logo

పూల సింగిడి..సద్దుల సందడి

పుడమిపై పూల పుంత చెంతనే ఉన్నట్లు.. అంబరాన్నంటిన సద్దుల సంబురం.. తీరొక్క పువ్వు మురిసేలా సాగింది. ఆడపడుచుల పెదాలపై నాట్యమాడిన పాటలు.. పరిమళాలు వెదలజల్లిన బతుకమ్మలు.. గునుగు పూల గుసగుసలు.. తంగేడు పూల తళుకులు.. అతివల గాజుల చప్పట్ల మోతలు.. ఇలా అన్ని కలిసిన వైభవం జిల్లాలో పెద్ద బతుకమ్మ పండుగ రూపంలో ఘనంగా ముగిసింది.

Updated : 04 Oct 2022 06:25 IST

మహిళల ఆటాపాటలు

ఘనంగా ముగిసిన బతుకమ్మ పండుగ

- ఈనాడు కరీంనగర్, కరీంనగర్‌ సాంస్కృతికం

పుడమిపై పూల పుంత చెంతనే ఉన్నట్లు.. అంబరాన్నంటిన సద్దుల సంబురం.. తీరొక్క పువ్వు మురిసేలా సాగింది. ఆడపడుచుల పెదాలపై నాట్యమాడిన పాటలు.. పరిమళాలు వెదలజల్లిన బతుకమ్మలు.. గునుగు పూల గుసగుసలు.. తంగేడు పూల తళుకులు.. అతివల గాజుల చప్పట్ల మోతలు.. ఇలా అన్ని కలిసిన వైభవం జిల్లాలో పెద్ద బతుకమ్మ పండుగ రూపంలో ఘనంగా ముగిసింది. ప్రకృతి ఒడిలో పూసిన విరుల జాతరను ఊరూవాడల్లో సోమవారం అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు. పల్లె, పట్టణాల్లోని వాకిళ్లన్ని మురిసేలా.. సంప్రదాయ వేడుకకు వన్నె తెచ్చేలా మహిళలంతా ఒకచోట గుమిగూడి ఉయ్యాల పాటలతో కొత్త శోభను అద్దారు.  ఎక్కడ చూసినా సింగిడిల మురిపమే కనిపించింది. డప్పుల దరువుల మధ్యన చెరువుల చెంతకు చేరిన బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేశారు. ‘వెళ్లిరా బతుకమ్మ.. వచ్చే ఏడాది మళ్లీ రావమ్మా..’అంటూ బతుకమ్మను ఆడబిడ్డలు ఘనంగా సాగనంపారు. వాయినాలను ఇచ్చి పుచ్చుకొని ఇంటి బాట పట్టారు. 

నగరంలో సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి.  రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, మేయర్‌ యాదగిరి సునీల్‌రావులు రమాసత్యనారాయణ ఆలయం, సీతారాంపూర్, రాంనగర్‌ మార్క్‌ఫెడ్‌ మైదానం, లేక్‌ పోలీసుస్టేషన్, గౌతమినగర్, హనుమాన్‌నగర్‌ ప్రాంతాల్లో బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొని అనంతరం నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాశక్తి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ  బండి సంజయ్‌కుమార్‌ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. రాంనగర్‌లో డిప్యూటీ మేయర్‌ చల్లా స్వరూపరాణి, హరిశంకర్‌ల ఆధ్వర్యంలో డివిజన్‌ పరిధిలోని అన్ని బతుకమ్మ కూడళ్లలో రంగులు వేయించారు. పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడికి తరలివచ్చి బతుకమ్మ ఆడారు.  గంజ్, టవర్‌ సర్కిల్‌లో పెద్ద పెద్ద బతుకమ్మలు వైవిధ్యభరితంగా ఉండటంతో వందలాది మంది వాటిని వీక్షించి తరించారు. మహాశక్తి, రాంనగర్‌ రమాసత్యనారాయణస్వామి ఆలయం ప్రాంగణానికి పెద్ద ఎత్తున ఆడపడుచులు, మహిళలు తరలివచ్చి బతుకమ్మ వేడుకలతో మురిసిపోయారు. భగత్‌నగర్‌ శివాలయం ప్రాంగణం, జ్యోతినగర్, రాంచంద్రాపురికాలనీ, కోతి రాంపూర్, మంకమ్మతోట, కట్ట రాంపూర్, సంతోష్‌నగర్, సూర్యనగర్, భాగ్యనగర్, విద్యానగర్, ఆదర్శనగర్, హౌజింగ్‌బోర్డు కాలనీ, సప్తగిరికాలనీ, శ్రీనగర్‌ కాలనీలో గుంపులుగా మహిళలు బతుకమ్మలను ఎత్తుకొని కూడళ్లకు చేరుకొని రాత్రి 9 గంటల వరకు ఆటపాటలతో సందడి చేశారు. పద్మనాయక కల్యాణమండపంలో జువ్వాడి మనోహర్‌రావు, కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మానేరు డ్యాం, మానకొండూరు చెరువు వద్ద నిమజ్జనం చేశారు.

పద్మనాయక కల్యాణమండపంలో వేడుకలు

హుజూరాబాద్‌లో..

బతుకమ్మతో ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ దంపతులు

బతుకమ్మను నిమజ్జనం చేస్తున్న మంత్రి గంగుల, నారదాసు

బతుకమ్మ పేరుస్తున్న మంత్రి కొప్పుల  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు