logo

తారా జువ్వలు.. కళా వెలుగులు

‘రావనా చందనాలో వెన్నెలా’.. అంటూ పల్లె పాటల మధురిమను పంచారు. ‘గోగులు పూసె.. గోగులు కాసె ఓలచ్చ గుమ్మడి’..అంటూ జానపదాల గొప్పతనం తెలియజెప్పి  కళోత్సవ ముగింపు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా.. అంటూ వందేమాతరం శ్రీనివాస్‌ ఆకట్టుకున్నారు.

Published : 03 Oct 2022 04:59 IST

అట్టహాసంగా ముగిసిన ఉత్సవాలు
ఈనాడు, కరీంనగర్‌, న్యూస్‌టుడే- కరీంనగర్‌ సాంస్కృతికం

‘రావనా చందనాలో వెన్నెలా’.. అంటూ పల్లె పాటల మధురిమను పంచారు. ‘గోగులు పూసె.. గోగులు కాసె ఓలచ్చ గుమ్మడి’..అంటూ జానపదాల గొప్పతనం తెలియజెప్పి  కళోత్సవ ముగింపు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా.. అంటూ వందేమాతరం శ్రీనివాస్‌ ఆకట్టుకున్నారు. గోదావరిఖనికి చెందిన మధుప్రియ తన పాటలతో ప్రేక్షకుల్ని ‘ఫిదా’ చేసింది.  జానపద నృత్యకారిణులు నాగదుర్గ, జాను నృత్యాలకు సభికుల నుంచి కరతాళ ధ్వనుల మోతే వినిపించింది. గాయకులు వాణి ఒల్లాలా, వడ్లకొండ అనిల్‌, స్వర్ణలు పాటలు పాడి కార్యక్రమానికి వన్నె తెచ్చారు. మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి చేసిన ధ్వని అనుకరణ ఆహుతుల్ని ఆకట్టుకుంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన పురపాలిక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కార్యక్రమం ప్రారంభం నుంచి ముగింపు వరకు వేదిక ముందు కూర్చుని ప్రదర్శన ఆసక్తిగా తిలకించారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 


మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌, వేదికపై మంత్రి గంగుల

కరీంనగర్‌ అంటే అభిమానం : కేటీఆర్‌
కరీంనగర్‌లోని మిషన్‌ ఆస్పత్రిలోనే తాను పుట్టానని.. అందుకే కరీంనగర్‌ అంటే ప్రత్యేకమైన అభిమానమని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా కరీంనగర్‌ అంటే అభిమానమనే విషయాన్ని గుర్తు చేశారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన కళాకారుల ప్రదర్శనలు వారిలోని ప్రతిభను తెలియజేశాయన్నారు. మైవిలేజ్‌ షో ద్వారా సామాజిక మాధ్యమాల్లో గంగవ్వ ప్రత్యేక గుర్తింపును అందుకుందని.. త్వరలోనే లంబాడిపల్లికి వెళ్లి కలుస్తానని చెప్పారు. గంగవ్వ తాను హీరో మహేశ్‌బాబు మాదిరిగా ఉన్నానని అన్నదని.. మహేశ్‌బాబు ఈ మాటలు వింటే ఫీలవుతాడని కేటీఆర్‌ తన మాటలతో అందరిని నవ్వించారు.  కళోత్సవాలు అంటే చిన్నవి అనుకున్న.. కాని కరీంనగర్‌ భీముడిగా తాను పిలిచే కమలాకర్‌ ఇంత గొప్పగా నిర్వహిస్తున్నాడనే విషయం ఇక్కడికి వస్తేనే తెలిసిందన్నారు. ఆయనే ప్రత్యేకంగా హెలికాప్టర్‌ పెట్టి ఇక్కడికి తీసుకొచ్చారని తెలిపారు. ఈ తరహా ఉత్సవాల్ని ఏటా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహిస్తామని తెలిపారు. వందేమాతరం శ్రీనివాస్‌ పాడిన ఎర్రజెండా పాట బాగుందని.. కాని ఇప్పుడు ఎరుపు, తెలుపు కలిసిన గులాబీ జెండాతో రాష్ట్రం బాగుందని మంత్రి చెప్పారు. పలువురు కళాకారులను మంత్రులు సన్మానించారు. మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ తన శక్తి ఉన్నంత వరకు ఇలాంటి కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తానని చెప్పారు.


నాగదుర్గ నృత్యం


శివారెడ్డి మిమిక్రీ


కళాకారిణి నృత్యం


ఆలపిస్తున్న వందేమాతరం శ్రీనివాస్‌


బతుకమ్మలతో ఇజ్రాయెల్‌ వనితలు


నగరంలో మధ్యప్రదేశ్‌ కళాకారుల ప్రదర్శన


వేదికపై బాల భవన్‌ చిన్నారుల ప్రదర్శన


కళాకారులతో నృత్యం చేస్తున్న మంత్రి గంగుల


హాస్యనటులు, నృత్యకారుల హంగామా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని