logo

గజ్జె ఘల్లు మనేలా.. కళ ఉట్టి పడేలా

కళాభిమానులకు అసలైన పండుగ కళ్లకు కనిపించింది. గజ్జె ఘల్లుమనేలా.. కళా వైభవం కనిపించింది. కరీంనగర్‌లోని అంబేడ్కర్‌ మైదానంలో రెండోరోజైన శనివారం కళోత్సవాలు మరింత సంబురంగా కొనసాగాయి. కేరింతలు..

Updated : 02 Oct 2022 06:52 IST

జానపద జడివానలో తడిసిన కరీంనగర్‌
రెండో రోజు ఉర్రూతలూగించిన ఆటాపాట

ఈనాడు, కరీంనగర్‌, కరీంనగర్‌ సాంస్కృతికం

కళాభిమానులకు అసలైన పండుగ కళ్లకు కనిపించింది. గజ్జె ఘల్లుమనేలా.. కళా వైభవం కనిపించింది. కరీంనగర్‌లోని అంబేడ్కర్‌ మైదానంలో రెండోరోజైన శనివారం కళోత్సవాలు మరింత సంబురంగా కొనసాగాయి. కేరింతలు.. ఈలలు.. గోలల నడుమ అసలు సిసలు ఆటాపాటలతో మైదానం మురిసిపోయింది. జానపద జడివానలో కరీంనగర్‌ తడిసి ముద్దైంది. మూడున్నర గంటలపాటు ముచ్చటైన వేడుక కనుల పండువగా సాగింది. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారుల కళా విన్యాసాలు అబ్బుర పరిచాయి.  ఆటకు ఆట.. పాటకు పాటను కలుపుతూ సరికొత్త సందడిలో మునిగి తేలారు.  

భిన్నసంస్కృతుల మేళవింపు..
వ్యాఖ్యాతగా శ్యామల తన మాటలతో ఆహుతుల్ని ఆకట్టుకోవడంతోపాటు కరీంనగర్‌కు చెందిన సదన్న బృందం చేసిన హాస్యవల్లరి అందరిని కడుపుబ్బా నవ్వించింది.  పువ్వుల వాన కురిసినట్టు.. నా తల్లి తెలంగాణ అనే పాటకు బాలభవన్‌ చిన్నారులు చేసిన నృత్యం అలరించింది. మొదటి రోజుకు భిన్నంగా ఇజ్రాయెల్‌ దేశానికి చెందిన కళాకారులు లయబద్ధంగా సాగిన సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తూ సందడి చేశారు. వారి ప్రదర్శన సమయంలో వేదిక ముందు భాగం నుంచి కరతాళధ్వనుల మోతనే వినిపించింది. తమిళనాడుకు చెందిన బృందం తంజావూరు పేరిట సాగిన నృత్యంతో కళాకారులు వారి ప్రతిభను చూపించారు. అండమాన్‌ నికోబార్‌ నుంచి వచ్చిన వారి ప్రదర్శన వావ్‌.. అనిపించేలా కొనసాగింది. తమిళనాడుకు చెందిన చిన్నారుల కర్రసాము విన్యాసం అబ్బురపరిచింది. కశ్మీర్‌ నుంచి వచ్చిన వారు తమ ప్రాంతపు ఆటతీరుతో మంత్రముగ్ధుల్ని చేశారు. పంజాబ్‌ కళాకారులు పసందైన పాటకు తగినట్లు ఆటలతో సందడి చేశారు. మలేషియా నుంచి వచ్చిన వారు ‘ మా ఊరి దేవుడు అందాలరాముడు’ అనే తెలుగు పాటకు నృత్యం చేసి ఇక్కడి దైవభక్తిపై ఉన్న మక్కువను చూపించారు.

కళోత్సవాలను వీక్షిస్తున్న జిల్లా వాసులు

హుషారెత్తించేలా జోష్‌..!
తెలంగాణ అంటేనే ధూంధాం పాటల జాతరనేలా వేదికపై వేడుక దద్దరిల్లిపోయింది. హుషారెత్తించిన పాటలకు తగిన చిందులతో కళాకారులు వారిని వారు మరిచిపోయేలా తన్మయత్వపు ఆటల జోష్‌ను ప్రతిపాటకు చూపించారు. ముఖ్యంగా నాగదుర్గ జానపద పాటతో వేదికపైకి వచ్చిన ప్రతి సారి సభికుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ‘ఉరుముల రమ్మంటే.. మెరుపుల రమ్మంటే’.. ‘నాగులమ్మో.. నాగులమ్మో నల్లా నాగులమ్మో’.లాంటి పాటలకు అదిపోయేలా చిందులేస్తూ కుర్రకారును జోష్‌లో ముంచెత్తింది. ‘ధనధన్‌ ధనారే’.. అంటూ జానులైరి చేసిన సందడి అంతా ఇంతా కాదు. మాయదారి మైసమ్మో.. రక్కమ్మో.. రక్కమ్మ.. అంటూ జానపద జాతరను చూపించింది. ఇక గోదావరిఖనికి చెందిన వర్షిణి అమ్మవారి వేషధారణతో పూనకమొచ్చిన నృత్యంతో అందరిని మంత్రముగ్ధులను చేసింది. మరో జానపద గాయని కనకవ్వ నర్సపల్లె.. పాటతో జనాలను ఉర్రూతలూగించింది.  చివరగా హరహరశంభో అంటూ నాగదుర్గ వేసిన డ్యాన్స్‌ కార్యక్రమానికి ప్రధానాకర్షణగా నిలిచింది.

కరీంనగర్‌ చిన్నారుల జానపద  నృత్యం

చిందేసిన ప్రకాష్‌రాజ్‌
సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ డీజే టిల్లు పాటకు చిందులేశారు. రాష్ట్రమంత్రి గంగుల కమలాకర్‌ కోరిక మేరకు వేదికపై సందడి చేశాడు. కరీంనగర్‌కు రావడం మొదటి సారి అని.. ఇక్కడి వారు తనకు అమితంగా నచ్చారన్నారు. త్వరలోనే కరీంనగర్‌లో నిర్వహించే సినీతారల క్రికెట్‌ టోర్నీకి వచ్చి  సందడి చేస్తానని చెప్పారు. మంత్రి కమలాకర్‌ అంటే తనకిష్టమని ఇప్పుడు ఇక్కడి కళాకారులను ప్రోత్సహిస్తున్న తీరుని చూసి మరింత గౌరవం పెరిగిందన్నారు. కార్యక్రమానికి ప్రకాశ్‌రాజ్‌ రావడం శుభపరిణామమని మంత్రి గంగుల కొనియాడారు. కళకాలను ప్రకాశ్‌రాజ్‌ సన్మానించారు. మంత్రితోపాటు కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌, నగర మేయర్‌ సునీల్‌రావు, డిఫ్యూటీ మేయర్‌ స్వరూపరాణి, అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్‌లాల్‌, గరిమాఅగ్రవాల్‌, జడ్పీ సీఈవో ప్రియాంక, పోలీసు కమిషనర్‌ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కళోత్సవాలను ప్రారంభిస్తున్న ప్రకాశ్‌రాజ్‌, మంత్రి గంగుల

కళాకారిణి ఆధ్యాత్మిక ప్రదర్శన

వేదికపై కళాకారులతో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ నృత్యం

వేదికపై ఇజ్రాయెల్‌ దేశీయుల సందడి

అతిథుల వద్ద అండమాన్‌ కళాకారుల ప్రదర్శన

 

 

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని