logo

ఏడేళ్లకు ప్రభుత్వ ఉద్యోగిపై చర్యలు

కరీంనగర్‌ సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగిపై ఎట్టకేలకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి ఏడేళ్ల కిందట వివిధ రుసుముల ద్వారా వచ్చిన మొత్తాన్ని దుర్వినియోగపర్చారనే అభియోగంతో

Published : 02 Oct 2022 06:14 IST

సర్వీసు నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు

కరీంనగర్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం

కరీంనగర్‌ సంక్షేమవిభాగం, న్యూస్‌టుడే: కరీంనగర్‌ సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగిపై ఎట్టకేలకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి ఏడేళ్ల కిందట వివిధ రుసుముల ద్వారా వచ్చిన మొత్తాన్ని దుర్వినియోగపర్చారనే అభియోగంతో అప్పట్లో బాధ్యులుగా గుర్తించి ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. 2015లో స్టాంప్‌ డ్యూటీ సహా ఇతర రుసుముల ద్వారా వచ్చిన మొత్తంలో రూ.75లక్షల మేర సొమ్ము పక్కదారి పట్టిందనే ఆరోపణలు వీరు ఎదుర్కొన్నారు. ముందుగా తాఖీదుల్ని అందించి వివరణ కోరిన తరువాత అప్పట్లో పనిచేసిన సబ్‌రిజిస్ట్రార్‌తోపాటు మరో ఇద్దరు కిందిస్థాయి సిబ్బందిపై సస్పెన్షన్‌ రూపంలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. విచారణ జరిగిన కొన్నాళ్లకు వీళ్లు విధుల్లో చేరారు. అప్పటి కేసుకు సంబంధించి కొనసాగిన తుది విచారణలో ఇక్కడ పనిచేస్తున్న ఓ ఉద్యోగి పాత్ర కీలకమని నిర్ధారణకు వచ్చిన రాష్ట్రస్థాయి అధికారులు సర్వీసు నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
విచారణ: కరీంనగర్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో డబ్బులు సరిగా జమ కావడం లేదని గుర్తించిన అధికారులు విచారణ చేశారు. ఇందులో భాగంగా మొదట సబ్‌ రిజిస్ట్రార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ షరాప్‌లను సస్పెండ్‌ చేశారు. ఆరు నెలల సస్పెన్షన్‌ కాలంలో తప్పు ఎవరు చేశారనేది స్పష్టంగా తెలియకపోవడంతో చివరికి ముగ్గురికి పోస్టింగ్‌లు ఇచ్చారు. అనంతరం శాఖ పరమైన విచారణ చేసి ప్రభుత్వానికి రాశారు. స్పందించిన ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి జూనియర్‌ అసిస్టెంట్‌ను మొత్తం విధుల నుంచి తొలగించాలని, సబ్‌ రిజిస్ట్రార్‌కు ఎనిమిదేళ్ల వరకు పదోన్నతి ఇవ్వకూడదని మరో ఉద్యోగికి వివరణ కోరినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. అంతేకాకుండా రెవెన్యూ రికవరీ చట్టంలో భాగంగా ఇద్దరి ఉద్యోగుల నుంచి రూ.75లక్షల మొత్తాన్ని వసూలు చేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ విషయమై జిల్లా రిజిస్ట్రార్‌ రవిని వివరణ కోరగా ఏడేళ్ల కిందట జరిగిన సంఘటనలో భాగంగా విధుల నుంచి మొత్తానికి ఓ ఉద్యోగిని తొలగించిన విషయం వాస్తవమేనని తెలిపారు. ఆర్‌ఆర్‌ చట్టం ప్రకారం ఇద్దరు ఉద్యోగుల నుంచి రూ.75లక్షలు రికవరీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని