4వ తేదీల్లో డిల్లీలో నిర్వహించిన నేత్ర, అవయవ, శరీర దాన సదస్సులో శ్రావన్‌కుమార్‌ పాల్గొన్నారు. సదస్సులో పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, ఆరోగ్యశాఖ కార్యదర్శితో పాటు పలువురికి సదాశయ ఫౌండేషన్‌ రూపొందించిన ‘జీవ ప్రదాతలు’ ప్రత్యేక సంచికను అందించారు.

సామాజిక రుగ్మతలను రూపుమాపేలా...

నేత్ర, అవయవ, దేహదానంపై అహర్నిశలు శ్రమిస్తూనే మరోవైపు సమాజాన్ని పట్టి పీˆడిస్తున్న రుగ్మతలను రూపుమాపేందుకు కృషిని మొదలుపెట్టారు. శ్రావన్‌కుమార్‌ తన కొడుకులకు ఎలాంటి కట్న కానుకలు తీసుకోలేదు. పర్యావరణహితంగా పెళ్లి చేశారు. గణపతి నవరాత్రోత్సవాల్లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారీస్‌ విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను నెలకొల్పాలని చేపట్టిన సదాశయ ప్రచారానికి సంగరేణి యాజమాన్యం సంపూర్ణ సహకారం అందించింది. సంస్థ ఆధ్వర్యంలో బట్ట సంచులు పంపిణీ చేశారు. డిగ్రీ, పీˆజీ, ఇంజినీరింగు కళాశాలల్లో వరకట్న దురాచారంపై అవగాహన సదస్సులు, చర్చాగోష్టిలు నిర్వహిస్తోంది. నేత్ర, అవయవ, దేహదానంపై దాతల చిత్రాలు, వారి బంధువుల అభిప్రాయాలతో సదాశయ ఫౌండేషన్‌ విడుదల చేసిన రెండు ప్రత్యేక సంచికలు, కరపత్రాలు, బ్రోచర్లు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి.


చట్టం తేవాలి.. ప్రోత్సహించాలి

-శ్రావణ్‌కుమార్‌, లింగమూర్తి, సదాశయ ఫౌండేషన్‌.

రాష్ట్రపతి నుంచి మొదలుకొని సామన్య పౌరుని వరకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మరణానంతరం నేత్ర, దేహదానం, జీవన్మృతుడైతే అవయవదానం చేసేలా చట్టం తీసుకురావాలి. దాతలను, వారి కుటుంబ సభ్యులను ప్రోత్సహించాలి. దాతల కుటుంబీకులకు ప్రభుత్వ పథకాల్లో రాయితీలు కల్పించాలి. నేత్ర, అవయవ, దేహదానంపై పనిచేస్తున్న సంస్థలకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహాన్ని అందించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని