logo

రెండు పడక గదుల ఇళ్లల్లో సమస్యల తిష్ఠ

రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో నాణ్యతా లోపంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. జగిత్యాల జిల్లాలోని మల్యాల మండల పరిధి నూకపల్లి, రామన్నపేట్‌, పోతారం గ్రామాల లబ్ధిదారులకు 65 ఇళ్లు నిర్మించి గతేడాది అందజేయగా 20 ఇళ్ల వరకు ఖాళీగా ఉన్నాయి.

Published : 04 Oct 2022 05:47 IST

నిర్మించిన ఏడాదికే శిథిలావస్థకు చేరిన వైనం

న్యూస్‌టుడే, జగిత్యాల గ్రామీణం, మల్యాల

ఇళ్లపై ట్యాంకులు ఏర్పాటు చేయని దుస్థితి

రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో నాణ్యతా లోపంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. జగిత్యాల జిల్లాలోని మల్యాల మండల పరిధి నూకపల్లి, రామన్నపేట్‌, పోతారం గ్రామాల లబ్ధిదారులకు 65 ఇళ్లు నిర్మించి గతేడాది అందజేయగా 20 ఇళ్ల వరకు ఖాళీగా ఉన్నాయి. తాగునీటి కొరత, నిర్మాణంలో నాణ్యతా లోపం వంటి కారణాల వల్ల వాటిలో ఉండేందుకు ఆనాసక్తి చూపుతున్నారు. నల్లాలు ఏర్పాటు చేయకపోవడంతో నీరు వృథా అవుతోంది. ట్యాంకులకు నీరు ఎక్కకపోవడంతో అవస్థలు పడుతున్నారు.

రోడ్డు సౌకర్యమేది..

65 ఇళ్లలోని కుటుంబాలకు సరిపడా తాగునీటి సరఫరా జరగడం లేదు. చాలా ఇళ్లకు వాటర్‌ ట్యాంకులు అమర్చలేదు. పైపులైన్ల ఏర్పాటు సైతం పూర్తికాలేదు. మిషన్‌ భగీరథ ప్రాజెక్టు లైనుతో అనుసంధానం చేయడంతో నీటి సమస్యను అరికట్టవచ్చని స్థానికులు చెబుతున్నారు. ఇళ్లకు చేరుకోవడానికి మెరుగైన రోడ్డు సౌకర్యం లేదు. వర్షాకాలంలో మట్టిరోడ్డులో ఇళ్లకు వెళ్లడం ఇబ్బందిగా మారుతోందని కాలనీ వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

ఇళ్లలోకి వర్షం నీరు..

నాసిరకం ఫ్లోరింగ్‌ పనుల వల్ల వర్షం వస్తే ఇళ్లు ఉరుస్తున్నాయి. నిర్మాణంలో నాణ్యతా లోపం వల్ల పైకప్పు పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతోంది. ప్రారంభించిన ఏడాదికే ఇలాంటి సమస్యల్ని ఎదుర్కోవడంతో నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్లు, లైట్లు, స్విచ్‌ బోర్డులు వంటి విద్యుత్‌ పరికరాలను పూర్తి స్థాయిలో అందించలేదని తామే కొనుగోలు చేసుకున్నామని పేర్కొంటున్నారు.

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల సముదాయం

వేసవిలో నీటి ఎద్దడి - బంద పోచయ్య, నివాసితుడు

నీటి కొరత కారణంగా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాం. వేసవి కాలంలో నీటి సరఫరా కాకపోవడంతో బయట నుంచి నీటిని మోసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మిషన్‌ భగీరథ పైపులైను చేరువలోనే ఉన్నప్పటికీ కనెక్షన్‌ ఇవ్వడం లేదు. పైకప్పు నిర్మాణం సరిగ్గా లేకపోవడం వల్ల వర్షపు నీరు ఇళ్లలోకి వస్తోంది.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం - జ్ఞానేశ్వర్‌, మల్యాల మండల ఏఈ

రెండుపడక గదుల ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిశీలిస్తాం. వర్షపు నీటి చమ్మ ఇళ్లలోకి రాకుండా పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని