logo

కిట్‌ సరే.. ప్రోత్సాహకమేదీ!

మాతా, శిశు మరణాలను అరికట్టి సర్కారు దవాఖానాల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో శస్త్రచికిత్స ప్రసవాలు తగ్గించడమే లక్ష్యంగా ‘అమ్మఒడి’లో భాగంగా గర్భిణులకు కేసీఆర్‌ కిట్‌ అందజేస్తోంది.

Published : 04 Oct 2022 05:47 IST

అమ్మఒడి నగదు సాయం పంపిణీలో జాప్యం

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి

పెద్దపల్లి ఎంసీహెచ్‌లో బాలింతకు కేసీఆర్‌ కిట్‌ అందజేస్తున్న ఎంపీపీ, అధికారులు

మాతా, శిశు మరణాలను అరికట్టి సర్కారు దవాఖానాల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో శస్త్రచికిత్స ప్రసవాలు తగ్గించడమే లక్ష్యంగా ‘అమ్మఒడి’లో భాగంగా గర్భిణులకు కేసీఆర్‌ కిట్‌ అందజేస్తోంది. దీంతో పాటు మగ బిడ్డ పుడితే రూ.12 వేలు, ఆడపిల్ల పుడితే రూ.13 వేలను నాలుగు విడతల్లో మంజూరు చేస్తోంది. ఈ మేరకు గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ పుట్టిన 6 నెలల వరకు విడతల వారీగా నగదు ప్రోత్సాహకాన్ని అందించాల్సి ఉంటుంది. కాగా ప్రభుత్వ ఆసుప్రతుల్లో ప్రసవం చేసుకున్న మహిళలకు ప్రోత్సాహకాలు అందించడంలో ఎడతెగని జాప్యం కనిపిస్తోంది. గతేడాది నుంచి పంపిణీ నిలిచిపోవడంతో లబ్ధిదారులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

అమ్మఒడి పథకం కింద ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు జిల్లాలో 10,606 మంది గర్భిణులు నమోదు చేసుకున్నారు. అందరికీ కలిపి దాదాపు రూ.30 లక్షల వరకు అందించాల్సి ఉండగా ఏ ఒక్కరికీ నగదు సాయం అందలేదు. కేవలం కేసీఆర్‌ కిట్‌లు మాత్రమే అందిస్తున్నారు. ప్రోత్సాహకం పంపిణీలో జాప్యంపై గ్రామాల్లో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలను లబ్ధిదారులు నిలదీస్తున్నారు. నగదు సాయం ఇంకెప్పుడిస్తారంటూ బాలింతలు, వారి కుటుంబసభ్యులు వైద్య సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు మాత్రం ప్రభుత్వం వద్ద నిధులు లేక జమ చేయడం లేదని చెబుతున్నారు.

ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణ

జిల్లాలో 18 గ్రామీణ, 6 అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి, గోదావరిఖని ప్రాంతీయ వైద్యశాల, సుల్తానాబాద్‌, మంథని సామాజిక ఆసుపత్రులున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పటివరకు మొత్తం 10,606 ప్రసవాలు జరిగాయి. ఇందులో 4,300 సాధారణ, 6,306 శస్త్రచికిత్స ద్వారా నిర్వహించారు. అందరికీ కేసీఆర్‌ కిట్లు అందజేశారు. కేసీఆర్‌ కిట్ల పంపిణీతోనే ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా నగదు ప్రోత్సాహక పంపిణీలో జాప్యం జరుగుతుండటంతో పథకం లక్ష్యానికి విఘాతం కలుగుతోంది. సుదూర ప్రాంతాల నుంచి ప్రసవం కోసం ప్రభుత్వాసుపత్రులకు వచ్చిన వారు తమ ఖాతాలో డబ్బులు జమ కాలేదంటూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఖజనాలో నిధులు లేకపోవడంతో ఇప్పట్లో వీరికి నగదు ప్రోత్సాహకం అందేలా కనిపించడం లేదు.

ఏడాదిగా తిరుగుతున్నా : ఆకుల సరిత, కమాన్‌పూర్‌

సంవత్సర కాలంగా ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నా. ప్రసవానంతరం కేసీఆర్‌ కిట్‌ తప్ప నగదు సాయం ఇప్పటివరకు రాలేదు. ప్రోత్సాహకం కోసం వస్తే రేపు, మాపు అంటూ వాయిదా వేస్తున్నారే తప్ప ఎప్పుడు ఖాతాలో వేస్తారో ఆసుపత్రి సిబ్బంది చెప్పడం లేదు.

నిధులు లేకనే ఈ పరిస్థితి : ప్రమోద్‌కుమార్‌, జిల్లా వైద్యాధికారి

ప్రభుత్వం అందించే నగదు ప్రోత్సాహకాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తోంది. నిధులు లేకపోవడంతోనే అందడం లేదు. కేసీఆర్‌ కిట్లకు కొరత లేదు. నిధులు రాగానే నగదు జమవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని