logo

తనిఖీల జోరు

పండుగ సందర్భంగా ప్రైవేటు ఆసుపత్రుల తనిఖీ తాత్కాలికంగా వాయిదా వేశారు. ఎనిమిది రోజులుగా జిల్లావ్యాప్తంగా 10 వైద్య ఆరోగ్యశాఖ బృందాలు తనిఖీలు చేశారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నివేదిక ప్రకారం మొత్తం 457 ఆసుపత్రులను పరిశీలించారు.

Published : 05 Oct 2022 05:16 IST

జిల్లాలో 457 ఆసుపత్రుల్లో పరిశీలన పూర్తి
పండుగ తర్వాత మళ్లీ కొనసాగింపు

న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం: పండుగ సందర్భంగా ప్రైవేటు ఆసుపత్రుల తనిఖీ తాత్కాలికంగా వాయిదా వేశారు. ఎనిమిది రోజులుగా జిల్లావ్యాప్తంగా 10 వైద్య ఆరోగ్యశాఖ బృందాలు తనిఖీలు చేశారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నివేదిక ప్రకారం మొత్తం 457 ఆసుపత్రులను పరిశీలించారు. వీటిలో 80 ప్రైవేటు ఆసుపత్రులు వైద్య ఆరోగ్యశాఖలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోనట్లు తేలింది. మరో 15 ఆసుపత్రుల యాజమాన్యాలు రిజిస్ట్రేషన్‌కు రెన్యూవల్‌ చేసుకోలేదని అధికారులు నిర్ధారించారు. 95 ఆసుపత్రులకు షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి.

ఇంత నిర్లక్ష్యమా?

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం తనిఖీలతో బట్టబయలైంది. ఇప్పటికి కూడా జిల్లాలో ఎన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి? ఏ రకాల వైద్య సేవలు అందిస్తున్నారనే విషయం అధికారులకు స్పష్టత లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆసుపత్రులలో సౌకర్యాలు, అనుమతి వివరాలను తేల్చాలని ఆదేశించడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వివిధ విభాగాల్లోని ప్రోగ్రాం అధికారులతో తనిఖీ చేయిస్తున్నారు. ఈ శాఖ ఉన్నతాధికారుల లెక్కల ప్రకారం 350 ఉంటాయని చెబుతుండగా తాజాగా వీటి సంఖ్య 457కి చేరింది. అల్లోపతి, ఆయుర్వేద, యునాని, హోమియోపతి ఆసుపత్రులతో పాటు రోగ నిర్ధారణ కేంద్రాలను పరిశీలించి వివరాలు సేకరించారు.

అనుమతి కోసం 45 దరఖాస్తులు

ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ కోసం 39, రెన్యూవల్‌కు ఆరు దరఖాస్తులు ఆయా ప్రైవేటు యాజమాన్యాలు సమర్పించాయి. అందరి నుంచి దరఖాస్తులు స్వీకరించి నిబంధనల ప్రకారం ఉన్న వాటికి కొత్తగా రిజిస్ట్రేషన్‌, రెన్యూవల్‌ చేయడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జువేరియా తెలిపారు. జిల్లా పాలనాధికారి అధ్యక్షతన రిజిస్ట్రేషన్‌ అథారిటీ కమిటీ ఉంటుందని, అన్ని పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆర్‌ఎంపీ, పీఎంపీలు అందిస్తున్న వైద్య సేవలపై కూడా తనిఖీలు నిర్వహించాలన్న విషయం తాత్కాలికంగా వాయిదా వేశారు. పండుగ తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యక్రమం ఉంటుందని జిల్లా వైద్యాధికారి చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని