logo

ప్రభుత్వ కళాశాలలు.. సమస్యలకు నిలయాలు

మెరుగైన విద్యతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం విద్యార్థులకు అవసరం.. బీర్‌పూర్‌, సారంగాపూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కనీస వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఆయా కళాశాలలో దాదాపు 600 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

Published : 05 Oct 2022 05:16 IST

మెట్ల కింద తరగతి నిర్వహిస్తున్న దృశ్యం

న్యూస్‌టుడే, సారంగాపూర్‌: మెరుగైన విద్యతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం విద్యార్థులకు అవసరం.. బీర్‌పూర్‌, సారంగాపూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కనీస వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఆయా కళాశాలలో దాదాపు 600 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో బీర్‌పూర్‌లో 380, సారంగాపూర్‌లో 210 మంది తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో సగానికి పైగా బాలికలు ఉన్నారు. ఏటా ఫలితాల్లో జిల్లాల్లో ఆదర్శంగా నిలుస్తున్నప్పటికీ సమస్యలతో సతమతమవుతున్నారు.  

పరికరాలు బీరువాలకు పరిమితం

కళాశాలలో ప్రయోగ పరికరాలు ఉన్నప్పటికీ వాటిని వినియోగించేందుకు ప్రత్యేక గది లేదు. దీంతో విలువైన పరికరాలు బీరువాలకే పరిమితం అవుతున్నాయి. విద్యార్థులకు సైతం ప్రయోగాలపై కనీస పరిజ్ఞానం ఉండటం లేదు. దీని కోసం గది నిర్మించాలని కోరుతున్నారు. గ్రంథాలయం లేకపోవడంతో విద్యార్థులకు పుస్తకపఠనంపై అవగాహన కొరవడుతోంది. చివరకు విద్యార్థులే వారి సొంత డబ్బులు, ఉపాధ్యాయుల సహకారంతో సమస్యల్ని తాత్కాలికంగా తీర్చుకుంటున్నారు.

బస్సు రాకపోవడంతో ఇబ్బందులు

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు వివిధ పరిసర గ్రామాల నుంచి విద్యార్థులు రావాలంటే బస్సుపై ఆధారపడాల్సిందే. అయితే వేళకు బస్సు రాకపోవడం, సాయంత్రం సమయంలో ఇంటికి వెళ్లడం ఇబ్బందిగా మారడంతో విద్యార్థులు కళాశాలకు రావడంలేదు. ఇది విద్యార్థుల హాజరు శాతంపై కూడా ప్రభావం చూపుతోంది. అధికారులు స్పందించి వేళకు బస్సు సౌకర్యాన్ని కల్పించాలని కోరుతున్నారు.

గ్రంథాలయం లేక తరగతిలోనే మూలన పడేసిన పుస్తకాలు

తరగతి గదుల కొరత

సారంగాపూర్‌ కళాశాలలో తరగతి గదులు కొరత ప్రధాన సమస్యగా మారింది. మూడు కోర్సుల్ని తెలుగు, ఆంగ్ల మ్యామాల్లో నిర్వహిస్తుండగా కేవలం ఆరు గదులు ఉన్నాయి. ఇందులో ఒక్కో తరగతిగదిలో గ్రంథాలయం, ప్రయోగశాల, శుద్ధజల కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా అధ్యాపకుల స్టాఫ్‌ రూమ్‌, మెట్ల కింద కూడా తరగతులు నిర్వహిస్తున్నారు. బీర్‌పూర్‌లో తరగతి గదులు ఉన్నప్పటికీ కింద గచ్చు చేయకపోవడంతో దుమ్ముతోపాటు వర్షం పడితే గదిలోకి నీరు వచ్చి చేరుతున్నాయి. బీర్‌పూర్‌లో ప్రహరీ లేకపోవడంతో ఏటా నాటిన మొక్కల్ని పశువులు పాడుచేస్తున్నాయి.

గ్రంథాలయాన్ని అందుబాటులోకి తేవాలి - శివంతి, విద్యార్థిని

గ్రంథాలయానికి ప్రత్యేక గది లేకపోవడం వల్ల పుస్తకాలకు దూరమవుతున్నాం. తరగతి గదికే పరిమితం అవ్వడం వల్ల ఇతర అంశాలపై అవగాహన ఉండటం లేదు. ఈ ఏడాదికి సంబంధించి కొత్త పాఠ్యపుస్తకాలు రాలేదు. దీంతో పాత పుస్తకాలనే చదవాల్సి వస్తోంది. వివిధ గ్రామాల నుంచి వచ్చి వెళ్లడం ఆలస్యం అవుతుండటం వల్ల కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి.

మెట్లకింద బోధన -వేణు, ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌, సారంగాపూర్‌

కళాశాలలో మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కనీసం తరగతి గదులు లేక అధ్యాపకుల విశ్రాంత గది, మెట్ల కింద బోధన చేయాల్సిన పరిస్థితి. ప్రయోగాలకు ప్రత్యేక గదులు లేకపోవడంతో పరికరాలు బీరువాల్లోనే పెడుతున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని