logo

సమస్యలతో సతమతం

సారంగాపూర్‌ మండలంలోని మ్యాడారంతండా గతంలో రేచపల్లి పంచాయతీ పరిధిలో ఉండగా తండాలను పంచాయతీలుగా మార్చడంతో మ్యాడారం తండాను పంచాయతీగా మార్చారు. దీని పరిధిలోకి తలుపుల తండాలను కలపడంతో పంచాయతీ పరిధిలో 652 జనాభాతో పంచాయతీగా మారింది.

Published : 04 Oct 2022 05:47 IST

గ్రామ పంచాయతీలుగా మారిన తండాల్లో దుస్థితి

న్యూస్‌టుడే, సారంగాపూర్‌

బీర్‌పూర్‌ మండలంలోని కందెనకుంట, చిన్న కొల్వాయి, చిత్రవేణిగూడెం గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చారు. ఆయా తండాల్లో కనీసం అద్దె భవనాలు కూడా లేకపోవడంతో పాఠశాల భవనంలో పంచాయతీ కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు. ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలకు ఉన్న ఒక్క భవనంలోనే ఓ వైపు పాఠశాల, మరోవైపు అంగన్‌వాడీ కేంద్రంతోపాటు పంచాయతీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మూడు ఒకే భవనంలో కొనసాగుతున్నాయి.

సారంగాపూర్‌ మండలంలోని మ్యాడారంతండా గతంలో రేచపల్లి పంచాయతీ పరిధిలో ఉండగా తండాలను పంచాయతీలుగా మార్చడంతో మ్యాడారం తండాను పంచాయతీగా మార్చారు. దీని పరిధిలోకి తలుపుల తండాలను కలపడంతో పంచాయతీ పరిధిలో 652 జనాభాతో పంచాయతీగా మారింది. తలుపుల గూడెం పరిధిలో 60 కుటుంబాలు, 250 మంది గిరిజనులు జీవిస్తున్నారు. వీరు నిత్యవసరాలకు రేచపల్లికి రావాలంటే కనీసం అయిదారు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దాదాపు తండా నుంచి తారు రహదారి వెళ్లాలంటేనే కనీసం మూడు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది. రహదారి మధ్య ఉన్న వంతెన తెగిపోయి నెలలు గడుస్తున్నా.. మరమ్మతులు చేపట్టకపోవడంతో కాలినడకన కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అత్యవసరమైతే తండా నుంచి మ్యాడారం చేరుకుని అక్కడి నుంచి రేచపల్లికి చేరుకునే పరిస్థితి. ప్రస్తుత వర్షాలకు ఆ రహదారి కూడా పూర్తిగా గుంతలమమమై బురదతో గిరిజనులు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది.

మౌలిక వసతుల్లేక అవస్థలు

పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసినప్పటికీ సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పేరుకు పంచాయతీ ఏర్పాటైనా మౌలిక వసతులు సమకూర్చకపోవడంతో తండాల్లో అవస్థలు పడుతూ ఉన్నారు. జిల్లాలో అత్యధికంగా గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చినప్పటికీ సమస్యలు తొలగకపోవడంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. జిల్లాలో 330 పంచాయతీలు ఉండగా ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా మార్చడంతో 380కి చేరుకున్నాయి. ఇందులో 25 గిరిజన తండాలు కాగా 35 అనుబంధ గ్రామాలను పంచాయతీలుగా మార్చారు. పంచాయతీల పరిధిలోని తండాల్లో రహదారులు లేకపోగా, ఉన్న రహదారులు ఇటీవల వర్షాలకు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. నెలలు గడుస్తున్నా కనీసం రహదారులకు మరమ్మతులు కూడా చేపట్టడంలేదు. ఆయా తండాల్లో కనీస మౌలిక వసతులు కల్పించడంలోనూ నిర్లక్ష్యం చేస్తుండడంతో అవస్థలు పడాల్సి వస్తుంది.

అద్దె భవనాల్లో పాలన

గిరిజన తండాల్లో కొనసాగుతున్న పంచాయతీల్లో కార్యాలయాలకు భవనాలు లేకపోవడంతో పల్లెపాలన ఇబ్బందిగా మారింది. ఇప్పటికే పాత పంచాయతీల్లోనే భవనాలు లేక శిథిలావస్థలో ఉన్న భవనాల్లో పాలన కొనసాగిస్తున్నారు. నూతనంగా ఏర్పాటైన పంచాయతీల్లో కనీసం అద్దె భవనాలు కూడా లేకపోవడంతో కార్యాలయాలను అద్దె భవనాలు, చెట్ల కింద, ప్రభుత్వ పాఠశాలలు, సంఘ భవనాల్లో కొనసాగిస్తున్నారు. నూతనంగా ఏర్పాటైన పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయించడమే కాకుండా పక్కా భవనాలు నిర్మించేందుకు నిధులు కేటాయించాలని కోరుతున్నారు.

సారంగాపూర్‌ మండలంలోని భీంరెడ్డిగూడెం పంచాయతీ కార్యాలయాన్ని పాఠశాల కిచెన్‌ షెడ్డులో కొనసాగిస్తుండగా.. గ్రామం నుంచి పంచాయతీకి వెళ్లేందుకు చెరువు కట్టపై రహదారి నిర్మించినప్పటికీ మత్తడిపై నుంచి రాకపోకలు సాగించాల్సి వస్తుంది. అధిక వర్షాలు కురిసిన సమయంలో రాకపోకలు నిలిచిపోయి, అత్యవసర పరిస్థితుల్లో నానాఅవస్థలు పడడమే కాకుండా మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి. బీర్‌పూర్‌, సారంగాపూర్‌ మండలాల్లోని గిరిజన తండాలలోనే కాకుండా జిల్లాలోని అనేక గిరిజన తండాలలో ఇదే పరిస్థితి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని