logo

మహాత్ముడి బాట.. దారంతో ఉపాధి

‘శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది’ మహాత్ముడు బోధించిన సూక్తిని నిజం చేస్తున్నారు కార్మికులు. మెట్‌పల్లి ఖాదీని నమ్ముకున్న కార్మికులు దారం వడుకుతూనే ఉపాధి పొందుతూ ఏళ్ల నుంచి ఇదే వృత్తిలో సాగుతూ తనదైన శైలిలో దేశభక్తిని చాటుతున్నారు.

Published : 02 Oct 2022 06:10 IST

న్యూస్‌టుడే, మెట్‌పల్లి పట్టణం

ఖాదీలోని మహాత్ముని విగ్రహం

‘శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది’ మహాత్ముడు బోధించిన సూక్తిని నిజం చేస్తున్నారు కార్మికులు. మెట్‌పల్లి ఖాదీని నమ్ముకున్న కార్మికులు దారం వడుకుతూనే ఉపాధి పొందుతూ ఏళ్ల నుంచి ఇదే వృత్తిలో సాగుతూ తనదైన శైలిలో దేశభక్తిని చాటుతున్నారు. 1934 వరకు మహారాష్ట్ర బ్రాంచి కింద ఈ ఖాదీ కొనసాగుతూ వచ్చింది. శ్రీరామానంద తీర్థ ఆధ్వర్యంలో నడిచిన మెట్‌పల్లి ఖాదీ.. స్వాంతంత్య్రం వచ్చిన తర్వాత 1967 మెట్‌పల్లి ఖాదీగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని మెట్‌పల్లి సంస్థగా మారింది. అప్పటి నుంచి ఈ ఖాదీలో వందలాది మంది వివిధ రకాల వృత్తుల్లో కొనసాగుతూ ఉపాధిని పొందుతూనే మహాత్మున్ని నిత్యం స్మరించుకుంటున్నారు.  

ఆదాయం తక్కువైనా..

ప్రతి కార్మికుడు నిత్యం దారం వడుకుతూ నెలనెల ఉపాధి పొందుతున్నారు. వడికిన ఒక దారం శిల్పకు రూ.8 ఇస్తారు. గంటకు సుమారుగా 5 నుంచి 6 శిల్పలు వడుకుతూ రోజుకు సుమారుగా 45 నుంచి 50 శిల్పల వరకు కార్మికులు దారం వడుకుతుంటారు. ఇలా వడికిన శిల్పలకు నెలకు రూ.4 నుంచి 5 వేల వరకు ఆదాయం వస్తుంది. ఆదాయం తక్కువ ఉన్నా మహాత్మునికి ఇష్టమైన ఖాదీలో విధులు నిర్వహించడం సంతృప్తినిస్తుందని ఖాదీ కార్మికులు తెలుపుతున్నారు. వీరు చేసే వృత్తిని కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీలోకి చేర్చితే కుటుంబాలకు అండగా నిలిచిన వారవుతారు.


కుటుంబమంతా..

- జుబేదార్‌, ఖాదీ కార్మికురాలు

మొదటి నుంచి మాకుటుంబం ఇందులోనే పనిచేస్తూ వస్తున్నారు. గాంధీ చూపిన బాటలో నడుస్తూనే మా పెద్దలు సూచనల మేరకు తక్కువ ఆదాయం వస్తున్నా ఖాదీపై ఉన్న ప్రేమతో 25 ఏళ్ల నుంచి దారం వడుకుతూనే ఉన్నాను.


28 ఏళ్ల నుంచి..

- లక్ష్మీ, ఖాదీ కార్మికురాలు

గత 29 ఏళ్ల నుంచి ఖాదీలో దారం వడుకుతూ వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఆదాయం తక్కువ ఉన్నా మహాత్ముడు చూపినదారిలో నడవడం సంతోషంగా ఉంది.


ఉపాధిహామీలో చేర్చాలి..

- లత, కార్మికురాలు

స్వాతంత్య్రం తెచ్చిన మహానీయుడు మహాత్మగాంధీని నిత్యం స్మరించుకునేలా దారంవడికే పని దొరకడం నా అదృష్టంగా బావిస్తున్నాను. మా వృత్తిని ఉపాధి హామీలో మార్చితే మా కుటుంబాలు బాగుపడతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని