logo

రైతుల ముంగిట.. సరికొత్త వంగడాలు

తెలంగాణలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని జగిత్యాల పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం ఆధ్వర్యంలో రూపొందించిన పలు వంగడాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

Published : 03 Oct 2022 04:59 IST

జగిత్యాల పరిశోధనస్థానానికి గుర్తింపు
న్యూస్‌టుడే, జగిత్యాల వ్యవసాయం


కేంద్రం గుర్తించిన వరి రకం

తెలంగాణలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని జగిత్యాల పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం ఆధ్వర్యంలో రూపొందించిన పలు వంగడాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఉత్తర తెలంగాణ మండలంలోని మూడు వంగడాలను భారత వ్యవసాయ పరిశోధన మండలి నోటిఫై చేసింది. జగిత్యాల పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో రూపొందించిన జేసీఎస్‌-3202 నువ్వురకం, పెద్దపల్లి జిల్లా కూనారం వ్యవసాయ పరిశోధనస్థానంలో రూపొందించిన కేఎన్‌ఎం-7048 (తెలంగాణ రైస్‌-6), కేఎన్‌ఎం-6965 (తెలంగాణ రైస్‌-7) రకాలను ఐసీఏఆర్‌ గుర్తించింది. ఈ రెండు వరి రకాలు దొడ్డుగింజ కలిగి ఉండగా, నువ్వు రకం అధిక దిగుబడిని ఇచ్చేదిగా పరిశోధనలో తేలింది. వీటితోపాటు పొలాస పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తలు రూపొందించిన జేసీఎస్‌1020 నువ్వురకం, జేజీఎల్‌28545, జేజీఎల్‌27356 వరి రకాలను అధికారికంగా విడుదల చేసేందుకు వర్సిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ రెండు వరి రకాలు సన్నగింజ కలిగి ఉండగా, నువ్వు రకం తెలుపు గింజ కలిగి అధిక దిగుబడిని ఇస్తున్నట్లు నిర్ధారించారు.

పొలాస కేంద్రంగా మరిన్ని సేవలు
ఇక్కడి సోయా, వరి, నువ్వు, మక్క, దేశీపత్తి, వేరుసెనగ తదితర రకాలు మన రాష్ట్రంతో పాటుగా దేశంలోని చాలా ప్రాంతాల్లోని రైతుల క్షేత్రాలకు విస్తరించి మంచి దిగుబడులను అందిస్తున్నాయి. పొలాసలో రూ.60 లక్షలతో ఏర్పాటు చేసిన ఆధునిక భూసార యంత్రం ద్వారా రైతుల క్షేత్రాల నుంచి సేకరించిన మట్టి నమూనాలు పరీక్షిస్తున్నారు. ఎరువుల మోతాదు నిర్దేశించడం, చీడపీడల నివారణ, నీటి పొదుపు, పంటల సరళి రూపకల్పన, కలుపు నివారణ, హరిత గృహంలో పంటలసాగు, జీవసాంకేతిక ప్రయోగశాల ద్వారా వంగడాల ఉత్పత్తి సమయాన్ని 13 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలకు కుదించటం ప్రధానాంశంగా పరిశోధిస్తున్నారు. దత్తత గ్రామం, డయాగ్నోస్టిక్‌ టీంల ద్వారా క్షేత్ర సందర్శనలు, యంత్రంతో వరినాట్లు, లేజర్‌ గైడెడ్‌ లెవెలర్‌, నువ్వుల నుంచి కోల్డ్‌ప్రెస్‌ పద్ధతిలో నూనె తీయటం, ఇతరత్రా అధునాతన యంత్రాలు, పనిముట్లను రూపొందించి క్షేత్రస్థాయిలో రైతులకు సాంకేతికతను అందిస్తున్నారు. రైతుల క్షేత్రాల్లో శాస్త్రవేత్తల పర్యవేక్షణతో విత్తనోత్పత్తిని చేపడుతున్నారు. తేనెటీగల పెంపకం, రసాయన ఎరువుల సమర్థ వినియోగం, వ్యవసాయ అధికారులు రైతులకు శిక్షణలతో ముందుకు సాగుతుండగా నూతన వంగడాల ఫలాలను రైతులు అందిపుచ్చుకోవాలి.

పరిధి విస్తృతం
పొలాస పరిశోధనస్థానం పరిధిలో కరీంనగర్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోని పరిశోధన, విస్తరణ ఉంది. అదనంగా పూర్వపు ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని 5 కొత్త జిల్లాకు వాతావరణ ఆధారిత సేవలను జగిత్యాల కేంద్రంగానే అందిస్తున్నారు. పొలాస కేంద్రంగా 5 అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ సెంటర్లు, మూడు కృషీ విజ్ఞాన కేంద్రాలు, మూడు ఏరువాక కేంద్రాలు పనిచేస్తున్నాయి. వరి, నువ్వులు, మక్క, పత్తి, సోయాబీన్‌, చెరకు తదితర పంటల్లో నూతనంగా 15 వంగడాలు రైతుల క్షేత్రాల్లో మినీకిట్ పరీక్షల్లో ఉండటం విశేషంగా చెప్పవచ్చు.

ముందంజలో పొలాస
అధిక వరి రకాలు దేశంలోనే ఉమ్మడి రాష్ట్రం నుంచి విడుదలకాగా ఇందులో తెలంగాణ నుంచి జగిత్యాల రకాలే ఎక్కువున్నాయి. రాష్ట్రంలో వరిపై పొలాసలోనే సమగ్ర పరిశోధననలు సాగుతున్నాయి. ఇక్కడి నుంచే అధికంగా నూతన వంగడాలను ఉత్పత్తి చేస్తున్నారు. పొలాసప్రభ, జగిత్యాల సన్నాలు, జగిత్యాల సాంబ, మానేరు సోన, జగిత్యాల మశూరి, కరీంనగర్‌ సాంబ, ప్రాణహిత, అంజన, ప్రత్యుమ్న, బతుకమ్మ, జగిత్యాల రైస్‌-1 రకాలను పొలాస పరిశోధన కేంద్రం నుంచి విడుదల చేశారు. పసుపులో సుగుణ, సుదర్శన, వేరుసెనగలో జేసీసీ88, జగిత్యాల పల్లి-1, నువ్వుల్లో స్వేతా తిల్‌, రాజేశ్వరి, హిమ, చందన, జగిత్యాల తిల్‌-1, జగిత్యాల తిల్‌-2 (జేసీˆఎస్‌2454) రకాలను ఇదివరకు ఆవిష్కరించారు. రైతులు వరిలో సంకర రకాలపైన మక్కువ చూపడంతో జేజీహెచ్‌131, జేజీహెచ్‌141 రకాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. కరీంనగర్‌ మక్క, కూనారం సన్నాలు రైతుల క్షేత్రాల్లో మన్ననలు పొందుతున్నాయి.

నూతన వంగడాలతో రైతులకు లబ్ధి : - డాక్టర్‌.పి.రవి, శాస్త్రవేత్త
నూతన వంగడాలు వల్ల రైతులు చాలా లబ్ధి పొందుతున్నారు. వాతావరణ పరిస్థితులకు తట్టుకునే మరిన్ని వంగడాలను ఆవిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. కొత్త వంగడాల రూపకల్పనలో శాస్త్రవేత్తలు, సిబ్బంది కృషి దాగుంది. వీటి సేద్యంలో సేంద్రియ ఎరువులు, తక్కువ మోతాదులో రసాయనాల వాడకం వల్ల రైతులు అధిక దిగుబడి పొందుతారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు