logo

హుజూరాబాద్‌లో ఇదేం పంచాయితీ..?

నెలరోజుల కిందట హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన ఓ ఎంపీపీ భర్త ఏకంగా తనకున్న అనుమతి తుపాకీని బయటకు కనిపించేలా ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అధికార పార్టీకి చెందిన ఈ నాయకుడి వ్యవహారంపై తీవ్ర దుమారం చెలరేగింది.

Published : 05 Oct 2022 05:16 IST
తరచూ వివాదాల్లో కొందరు నేతలు
ఈనాడు, కరీంనగర్‌

* నెలరోజుల కిందట హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన ఓ ఎంపీపీ భర్త ఏకంగా తనకున్న అనుమతి తుపాకీని బయటకు కనిపించేలా ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అధికార పార్టీకి చెందిన ఈ నాయకుడి వ్యవహారంపై తీవ్ర దుమారం చెలరేగింది. నియోజకర్గంలో విచ్చలవిడిగా తుపాకులను ఇస్తున్నారనేలా ఈ నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పోలీసుల వైఖరిని తప్పుబట్టారు.  దీనికి స్పందించిన జిల్లా పోలీసు బాస్‌ రెండేళ్లల్లో కేవలం ఇద్దరికి మాత్రమే తుపాకులను ఇచ్చామని తెలిపారు.


* రెండు రోజుల కిందట ఇదే నియోజకవర్గంలోని కమలాపూర్‌ మండలానికి చెందిన ఓ నేత హుజూరాబాద్‌ ఏసీపీ కార్యాలయంలో నానా రచ్చ చేశారు. తమపై అకారణంగా పోలీసులు కేసు నమోదు చేశారనే ఆగ్రహంతో వారిని తిడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఒక వర్గానికి చెందిన వారికి రావాల్సిన లక్షలాది రూపాయల వ్యవహారమే ఈ గొడవకు కారణమనేది తెలుస్తోంది. పైగా ఈ పైసల పంచాయతీకి ఏకంగా ఏసీపీ కార్యాలయం వేదికగా మారడం విమర్శలకు దారి తీసింది. అధికారపార్టీకి చెందిన ఓ బడానేతతోపాటు పోలీసు శాఖలోని ఓ ఉన్నతాధికారి జోక్యంతోనే అటూ.. ఇటూ వర్గాల తగువు ఠాణా దాకొచ్చిందనే ఆరోపణలున్నాయి.


హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రతి నిత్యం ఏదో ఒక వివాదం అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా కొందరు నేతల అత్యుత్సాహం వల్ల పలువురు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఇటీవల భూ తగాదాల్లో తలదూర్చే కొందరు సెటిల్‌మెంట్లతో హల్‌చల్‌ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎక్కువగా భూ తగాదాల విషయంలో జోక్యం చేసుకుంటున్నారనేది ఇక్కడ బాహాటంగానే చర్చ జరుగుతోంది. ఓ ముఖ్య నేత సహకారంతో కొన్ని మండలాల్లోని నాయకులు రెచ్చిపోతున్నారని వినిపడుతోంది.

తుపాకులెంత మందికి..?

ఇక్కడి నియోజకవర్గంలో ఇటీవల జరిగిన కొన్ని పంచాయతీల్లో కొందరు నాయకులు తుపాకులను చూపిస్తూ పంచాయతీలు చేస్తున్నారనే పుకార్లు షికార్లు కొడుతున్నాయి. గడిచిన రెండేళ్లల్లో కేవలం ఇద్దరు నాయకులకు మాత్రమే తాము అనుమతి తుపాకీలను ఇచ్చామని పోలీసు ఉన్నతాధికారులు ఇటీవలే విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇంకా ఎవరి దరఖాస్తులు కూడా పెండింగ్‌లో లేవని పేర్కొన్నారు. కాని ఇక్కడ వీటిని వినియోగించే వారి సంఖ్య పదుల సంఖ్యలో ఉంటుందనేలా ప్రచారం సాగుతోంది. ఫలానా.. నాయకుడికి కూడా తుపాకీ ఉందటా..? అనేలా ఎక్కడపడితే అక్కడ మాటలు పలువురి నుంచి వినిపిస్తున్నాయి. ఏదైనా వివాదంలో వీటిని ఇష్టానుసారంగా ఉపయోగిస్తే ఊహించని నష్టం వాటిల్లే వీలుంటుంది. అందుకనే శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు ఈ తుపాకీ సంస్కృతిపైన  దృష్టి పెట్టాల్సిన అవసరముంది.

పోలీసుల తీరుపై...

పారదర్శకంగా విధి నిర్వహణలో అన్నివర్గాల ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు పోలీసుల పనితీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉప ఎన్నికల సమయంలో ఒక పార్టీకి వత్తాసు పలికేల వ్యవహరించడం, కొందరిపై చేయిచేసుకున్నారనే విషయమై అప్పట్లో ఓ పోలీసు అధికారిని అప్పటికప్పుడే బదిలీ చేశారు. ఐదు నెలల కిందట ఇదే నియోజకవర్గంలోని ఓ గ్రామంలో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో కొందరిని తప్పించే ప్రయత్నం చేశారనే విషయమై ఓ సీఐపై సస్పెన్షన్‌ వేటు పడింది. అక్రమదందాలకు సహకారాన్ని అందిస్తున్నారనే ఆరోపణలు కూడా కొందరిపై వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇసుక అక్రమ రవాణా విషయంలో కొందరి పోలీసుల పాత్రపైన కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts