logo

‘స్వచ్ఛత’ ర్యాంకులో మెరుగు

కరీంనగర్‌ నగరపాలిక ‘స్వచ్ఛత’ ర్యాంకు మెరుగు పడింది. గతేడాది వచ్చిన ర్యాంకు కంటే తన స్థానాన్ని పదిల పర్చుకుంది. దిల్లీలో శనివారం నిర్వహించిన స్వచ్ఛ్‌ అమృత్‌ మహోత్సవ్‌ సమావేశంలో ర్యాంకులు ప్రకటించింది.

Published : 02 Oct 2022 06:10 IST

 జాతీయస్థాయిలో 67, రాష్ట్రంలో 3వ స్థానం
జీఎఫ్‌సీలో వెనుకబడిన కరీంనగర్‌ నగరపాలిక
న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌

కరీంనగర్‌లో ఐదు నెలల కిందట సర్వేలో భాగంగా చెత్త సేకరణపై వివరాలు సేకరించి నిక్షిప్తం చేస్తున్న కేంద్ర బృందం

కరీంనగర్‌ నగరపాలిక ‘స్వచ్ఛత’ ర్యాంకు మెరుగు పడింది. గతేడాది వచ్చిన ర్యాంకు కంటే తన స్థానాన్ని పదిల పర్చుకుంది. దిల్లీలో శనివారం నిర్వహించిన స్వచ్ఛ్‌ అమృత్‌ మహోత్సవ్‌ సమావేశంలో ర్యాంకులు ప్రకటించింది. కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ, స్వచ్ఛభారత్‌ మిషన్‌ ఆధ్వర్యంలో దేశ వ్యాపంగా 4,354 నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 పేరుతో ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌, మేలో వేర్వేరు రకాల విభాగాల్లో సర్వే నిర్వహించారు. 60 డివిజన్లలో వారం రోజుల పాటు బృందం పర్యటించి పారిశుద్ధ్య పనుల నిర్వహణపై నగర పరిశుభ్రత, క్షేత్రస్థాయిలో ఇంటింటా చెత్త సేకరణ, మురుగుకాల్వలు శుభ్రత, సులభ్‌కాంప్లెక్స్‌లు, బహిరంగ మలమూత్ర విసర్జన వంటివి తనిఖీ చేశారు. రద్దీ ప్రాంతాలు ఎంచుకొని నగర శుభ్రతపై పౌరుల నుంచి వివరాలను అడిగి నమోదు చేశారు. అయితే అవార్డుల సాధనలో కావాల్సిన స్కోరును సాధించలేక వెనుకబడుతోంది. జాతీయ స్థాయిలో 67వ ర్యాంకుతో మెరుగ్గా ఉండగా, రాష్ట్రస్థాయిలో 3వ స్థానానికి పడిపోయింది.
సఫాయిమిత్రలోనే గుర్తింపు
గతేడాది సఫాయిమిత్ర సురక్ష ఛాలెంజ్‌లో దేశంలోని మూడు లక్షల జనాభాలో పోటీ పడి జాతీయస్థాయిలో రెండో ర్యాంకు సాధించి రూ.4కోట్ల నగదు పురస్కారం సాధించింది. అప్పటి తరహాలో గట్టి పట్టుదల ఈసారి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో కనిపించలేదని తెలుస్తోంది. ప్రధానంగా కన్సల్టెన్సీని నియమించుకోకపోవడం, క్షేత్రస్థాయిలో సర్వేకు వచ్చేంత వరకు ఇతర విభాగాల అధికారులు, ఉద్యోగులు సహకరించకపోవడం కారణంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మురుగురహిత నగరంలో సున్నా
నగరంలో బహిరంగ మలమూత్ర విసర్జనరహిత నగరంగా గుర్తింపు సాధించడంతో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మార్కులు కలిసి వస్తున్నాయి. మురుగు రహిత నగరం(జీఎఫ్‌సీ) రేటింగ్‌లో మార్కులు సాధించేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. ఇందులో 1100 మార్కులకు సున్నా వచ్చాయి. అదేవిధంగా వాటర్‌+లో పోటీ పడగా అందులో కూడా చేజారింది. దానికి బదులుగా ఓడీఎఫ్‌++ వచ్చింది. దీంతో అవార్డులో, ర్యాంకుల్లో తేడా కొట్టొచ్చినట్లుగా కనిపించింది.


మరింత బాధ్యతగా పని చేస్తాం
- వై.సునీల్‌రావు, మేయర్‌, కరీంనగర్‌

స్వచ్ఛసర్వేక్షణ్‌లో ర్యాంకు మెరుగు పడటం సంతోషకరం. ఇదే స్ఫూర్తితో మరింత బాధ్యతగా పని చేస్తాం. రాబోవు రోజుల్లో కార్మికులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు పారిశుద్ధ్య పనుల్లో వాహనాల వినియోగం పెంచుకోవడం జరుగుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని