logo

సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం

కరీంనగర్‌ నగర పరిధిలో సోమవారం నిర్వహించుకునే సద్దుల బతుకమ్మ పండుగకు నగరపాలిక ఏర్పాట్లు పూర్తి చేసింది. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు లేకుండా ముందస్తుగానే పనులు ప్రారంభించారు.  బతుకమ్మ, దసరా పండుగకు రూ.1.74 కోట్లు నిధులు కేటాయించారు.

Published : 03 Oct 2022 04:59 IST

ఎంపిక చేసిన ప్రాంతాల్లో పకడ్బందీగా చర్యలు
న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌


మానేరు డ్యాం వద్ద బతుకమ్మను నిమజ్జనం చేసే చోట బారికేడ్లు, లైటింగ్‌ ఏర్పాట్లు చేసిన దృశ్యం

కరీంనగర్‌ నగర పరిధిలో సోమవారం నిర్వహించుకునే సద్దుల బతుకమ్మ పండుగకు నగరపాలిక ఏర్పాట్లు పూర్తి చేసింది. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు లేకుండా ముందస్తుగానే పనులు ప్రారంభించారు.  బతుకమ్మ, దసరా పండుగకు రూ.1.74 కోట్లు నిధులు కేటాయించారు. డివిజన్‌ కేంద్రాల్లో ఆడుకునే స్థలాల్లో, నిమజ్జన ప్రాంతాల్లో కంకరపొడితో గుంతలు పూడ్చారు. పలుచోట్ల రహదారులపై సీసీ ప్యాచ్‌ చేయించారు. వీధుల్లో, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక వీధిదీపాలు బిగించడం వంటి పనులు చేపట్టారు. దీని కోసం డీఈఈలు, ఏఈలను, పారిశుద్ధ్య సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు.

చెరువుల దగ్గర కట్టుదిట్టం
దిగువ మానేరు, చెరువుల్లో నిండా నీరుండటంతో అక్కడి వరకు వెళ్లకుండా కట్టుదిట్టంగా బారికెడ్లు ఏర్పాటు చేశారు. రాత్రివేళ ఆయా నిమజ్జన ప్రాంతాల్లో, డివిజన్‌ కేంద్రాల్లోని ప్రధాన వీధుల్లో మహిళలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా వీధిదీపాలు బిగించారు. నగరమంతా కలిపి సుమారు 10 వేలకు పైగానే డే లైట్లు బిగించారు. ఫ్లడ్‌ లైట్ల కోసం పెద్ద టవర్లు, మినీ టవర్లు ఏర్పాటు చేశారు. వీటికి జనరేటర్లు సిద్ధంగా ఉంచారు.

20 చోట్ల నిమజ్జన స్థలాలు
నగరపాలక సంస్థ 20 చోట్ల నిమజ్జనానికి ఏర్పాట్లు చేసింది. నగరంలోని ఐదు ప్రధాన వీధుల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మానకొండూర్‌, కొత్తపల్లి చెరువులు, చింతకుంట కెనాల్‌, మానేరు నది ప్రాంతంలో నాలుగు చోట్ల, మానేరు డ్యాం కట్ట భాగంలో ఐదు పాయింట్లు, పద్మానగర్‌(మానేరు స్కూల్‌ వెనుకాల), రేకుర్తి (పెంటకమ్మ చెరువు), సీతారాంపూర్‌(సాయిబాబా దేవాలయం పక్కన), ఆరెపల్లి( ఈద్గా దగ్గర, మాలకుంట రెండు పాయింట్లు), గార్లకుంట(కిసాన్‌నగర్‌), తీగలగుట్టపల్లి (చెరువు బావి దగ్గర), వల్లంపహాడ్‌(బ్రిడ్జి దగ్గర) పనులు పూర్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని