logo

పాఠకులకు చేరువగా మరిన్ని సేవలు

పుస్తక నిలయాలైన గ్రంథాలయాల్ని ఆధునిక బాట పట్టిస్తానని.. ఏళ్లతరబడి వెంటాడుతున్న సమస్యలను ఒక్కోటిగా పరిష్కరిస్తానని జిల్లా గ్రంథాలయాల సంస్థ ఛైర్మన్‌ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఛైర్మన్‌గా బాధ్యతల్ని స్వీకరించిన ఆయన ‘ఈనాడు - ముఖాముఖి’లో పలు విషయాల్ని వెల్లడించారు.

Updated : 04 Oct 2022 06:26 IST

జిల్లా గ్రంథాలయాల సంస్థ ఛైర్మన్‌ అనిల్‌కుమార్‌గౌడ్‌

ఈనాడు, కరీంనగర్‌

పుస్తక నిలయాలైన గ్రంథాలయాల్ని ఆధునిక బాట పట్టిస్తానని.. ఏళ్లతరబడి వెంటాడుతున్న సమస్యలను ఒక్కోటిగా పరిష్కరిస్తానని జిల్లా గ్రంథాలయాల సంస్థ ఛైర్మన్‌ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఛైర్మన్‌గా బాధ్యతల్ని స్వీకరించిన ఆయన ‘ఈనాడు - ముఖాముఖి’లో పలు విషయాల్ని వెల్లడించారు. ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చే యువతకు అన్ని రకాల కొలువులకు ఉపయుక్తమైన సమాచారంతో కూడిన పుస్తకాలన్నింటిని అందుబాటులో ఉంచుతానని.. మొక్కుబడిగా మారుతున్న సేవల్లో మంచి మార్పులను తీసుకొస్తానంటున్న తీరు ఛైర్మన్‌ మాటల్లోనే...

ఆధునికీకరణ దిశగా..

యువత సహా అన్ని వర్గాలను చైతన్యపరిచే వాటిలో గ్రంథాలయాల పాత్ర కీలకం. జిల్లాలో ఉన్న 13 పఠనాలయాల్లో వసతులు, సౌలభ్యాల కల్పనలో మంచి మార్పుని తీసుకొచ్చేలా నా మొదటి ప్రాధాన్యం చేతల్లో చూపిస్తాను. ప్రాభవాన్ని కోల్పోతున్నాయనే విమర్శల నుంచి సరికొత్త వైభవం అందించేలా నా వంతు చొరవను చూపిస్తాను. మంత్రి గంగుల కమలాకర్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌కుమార్‌, మేయర్‌ సునీల్‌రావు సహకారంతోపాటు మంత్రి కేటీఆర్‌ దృష్టికి ఇప్పుడున్న సమస్యల్ని తీసుకెళ్లి పరిష్కరించేలా మెరుగైన ప్రగతిని పనితీరుతో చూపిస్తాను. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని ఆధునికీకరించే దిశగా పనులు త్వరలో ప్రారంభమవనున్నాయి. స్మార్ట్‌సిటీ నిధులు రూ.7కోట్లతో బహుళ అంతస్తుల్లో భవనం నిర్మించనున్నాం. తాత్కాలికంగా చదువరులకు ఇబ్బంది కావద్దనేలా రూ.50లక్షలతో షెడ్డుని ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా ఇక్కడ పఠనాలయాన్ని పక్కకు కొనసాగిస్తాం. పలుచోట్ల నిర్మాణ దశలో ఉన్న భవనాలను వీలైనంత తొందరగా అందుబాటులోకి తెస్తాం. ఖాళీగా ఉన్న పోస్ట్‌ల భర్తీకి అవసరమైన ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపి ఇన్నాళ్ల ఇక్కట్లను తీర్చేలా ప్రత్యేక దృష్టి పెడతాను.

పోటీ పరీక్షలకు..

ఉద్యమ సమయం నుంచి ఒక యువకుడిగా, నిరుద్యోగిగా నాకు పుస్తకాల విలువ తెలుసు. పేద కుటుంబాలకు చెందిన వారే గ్రంథాలయాలకు వస్తారు. వారికి ఉపయోగపడే పోటీపరీక్షల పుస్తకాలన్నింటిని తెప్పిస్తాను. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 75,736 పుస్తకాలున్నాయి. వీటి సంఖ్యను రెండింతలుగా పెంచుతాను. 20,777 ఆంగ్ల పుస్తకాల్లో మరిన్ని కొత్తవి తేవాల్సిన అవసరముంది. 8,467 హిందీ, 4,434 ఉర్దూ, 225 సంస్కృత పుస్తకాలున్నాయి. పాత పుస్తకాల స్థానంలో కొత్తవాటి సంఖ్య పెంచాల్సి ఉంది. ఏ తరహా పుస్తకాలవసరమనేది గుర్తించి ఇక్కడికి నిత్యం చదువుకునేందుకు వస్తున్న సుమారు 400 మందికి అందించేలా చూస్తాను. గతంలో ఎన్నడు లేని విధంగా ప్రభుత్వ కొలువులకు నోటిఫికేషన్లు వెలువడుతున్న దృష్ట్యా దాతల సహకారంతో ఉచిత శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పేలా అవసరమైన ప్రణాళికను రూపొందిస్తాం. ముఖ్యుల సలహాలు సూచనలతో అన్ని రకాల పుస్తకాలు ప్రతి పఠనాలయంలో ఉండేలా చూస్తాను. గ్రామ గ్రంథాలయాలు, పుస్తకాలు నిల్వ చేసేందుకు గతంలో ఏర్పాటు చేసిన కేంద్రాల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకుని వాటి సంఖ్యను పెంచేలా చూస్తాను.

ఈ- లైబ్రరీ..

ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్న కంప్యూటర్‌ల వినియోగాన్ని మరింతగా పెంచుతూ ఇక్కడికి వచ్చే వారికి అంతర్జాల సేవలతో కూడిన విజ్ఞానం అందించే విషయమై దృష్టిసారిస్తాను. ప్రస్తుతం సమాచార విజ్ఞానాన్ని చరవాణిల్లోనే వెతుకుతున్న దృష్ట్యా ఎలాంటి సేవలు ఈ- లైబ్రరీ రూపంలో అందితే బాగుంటుందనే సలహాల్ని నిపుణుల నుంచి తీసుకుంటాను. అయిదేళ్ల కిందట రాష్ట్ర వ్యాప్తంగా పాఠకుల సౌకర్యార్థం ఈ- లైబ్రరీని ఏర్పాటు చేయాలని నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) ఆధ్వర్యంలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. డీఈఎఫ్‌( డిజిటల్‌ ఎంపవర్‌మెంట్‌ ఫౌండేషన్‌) చొరవతో మార్పునకు ప్రయత్నించారు. అదే తరహాలో జిల్లాలో అంతర్జాలం సహా కంప్యూటర్‌ పరిజ్ఞానం పరంగా ఏ తరహా సేవలు యువతకు చేరువ చేస్తే బాగుంటుందనే విషయమై ముఖ్యుల సూచనలతో త్వరలోనే మంచి నిర్ణయాన్ని తీసుకుంటాను. సిబ్బంది సమయపాలన సహా అన్నిచోట్ల మెరుగైన సేవలు అందేలా ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తాను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు